Share News

CPM: సీపీఎం ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నది వీరే

ABN , Publish Date - Sep 13 , 2024 | 01:06 PM

సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి ఎవరిని వరించనుంది. రేసులో ఎవరెవరు ఉన్నారు. ఏచూరి ఆకస్మిక మరణంతో సీపీఎం నియమావళిలో మార్పులు చేస్తారా..? లేదంటే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారా..?

CPM: సీపీఎం ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నది వీరే
Sitaram Yechury

వామపక్ష అగ్ర నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) కన్నుమూశారు. తదుపరి ప్రధాన కార్యదర్శి ఎవరు.. జాతీయ రాజకీయాల్లో ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. మిగతా పార్టీల్లో అధ్యక్షుల మాదిరి సీపీఎంలో ప్రధాన కార్యదర్శికి అధికారాలు ఉంటాయి. విధానపర నిర్ణయాలను ప్రధాన కార్యదర్శి తీసుకుంటారు. ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టే నేత విధిగా పొలిట్ బ్యూరో సభ్యుడు కావాల్సి ఉంటుంది. సీపీఎం పార్టీ వర్గాల సమాచారం మేరకు ముగ్గురి పేర్లు ప్రధాన కార్యదర్శి పదవి కోసం వినిపిస్తున్నాయి.


CPM.jpg


మహ్మద్ సలీం

బెంగాల్ సీపీఎం కార్యదర్శి మహ్మద్ సలీం పేరు సీపీఎం ప్రధాన కార్యదర్శి రేసులో ముందు వినిపిస్తోంది. సలీం లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. మైనార్టీ వర్గానికి చెందిన నేత. 2015లో విశాఖపట్టణంలో జరిగిన సీపీఎం సమావేశాల్లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా సలీం ఎన్నికయ్యారు. లోక్ సభ ఎన్నికల తర్వాత మైనార్టీలపై కమ్యునిస్టులు, కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించింది. విపక్షాల ఆలోచన ఒక్కటే అయితే మైనార్టీల్లో మరింత పట్టు పెంచుకునేందుకు సలీంకు సీపీఎం ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.


cpm.jpg


ఎంవీ గోవిందన్

మరో నేత ఎంవీ గోవిందన్. ఈయన కేరళ సీపీఎం కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2026లో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పినరయి విజయన్‌తో గోవిందన్‌ మధ్య స్నేహం ఉంది. ఆ క్రమంలో గోవిందన్ వైపు చూడొచ్చనే చర్చ జరుగుతుంది. కమ్యునిస్టుల కంచుకోట కేరళ.. అక్కడ మరోసారి పాగా వేయాలని ఆ పార్టీ కోరుకుంటుంది. గోవిందన్‌కు పగ్గాలు ఇస్తే, పార్టీ క్రమంగా బలోపేతం అవుతుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.


మాణిక్ సర్కార్

త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ పేరు తెరపైకి వచ్చింది. కమ్యునిస్టులకు పశ్చిమ బెంగాల్, కేరళలో పట్టు ఉంది. ఆ రెండు రాష్ట్రాల నుంచి కాకుండా మరో చోట నుంచి ప్రధాన కార్యదర్శిని నియమించాలి అనుకుంటే త్రిపురకు చెందిన మాణిక్ సర్కార్‌కు అవకాశం ఉంటుంది. ఈ ముగ్గురిలో ఒకరిని ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశాలు ఉన్నాయి.


sitaram9.jpg


బాధ్యతలు

సీపీఎంలో జనరల్ సెక్రటరీ పార్టీ సుప్రీం. మిగతా పార్టీల్లో అధ్యక్షులు ఉంటే.. ఇక్కడ జనరల్ సెక్రటరీ ఉంటారు. పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొని విధానపర నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నికల విధానం రూపొందించడం, ఉద్యమ నుంచి నిర్ణయించడం లాంటి విధులు నిర్వహిస్తారు. పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీతో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. అలా డిసిషన్ తీసుకుంటే పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ తొలగించే హక్కు ఉంటుంది.


పదవిలో ఉండగా కన్నుమూత

సీతారాం ఏచూరి సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండగా కన్నుమూశారు. సీపీఎంలో ప్రధాన కార్యదర్శిని పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో చర్చించి ఎన్నుకుంటారు. సీపీఎం నియమావళిలో ఆర్టికల్ 15 (5)లో ప్రధాన కార్యదర్శి ఎంపిక గురించి ఉంది. ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులను కేంద్ర కమిటీ ఎన్నుకుంటుంది. ప్రధాన కార్యదర్శి కావాలంటే ఆ సభ్యుడు విధిగా పొలిట్ బ్యూరో సభ్యుడు కావాల్సి ఉంటుంది. 2015లో ఏచూరి ప్రధాన కార్యదర్శి కాగా.. 2022లో పదవికాలన్ని పొడగించారు. తదుపరి సీపీఎం సమావేశం 2025 ఏప్రిల్ నెలలో జరగాల్సి ఉంది. ఈ క్రమంలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పొలిట్ బ్యూరో నేతను నియమించడం లేదంటే.. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశ తేదీలను ముందుకు తీసుకొచ్చి కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒక విధంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి నియామకం జరగాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Sep 13 , 2024 | 02:25 PM