Share News

Vajpayee: మరపురాని రాజనీతిజ్ఞుడు

ABN , Publish Date - Dec 25 , 2024 | 03:30 AM

వాజపేయి దేశ ప్రధానిగా మూడు పర్యాయాలు బాధ్యతలు నిర్వర్తించారు. తొలిసారి కేవలం 13 రోజులే ఆ పదవిలో ఉండగా, రెండోదఫాలో 13 నెలలపాటు అధికారంలో ఉండటం విశేషం.

Vajpayee: మరపురాని రాజనీతిజ్ఞుడు

భారత రాజకీయాల్లో వాజపేయిది చెరిగిపోని ముద్ర

నైతిక విలువలకు కట్టుబడిన రాజకీయం.. పార్టీలకు అతీతమైన రాజనీతిజ్ఞత.. పార్లమెంటులో ఎంపీలనే కాదు.. విద్యారంగ సదస్సులో విద్యావేత్తల్ని, బహిరంగ సభల్లో సామాన్య ప్రజల్ని సైతం సమ్మోహుతుల్ని చేసే ఉపన్యాస ఝరి, భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ వారసత్వ సంపదే ఈ దేశం ఆత్మ అనే తాత్విక అవగాహన.. ఇవన్నీ కలిపితే అటల్‌ బిహారీ వాజపేయి అవుతారు. రాజకీయ పార్టీల, సిద్ధాంతాల సరిహద్దులకు అతీతంగా గౌరవాభిమానాల్ని పొందిన ఆజాతశత్రువు ఆయన. వాజపేయి శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన జీవితంలో స్ఫూర్తినిచ్చే ఘట్టాల అవలోకనం.

మూడుసార్లు ప్రధానిగా దేశ సారథ్యం

అనైతిక పద్ధతుల్లో అధికారం వద్దన్న నైతికత.. ఐదేళ్లు తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం

రక్షణరంగం బలోపేతానికి పోఖ్రాన్‌

పాక్‌తో మైత్రికి లాహోర్‌ బస్సు యాత్ర

కార్గిల్‌ యుద్ధంతో పాక్‌కు గుణపాఠం

(సెంట్రల్‌ డెస్క్‌)

వాజపేయి దేశ ప్రధానిగా మూడు పర్యాయాలు బాధ్యతలు నిర్వర్తించారు. తొలిసారి కేవలం 13 రోజులే ఆ పదవిలో ఉండగా, రెండోదఫాలో 13 నెలలపాటు అధికారంలో ఉండటం విశేషం. మూడోసారి మాత్రం పూర్తి కాలంపాటు ప్రధాని పదవిలో కొనసాగారు. 1996లో జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది కానీ మెజారిటీ సమకూరలేదు. రాష్ట్రపతి ఆహ్వానంతో వాజపేయి మే నెలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, మెజారిటీ సంపాదించుకోలేకపోవటంతో 13 రోజుల వ్యవధిలోనే ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి బదులిస్తూ.. ‘పార్టీలను చీల్చి కొత్త భాగస్వాములతో కలిసి అధికారాన్ని చేపట్టటం నా లక్ష్యం కాదు. ఆ విధంగా దక్కిన అధికారాన్ని నేను కనీసం పట్టకారుతో కూడా తాకటానికి ఇష్టపడను’ అంటూ వాజపేయి చేసిన ప్రసంగం ఆయన కట్టుబడిన నైతిక విలువలకు అద్దం పట్టింది. ప్రధానిగా ఆయన తొలిదఫా ప్రభుత్వమిది. అయినప్పటికీ, అనైతికమార్గాల్లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటానికి వాజపేయి ఎంతమాత్రం ప్రయత్నించలేదు. రెండోసారి కూడా అంతే. రెండేళ్ల వ్యవధిలోనే 1998లో మళ్లీ లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి మెజారిటీ దక్కనప్పటికీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. పలు పార్టీల మద్దతుతో కలిసి వాజపేయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ, మరుసటి ఏడాదే అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగింది. విశ్వాస పరీక్షలో కేవలం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం ఓడిపోయి.. వాజపేయి రాజీనామా చేశారు. అదే ఏడాది మళ్లీ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి (రెండేళ్లలో మూడుసార్లు). ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 303 సీట్లతో మెజారిటీ సాధించి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం 2004 వరకూ కొనసాగింది. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు విజయవంతంగా నడిపించిన తొలి నేత వాజపేయి.

gthj.jpg


కార్గిల్‌ విజయం

వాజపేయి హయాంలో జరిగిన కార్గిల్‌ యుద్ధం.. భారత సైన్యం చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. 1999 మే నెలలో పాకిస్థాన్‌ సైనికులు, మిలిటెంట్లు కార్గిల్‌ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో చొరబాట్లు, ఆక్రమణ ప్రారంభించారు. దీనిని తిప్పికొట్టటానికి మే నెల 26న భారత సైన్యం ఆపరేషన్‌ విజయ్‌ను ప్రారంభించింది. 3 నెలలపాటు జరిగిన యుద్ధంలో 500 మందికిపైగా జవాన్లు అమరులయ్యారు. పాకిస్థాన్‌ వైపున దాదాపు 4 వేల మంది సైనికులు, మిలిటెంట్లు మరణించినట్లు తర్వాత కాలంలో నివేదికలు వెల్లడయ్యాయి. కార్గిల్‌ విజయంతో వాజపేయి ప్రతిష్ఠ పెరిగిపోయింది. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు దీనికి అద్దం పట్టాయి. పూర్తి మెజారిటీతో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చింది.

పోఖ్రాన్‌ అణుపరీక్షలు

1998 మే నెలలో వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే భారత్‌.. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఎడారి ప్రాంతంలో ఐదు భూగర్భ అణుపరీక్షలు నిర్వహించి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. శత్రుదేశాల గుండల్లో రైళ్లు పరిగెత్తించింది. 1974లో భారత్‌ తొలి అణుపరీక్ష నిర్వహించగా.. మళ్లీ 24 ఏళ్ల తర్వాత పోఖ్రాన్‌లో ఆ పరీక్షలు జరిపి తన అణ్వాయుధ పాటవాన్ని యావత్‌ ప్రపంచం ఎదుట చాటిచెప్పింది. తొలుత ఆంక్షలు విధించిన అమెరికా.. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్‌ ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ కేవలం ఆరునెలల్లోనే వాటిని ఎత్తివేసింది.

నెహ్రూనే కట్టిపడేసిన ప్రసంగం

వక్తగా వాజపేయి పార్టీలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. 1957లో ఎంపీగా వాజపేయి లోక్‌సభలో తొలిసారి చేసిన ప్రసంగం నాటి ప్రధాని నెహ్రూను అమితంగా ఆకర్షించింది. ఎంతగానంటే.. అప్పట్లో భారత సందర్శనకు వచ్చిన ఓ విదేశీ నేతకు ఎంపీలను పరిచయం చేస్తూ.. వాజపేయి దగ్గరికి వచ్చే సరికి ‘ఈ యువకుడు ఏదో ఒకనాడు భారతదేశ ప్రధానమంత్రి అవుతారు’ అని నెహ్రూ చెప్పారట. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసేతర పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసిన జనతా ప్రభుత్వంలో వాజపేయి విదేశాంగమంత్రిగా పని చేశారు. పార్లమెంటులోని సౌత్‌బ్లాక్‌ నుంచి నెహ్రూ ఫొటోను తొలగించటంపై వాజపేయి అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరిగి ఆ ఫొటోను అక్కడే ఏర్పాటు చేయించారు. వాజపేయి కవి కూడా. స్వయంగా పలు కవితలు రాసిన ఆయన ప్రసంగాల్లోనూ కవితాత్మక ధోరణి కనిపించేది. ‘చోటే మన్‌ సే కోయి బడా నహీ హోతా! టూటే మన్‌ సే కోయీ ఖడే నహీ హోతా!’ (అల్ప బుద్ధి కలవారు గొప్ప పనులు చేయలేరు! హృదయం ముక్కలైన వారు నిటారుగా నిలబడలేరు) వంటి పంక్తులు వాజపేయి ప్రసంగాల్లో జాలు వారి శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుండేవి.


భారత ప్రతినిధిగా విపక్ష నేత

పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో విపక్షనేతగా ఉన్న వాజపేయిని జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాలకు భారత ప్రతినిధిగా పంపించారు. వాజపేయి సామర్థ్యంపై పీవీకి ఉన్న నమ్మకానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తారు. పాకిస్థాన్‌ సేనలతో పోరాడి బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి దారులు వేసిన నాటి ప్రధాని ఇందిరాగాంధీని వాజపేయి అప్పట్లో దుర్గాదేవితో పోల్చారు. దేశానికి సంబంధించిన అంశాల్లో వాజపేయి పార్టీలకతీతంగా వ్యవహరించేవారనటానికి ఇవన్నీ నిదర్శనాలు.

చర్చలే అత్యుత్తమ మార్గం

వాజపేయి ఉత్తమ పార్లమెంటేరియన్లలో ఒకరిగా పేరుగాంచారు. ఆయన ఎల్లప్పుడూ చర్చలు, ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నాలు చేసేవారు. అధికారపక్షం విపక్షాల గొంతు నొక్కటాన్ని ఆయన సమర్థించేవారు కాదు. అలాగే, విపక్షం పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకుంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన చేపట్టటాన్నీ ఆమోదించేవారు కాదు. పత్రికా స్వాతంత్ర్యానికి వాజపేయి అమిత ప్రాధాన్యతనిచ్చేవారు. 2003లో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూ 125వ వార్షికోత్సవంలో మాట్లాడుతూ, ‘భారత ప్రజాస్వామ్యంలో పత్రికాస్వేచ్ఛ విడదీయరాని భాగం. దానికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తోంది. ఈ దేశ సంస్కృతి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించటమే కాదు.. స్వయంగా భిన్నాభిప్రాయాలకు అండగా ఉంటుంది. భిన్న వాదనలను ప్రోత్సహిస్తుంది’ అని చెప్పారు. 2002లో యూజీసీ స్వర్ణోత్సవాల్లో విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రధాని హోదాలో వాజపేయి చెప్పిన మాటలు వింటే.. విద్యారంగాన్ని అమితంగా ప్రేమించే ఓ విద్యావేత్త మాటల్లాగా ఉంటాయి. ‘విద్య అసలు సారం స్వీయ ఆవిష్కరణ. నిన్ను నువ్వు ఒక శిల్పంగా మల్చుకోవటమే ఆ ప్రక్రియ. విద్య ద్వారా లభించే శిక్షణ ఏదో ఒక రంగంలో కొన్ని మెళకువలనో, కొంత జ్ఞానాన్నో సంపాదించటం కాదు.. నీలోని మేధోపరమైన, కళాత్మకమైన, మానవత్వంతో కూడిన సామర్థ్యాలను ఆ శిక్షణ వికసింపజేయాలి’ అని వాజపేయి ఉద్బోధించారు.

లాహోర్‌ బస్సుయాత్ర

దేశ విభజన జరిగి భారత్‌-పాకిస్థాన్‌లుగా విడిపోయిన తర్వాత తొలిసారిగా రెండు దేశాల మధ్య బస్సు సర్వీసును వాజపేయి హయాంలోనే ప్రారంభించారు. ఢిల్లీ-లాహోర్‌ బస్సును ప్రారంభిస్తూ 1999 ఫిబ్రవరిలో వాజపేయి స్వయంగా పాకిస్థాన్‌కు బస్సులో వెళ్లారు. ఈ బస్సు యాత్ర పాకిస్థాన్‌తో సంబంధాలను మెరుగుపరిచింది. వాజపేయి, నాటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సంయుక్తంగా లాహోర్‌ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ఉన్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలని ఈ డిక్లరేషన్‌ నిర్దేశించింది. ఇరుదేశాల సంబంధాలు మెరుగుపడుతున్న దశలో సంభవించిన కార్గిల్‌ చొరబాట్లు పరిస్థితిని తిరిగి క్షీణింపజేశాయి. అనంతరం రెండేళ్లకు 2001లో అప్పటి పాకిస్థాన్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్‌ఫతో ఆగ్రాలో జరిపిన శిఖరాగ్ర సమావేశం కూడా గొప్ప మలుపు. అయితే, అది ఆశించిన ఫలితాలను సాధించలేదు.

Updated Date - Dec 25 , 2024 | 03:30 AM