Share News

Armaan Malik : అదే సంగీతం గొప్పతనం

ABN , Publish Date - Aug 25 , 2024 | 01:28 AM

‘బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ’ అంటూ కుర్రకారుతో స్టెప్స్‌ వేయించినా, ‘అనగనగనా... అరవిందట తన పేరు...’ అంటూ ఉత్సుకతను రేకెత్తించినా... అర్మాన్‌ మాలిక్‌ది విభిన్నమైన శైలి.

Armaan Malik : అదే సంగీతం గొప్పతనం

సండే సెలబ్రిటీ

‘బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ’ అంటూ కుర్రకారుతో స్టెప్స్‌ వేయించినా, ‘అనగనగనా... అరవిందట తన పేరు...’ అంటూ ఉత్సుకతను రేకెత్తించినా... అర్మాన్‌ మాలిక్‌ది విభిన్నమైన శైలి. అర్మాన్‌ తల్లి సొంత ఊరు వైజాగ్‌. అందుకే ‘‘మేము అప్పుడప్పుడు తెలుగులో మాట్లాడుతూ ఉంటాం. తెలుగు నేర్చుకోవడానికి ప్రత్యేకంగా క్లాసులు కూడా తీసుకుంటున్నా’’ అంటున్న అర్మాన్‌ వచ్చే నవంబర్‌లో తనకు ఇష్టమైన వైజాగ్‌లో షో కూడా చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనటానికి హైదరాబాద్‌ వచ్చిన అర్మాన్‌ను ‘నవ్య’ పలకరించింది.

  • మీకు తెలుగు వచ్చా?

అమ్మ, నేను అప్పుడప్పుడు తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటాం. నాకు తెలుగులో మాట్లాడితే అర్థమవుతుంది. ఇంట్లో హిందీ, ఇంగ్లీ్‌షలో మాట్లాడుకుంటాం. కానీ నాకు తెలుగంటే చాలా ఇష్టం. అందుకే తెలుగు నేర్చుకోవటానికి ప్రత్యేకంగా క్లాసులకు వెళుతున్నా.

  • మీరు ఈ సంగీత ప్రపంచంలోకి ఎలా ప్రవేశించారు?

మాది మ్యూజిక్‌ ఫ్యామిలీ కాబట్టి నేను ఈ ప్రపంచంలోకి వచ్చానని అందరూ అనుకుంటూ ఉంటారు. అది కొంతవరకే నిజం. నాకు చిన్నప్పటి నుంచి నేపథ్య సంగీతం పాడాలని ఉండేది. కారణం తెలియదు కానీ సినీ సంగీతం నన్ను చాలా ఆకర్షించేది. నేను మ్యూజిక్‌ కంపోజ్‌ చేస్తాను. కానీ ఒక పాట పాడుతుంటే వచ్చే ఆనందమే వేరు.


  • ఒక సింగర్‌కు సాధన ఎలా ఉపయోగపడుతుంది? మీరు రోజూ ఎన్ని గంటలు సాధన చేస్తారు?

వ్యాయామం చేసే సమయంలో ముందు వార్మ్‌పలు చేస్తారు. మన గాత్రానికి కూడా అలాంటి వార్మప్‌ అవసరం. రోజూ కనీసం పావుగంట సాధన చేస్తాను. పాశ్చాత్య సంగీతాన్ని కూడా పాడటానికి అనువుగా నా స్వరాన్ని తయారుచేసుకుంటా. ఇక కాన్సర్ట్స్‌ ఉన్న సమయంలో... ఏదో ఒక పాటను తీసుకొని ప్రాక్టీస్‌ చేస్తా. దానివల్ల మిగిలిన పాటలు సులభమవుతాయి.

  • స్టేజ్‌ మీద పాడుతున్నప్పుడు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు మర్చిపోయారా?

లండన్‌లోని వెంబ్లీ ఎరినాలో ఒకసారి షో జరిగింది. దీనిలో రెండు గంటలు పాడాను. బయటకు వచ్చిన తర్వాత - ‘‘ఎలా ఫీలయ్యారు?’’ అని అక్కడివారు అడిగారు. నాకు ఆ స్టేజీ మీద పాడిన ఒక పాట కూడా గుర్తు లేదు. అంత తన్మయత్వంలో మునిగిపోయా. నాకే కాదు. అనేకమంది గాయనీ, గాయకులకు ఇలాంటి అనుభవం ఎప్పుడో ఒకప్పుడు కలిగే ఉంటుంది. దీన్ని మామూలు మాటల్లో చెప్పలేను. మైమరిచిపోయానని మాత్రమే చెప్పగలను. సంగీతానికి ఉన్న గొప్పతనం అదే.


  • ఏ భాషలో పాటలు పాడటం కష్టం?

మలయాళం. మీరు ఏ సింగర్‌నైనా అడగండి... మలయాళంలో పాడటం కష్టమని చెబుతారు. ఆ భాష చాలా అందంగా ఉంటుంది. అదే సమయంలో దాన్ని ఒడిసిపట్టుకోవటం కూడా చాలా కష్టం. కొన్ని పదాలను కొన్ని విధాలుగానే పలకాలి.

  • ఏ భాషలో పాడటం సులభం..

తెలుగు, కన్నడలలో పాడటం చాలా సులభమనిపిస్తుంది. రెండు భాషల మధ్య సారూప్యత కూడా ఉంది. ఈ రెండు భాషల్లో పాడుతున్నప్పుడు ఎలాంటి శ్రమ ఉండదు.


  • దక్షిణ భారత దేశంలోని ఒకో భాషకు ఒక ప్రత్యేకత ఉంటుంది. యాస ఉంటుంది. అలాంటప్పుడు - ఆ భాషకు తగ్గట్టుగా ఎలా పాడగలుగుతారు?

జాగ్రత్తగా నేర్చుకుంటే అంత కష్టం కాదు. ఉదాహరణకు నేను తెలంగాణ యాసలోను, ఆంధ్ర యాసలోను, రాయలసీమ యాసలో పాడగలను. ఈ మూడు వేర్వేరు. చిన్న చిన్న పదాలను పట్టించుకుంటే తేడాలు తెలుస్తాయి. జాగ్రత్త తీసుకోకపోతే వేరే భాషకు చెందిన సింగర్‌ పాడుతున్నాడని తెలిసిపోతుంది. నా పాట విన్న వారు- ‘ఇతను మన భాషవాడే’ అనుకోవాలి. అప్పుడే పాటకు న్యాయం చేసిన వాళ్లమవుతాం. లేకపోతే విఫలమయినట్లే.

  • మీకు నచ్చిన సంగీత దర్శకులు ఎవరు?

ఒకరని చెప్పలేను. అనేకమంది ఉన్నారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సర్‌, సంజయ్‌ లీలా భన్సాలీ సర్‌, సలీం-సులైమాన్‌, తమన్‌ సర్‌, అనూప్‌ రూబెన్స్‌, గోపీ సుందర్‌- ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమంది ఉన్నారు.

ఒక్కొక్కరికి ఒకో ప్రత్యేకత ఉంటుంది. ఇక ఈ సంగీత దర్శకులందరూ తమ దగ్గర పాడే సింగర్స్‌కు స్వేచ్ఛను ఇస్తారు. నేను రెహమాన్‌ సర్‌ దగ్గర తొలి సారి పాడేటప్పుడు చాలా భయపడ్డా. కానీ ఆయన ‘‘నువ్వు ఎలా పాడాలనుకున్నావో... అలా పాడు’’ అన్నారు. అదొక అనుభవం.

ఇక సంజయ్‌ లీలా భన్సాలీ సర్‌ చాలా కచ్చితంగా ఉంటారు. నేను ఆయనకు ‘సుకూన్‌’ అనే ఆల్బమ్‌లో ఒక గజల్‌ను ఏడుసార్లు పాడాను. ఏడు నెలలు ఏడు రకాలుగా పాడి వినిపించాను. ఆయన ప్రతి మాటను.. ప్రతి స్వరాన్ని పట్టించుకుంటారు. నేను అన్నిసార్లు ఏ పాటనూ పాడలేదు. నాకు ఇప్పటికీ అదే ఫేవరెట్‌ సాంగ్‌. నాకు ఆ అవకాశం వచ్చినందుకు ఆనందపడుతూ ఉంటాను. ఆ గజల్‌ తర్వాత నేను మంచి సింగర్‌ అయ్యాననుకుంటాను.

-సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - Aug 25 , 2024 | 01:29 AM