Share News

Navya : నేను డైరక్టర్స్‌ నటుడిని

ABN , Publish Date - Jul 21 , 2024 | 12:53 AM

సాధారణంగా ఏ తండ్రయినా తన కొడుకుని నటుడిగా పరిచయం చేస్తుంటాడు. కానీ కొడుకు హీరోగా నటించే సినిమాతో తండ్రి దర్శకుడిగా పరిచయం కావడమనేది నిజంగా అరుదే.

Navya : నేను డైరక్టర్స్‌ నటుడిని

సండే సెలబ్రిటీ

సాధారణంగా ఏ తండ్రయినా తన కొడుకుని నటుడిగా పరిచయం చేస్తుంటాడు. కానీ కొడుకు హీరోగా నటించే సినిమాతో తండ్రి దర్శకుడిగా పరిచయం కావడమనేది నిజంగా అరుదే. ‘ఆపరేషన్‌ రావణ్‌’ చిత్రం విషయంలో అలా జరిగింది. రక్షిత్‌ అట్లూరి హీరోగా నటించగా, ఆయన తండ్రి వెంకట సత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నేపథ్యంలో తండ్రీ కొడుకులిద్దరూ ‘నవ్య’కు చెప్పిన విశేషాలు.

నిర్మాతైన మీకు దర్శకుడు అవ్వాలనే కోరిక ఎందుకు కలిగింది?

వెంకట సత్య: ఒక సినిమా చూసిన తర్వాత దానిని గురించి విశ్లేషించడం నాకు మొదటి నుంచి అలవాటు. కథలు చెప్పడానికి వచ్చే వాళ్లతో, దర్శకులు కావాలనుకునేవారితో తరచూ మాట్లాడుతుంటాను. స్ర్కిప్ట్‌ పరంగా సలహాలు ఇస్తుంటాను. సినిమాలు తీయడానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది, ఇంత బడ్జెట్‌ ఎందుకు అవుతుంది. కథ ఇలా ఉంటే బాగుంటుంది కదా అని.

ఇలా నేను అనుకుంటుంది కరెక్టా కాదా అని చెక్‌ చేసుకోవడం కోసం దర్శకుడిగా మారా. సొంతంగా కథ తయారు చేసుకున్నాను. సినిమాలు బాగా చూస్తుంటాను. అన్ని రకాల బుక్స్‌ చదువుతుంటాను. కథ ఎలా రాయాలి, స్ర్కీన్‌ప్లే అంటే ఏమిటి, లైటింగ్‌ ప్యాట్రన్‌ ఎలా ఉంటుంది అనే అవగాహన పుస్తకాలు చదవడంవల్లే ఏర్పడింది. ఆ ధైర్యంతోనే ‘ఆపరేషన్‌ రావణ’కు దర్శకత్వం వహించా.


రక్షిత్‌: ఒక కొత్త దర్శకుడితో పని చేస్తున్న భావన నాకు ఎప్పుడూ కలగలేదు. మేం ప్రీప్రొడక్షన్‌ వర్క్‌ బాగా చేయడంతో సెట్‌కు వెళ్లిన తర్వాత ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. మిగతా సినిమాలకు, ఈ సినిమాకు ముఖ్యంగా నాకు కనిపించిన తేడా ఏమిటంటే.. అనుకున్న సమయానికి షూటింగ్‌ ప్రారంభించేవాళ్లం. నాన్నగారు పొద్దునే నాలుగు గంటలకు షూటింగ్‌ స్పాట్‌లో ఉండేవారు.

ఏడు గంటలకు ఫస్ట్‌ షాట్‌ తీసేవాళ్లం. ప్రాపర్‌ ప్లానింగ్‌తో, డిసిప్లీన్‌తో వర్క్‌ చేశాం. నాన్నగారు ‘పలాస’ నిర్మాణ సమయంలో బాగా ఇన్‌వాల్వ్‌ అయ్యారు. స్ర్కిప్ట్‌ మీద కమాండ్‌ ఉండడంవల్ల ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ లేకుండా చకచకా వర్క్‌ చేసేవారు. సాధారణంగా ఒక సినిమాకు దర్శకత్వం చేయాలనిపించినప్పుడు పక్కన మరొకరిని కూర్చోపెట్టుకుని వాళ్లతో పని చేయించుకుని, తన పేరు వేసుకుంటుంటారు. కానీ ‘ఆపరేషన్‌ రావణ్‌’ చిత్రం అలా తీసింది కాదు.

పెద్ద పెద్ద ఆరిస్టులను డీల్‌ చేయడం టఫ్‌ జాబ్‌. ఒక కొత్త దర్శకుడు అలా అద్భుతంగా డీల్‌ చేసి 40 రోజుల్లో సినిమాను పూర్తి చేయడం అంటే మాటలు కాదు. కొత్త దర్శకుడు కూడా చక్కని ప్లానింగ్‌తో అలా చేయవచ్చని నాన్నగారు నిరూపించారు.


రక్షిత్‌ ఎలా చేశాడు?

వెంకట సత్య: ‘పలాస’ చిత్రంతో రక్షిత్‌ మంచి పేరు, గుర్తింపు సంపాదించుకునన్నాడు. నాకు రామాయణం, భాగవతం మీద చాలా ఆసక్తి. ఓ సినిమా కథ అయినా వాటి నుంచి పుట్టిందే. ప్రతి పనికి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన దృశ్య రూపంలో వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అనే పాయింట్‌ కొత్తగా అనిపించి ఈ సినిమా తీశాం. ‘మీ ఆలోచనలే మీకు శత్రువులు’ అని ట్యాగ్‌ లైన్‌ ఇచ్చాం. ఒక మామూలు మనిషి సైకోగా మారడానికి ఆలోచనలు ఎలా ప్రభావితం చేశాయన్నదే ఈ సినిమా. రక్షిత్‌ పాత్రతో పాటు రాధిక పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఆవిడ చేసిన సీన్లు అన్నీ అద్భుతంగా ఉంటాయి.

రక్షిత్‌: న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. కొత్త పాయింట్‌తో రూపుదిద్దుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేస్తున్నాం.

సెట్‌లో మీరు రక్షిత్‌ను మందలించిన సందర్భాలు ఉన్నాయా?

వెంకట సత్య: ఏమీ లేవండి. ముందుగానే ప్రిపేర్‌ అయి రావడం వల్ల సెట్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్క్‌ జరిగిపోయింది.

రక్షిత్‌: మా నాన్నగారనే కాదు వేరే ఇతర దర్శకుడైనా నేను చాలా అప్రమత్తంగా ఉంటా. వాళ్లు చెప్పింది చేయడమే పని. నేను డైరక్టర్స్‌ యాక్టర్‌ని. నాకు ఏమన్నా సందేహాలు ఉంటే స్ర్కిప్ట్‌ వర్క్‌ స్టేజ్‌లోనే క్లారిపై చేసుకుంటా.


ఓ దర్శకుడిగా కాకుండా తండ్రిగా సినిమాలో రిస్కీ షాట్స్‌ చేస్తున్నప్పుడు టెన్షన్‌ ఫీలయ్యారా?

వెంకట సత్య: ఈ సినిమాలో ఆరంతస్తుల భవనం నుంచి రక్షిత్‌ కిందకు దూకే షాట్‌ ఉంది. ఫైట్‌ మాస్టర్‌ రోప్‌ సాయంతో ఆ షాట్‌ తీయడానికి సిద్ధమయ్యాడు. మా వాడికి ఆ రోప్‌ కడుతుంటే టెన్షన్‌ ఫీలయ్యా. తాడు బలంగా ఉందా, వాడికి ఏమీ కాదు కదా అని పదే పదే ఫైట్‌ మాస్టర్‌ని అడిగేవాణ్ణి. ‘ఇలాంటి షాట్స్‌ తీయడం మాకు అలవాటే. మీరు వర్రీ కావద్దు సార్‌. మీరు కాసేపు పక్కన కూర్చోండి’ అని ఫైట్‌ మాస్టర్‌ జాషువా చెబుతున్నా, ఆ షాట్‌ పూర్తయ్యే వరకూ టెన్షన్‌ పడుతూనే ఉన్నా. అప్పుడు మాత్రం దర్శకుడిగా కంటే తండ్రిగా వర్రీ అయ్యా.

మీ అబ్బాయి చేసిన సీన్లలో మీకు బాగా నచ్చింది ఏమిటి?

ఇందులో రక్షిత్‌ ఓ పద్యం పాడతాడు. విదేశాలలో ఉండి వచ్చావు కదా తెలుగు గురించి నీకేం తెలుసు.. అని ఓ ఛానల్‌ ఓనర్‌ అడిగితే ఆ పద్యం పాడతాడు. దానికి తగ్గట్లు ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చాడు. నాకు చాలా సంతృప్తిగా అనిపించింది.

రక్షిత్‌: ఇంతవరకూ నేను గ్రామీణ నేపథ్యం కలిగిన పాత్రలే చేశాను. కానీ ఆపరేషన్‌ రావణలో తొలిసారిగా సీటీ నేపథ్యం కలిగిన పాత్ర పోషించాను. నాన్నగారికి పద్యాలు, పురాణాలు అంటే ఇష్టం. తెలుగు భాష అంటే ఎంతో గౌరవం. ఆ మక్కువతోనే ఆయన ఈ సినిమాలో నాతో ఓ పద్యం పాడించారు.

వినాయకరావు

ఫొటో: రాజ్‌కుమార్‌

Updated Date - Jul 21 , 2024 | 12:54 AM