CBI : నీట్ కేసులో సీబీఐ అరెస్టులు షురూ
ABN , Publish Date - Jun 28 , 2024 | 05:30 AM
నీట్ అక్రమాల కేసులో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. పట్నాలో మనీశ్‌కుమార్, అశుతోష్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఒకరిని.. పరీక్ష ముందురోజు, అంటే మే 4వ తేదీన రహస్యంగా బస చేయడానికి ఏర్పాట్లు
పట్నాలో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం
గుజరాత్‌లో ముగ్గురు విద్యార్థులను ప్రశ్నించిన సీబీఐ అధికారులు
మార్కుల గణనలో వైరుధ్యాలపై ఎన్‌టీఏకి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ, జూన్ 27: నీట్ అక్రమాల కేసులో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. పట్నాలో మనీశ్‌కుమార్, అశుతోష్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఒకరిని.. పరీక్ష ముందురోజు, అంటే మే 4వ తేదీన రహస్యంగా బస చేయడానికి ఏర్పాట్లు చేసిన ఆరోపణలపై మరొకరిని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. అనంతరం వీరిని ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. వీరిలో అశుతోష్ కుమార్.. పట్నాలోని ‘లెర్న్ బాయ్స్ హాస్టల్ అండ్ ప్లే స్కూల్’ని ప్రత్యేకంగా నీట్ అభ్యర్థుల బస కోసం అద్దెకు తీసుకున్నాడు. బిహార్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు ఆ స్కూల్‌లోనే.. కాల్చేసిన నీట్ ప్రశ్నపత్రం అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక మనీశ్ కుమార్.. నీట్ ప్రశ్నపత్రాన్ని ముందే ఇస్తానంటూ అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అశుతోష్ అద్దెకు తీసుకున్న ప్లేస్కూల్‌కు అభ్యర్థులను తీసుకొచ్చి.. వారికి ప్రశ్నపత్రంతోపాటు, ఆన్సర్ కీని కూడా ఇచ్చాడు. మర్నాడు పరీక్షా కేంద్రాలకు వెళ్లేదాకా వారు అక్కడే ఉన్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వీరిద్దరినీ ప్రశ్నించడానికి తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును సీబీఐ కోరనుంది. మరోవైపు.. నాలుగు రోజులుగా గుజరాత్‌లోని గోధ్రాలో ఉన్న మరో ప్రత్యేక బృందం అక్కడ నీట్‌లో ఉత్తీర్ణత సాధించడం కోసం రూ.10 లక్షలు ఇచ్చినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అభ్యర్థులను, వారి తల్లిదండ్రులను గురువారం ప్రశ్నించింది. అలాగే.. నీట్ అవకతవకలకు కేంద్రబిందువుగా మారిన అక్కడి జే జలరామ్ స్కూల్ యజమాని దీక్షిత్ పటేల్‌నూ ప్రశ్నించింది.
మీరేమంటారు?
నీట్ మార్కుల కేటాయింపులో వైరుధ్యాలు, ఓఎంఆర్ షీట్లను విద్యార్థులకు ఇవ్వడంలో వైఫల్యాల గురించి పలు ఆరోపణలు చేస్తూ ఒక కోచింగ్ సెంట ర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)కి సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది. కోచింగ్ సెంటర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ ఆర్ బసంత్.. ఈ లోపాల గురించి ధర్మాసనానికి నివేదించారు. అయితే.. ఈ పిటిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దాఖలు చేయడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ను కోచింగ్ సెంటర్ దాఖలు చేయడమేమిటని ప్రశ్నించింది. ఓఎంఆర్ షీట్లకు సంబంధించి ఫిర్యాదులకు కాలపరిమితి ఏమైనా ఉందా అని కోర్టు ప్రశ్నించగా.. దానిపై తాను ఎన్‌టీఏని అడిగి తెలుసుకోవాల్సి ఉందని, కాబట్టి ఈ పిటిషన్‌ను జూలై 8కి వాయిదా వేసి, ఆరోజు విచారించే మిగతా పిటిషన్లతో కలిపి విచారించాలని ఎన్‌టీఏ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ధర్మాసనం తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. అలాగే.. నీట్ ప్రశ్నపత్రంలో సిలబ్‌సలో లేని ప్రశ్న ఇవ్వడం, మరో ప్రశ్నకు తప్పు ఆన్సర్‌ను సమాధానంగా గుర్తించడంపై ఢిల్లీ హైకోర్టులో ఒక విద్యార్థి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రెండువారాల్లోగా స్పందన తెలపాలంటూ ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి, ఎన్‌టీఏకి, నేషనల్ మెడికల్ కమిషన్‌కు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
జొరబడి.. నిరసన..
నీట్ అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, కాంగ్రెస్ విద్యార్థి విభాగాలకు చెందిన దాదాపు వందమంది సభ్యులు.. గురువారం ఢిల్లీలోని ఎన్‌టీఏ కార్యాలయంలోకి చొరబడి నిరసన తెలిపారు. మరోవైపు.. నీట్ అక్రమాలను, అగ్నివీర్ పథకాన్ని నిరసిస్తూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేతబూని.. పెద్దపెట్టున నినాదాలతో నిరసన తెలిపారు.