Tamil Nadu: స్టాలిన్ సర్కార్ కు గవర్నర్ షాక్.. ఆ పని చేయలేనంటూ నిరాకరణ..
ABN , Publish Date - Feb 12 , 2024 | 01:53 PM
తమిళనాడు అసెంబ్లీలో ప్రసంగాన్ని చదివేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్.రవి నిరాకరించారు. ప్రసంగానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించాలని సభ్యులను కోరినా సరిగ్గా స్పందించలేదన్నారు.
తమిళనాడు అసెంబ్లీలో ప్రసంగాన్ని చదివేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్.రవి నిరాకరించారు. ప్రసంగానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించాలని సభ్యులను కోరినా సరిగ్గా స్పందించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రసంగంలోని విషయాలను ఏకీభవిస్తే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని తెలిపారు. ఫలితంగా తాను ఈ విషయాలతో ఏకీభవించలేనని పేర్కొన్నారు. ప్రసంగాన్ని అంతటితో ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ బడ్జె్ట్ సమావేశాల మొదటి రోజే ఈ ఘటన జరగడం ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. గతేడాది చేసిన గవర్నర్ ప్రసంగంలోని ఆమోదించిన విషయాలను మాత్రమే రికార్డ్ చేయాలని స్పీకర్‌ను కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ ను పిలవడం ఆనవాయితీ. దీంతో ఉదయం 10 గంటలకు గవర్నర్ ఆర్ఎన్. రవి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు శాసనసభకు వచ్చిన గవర్నర్‌కు స్పీకర్ అప్పారావు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ తన ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు. తమిళంలో అందరికీ నమస్కారం చెప్పారు. ప్రసంగంలోని అంశాలను చదవలేనంటూ 2 నిమిషాల్లో ప్రసంగం ముగించేశారు.
గవర్నర్ వెళ్లిపోవడంతో ప్రసంగాన్ని స్పీకర్ అప్పారావు చదివారు. కాగా.. గత సమావేశాల్లో ప్రసంగంలోని కొన్ని విషయాలను మాత్రమే గవర్నర్ విస్మరించగా.. ఈ సారి మొత్తం ప్రసంగం చదవకపోవడం గమనార్హం.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.