నీళ్లవల్ల ప్రయోజనాలెన్నో
ABN , Publish Date - Nov 07 , 2024 | 05:57 AM
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు గరిష్టంగా మూడు లీటర్ల నీళ్లు తాగాలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ఆ ప్రయోజనాలేమిటో చూద్దాం..
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు గరిష్టంగా మూడు లీటర్ల నీళ్లు తాగాలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ఆ ప్రయోజనాలేమిటో చూద్దాం..
ఉదయాన్నే లేచి నీళ్లు తాగటం వల్ల మొత్తం రోజంతా చురుకుగా ఉండగలుగుతారు. మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
నీళ్లు తాగటం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది.
జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి నీళ్లు ఎంతో ఉపకరిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపటంలో నీళ్లు కీలకమైన పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా ప్రతి రోజూ మూడు లీటర్ల నీళ్లు తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు ఎంతో మెరుగుపడుతుంది.
శరీరంలోని కణాలకు పోషకాలు, ఆక్సిజన్ వంటివి అందించటంలో నీళ్లు ఉపకరిస్తాయి. తగినన్ని నీళ్లు తాగితే రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
నీళ్లు తక్కువగా తాగితే దాని ప్రభావం మన చర్మంపై పడుతుంది. చర్మం పొడిబారిపోతుంది. నీళ్లు ఎక్కువగా తాగితే చర్మం మెరుస్తూ ఉంటుంది.
రోజుకు మూడు లీటర్ల నీళ్లు తాగితే ఆకలి తగ్గుతుంది. దీని వల్ల ఏదో ఒక ఆహారం తింటూ ఉండాలనే యావ తగ్గిపోతుంది. దీని వల్ల బరువు తగ్గే అవకాశముంటుంది.