Share News

YSR Congress: అజ్ఞాతంలో వైసీపీ నేతలు.. క్యాడర్‌ ఫోన్లు చేసినా ఎత్తని వైనం!

ABN , Publish Date - Jun 11 , 2024 | 09:33 AM

అందరూ ఊహించిన విధంగా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీకి (YSR Congress) కోలుకోలేని స్థితి ఏర్పడింది. రాష్ట్రంలో కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి...

YSR Congress: అజ్ఞాతంలో వైసీపీ నేతలు.. క్యాడర్‌ ఫోన్లు చేసినా ఎత్తని వైనం!

  • అయోమయంలో కార్యకర్తలు

  • కొందరు గోవాలో, మరికొందరు దేశాలే వదిలిపెట్టిన వైనం

  • చాలామంది ఇతర రాష్ట్రాల్లో మకాం

  • ప్రభుత్వం పోయినా పదవీ వ్యామోహంలో కొందరు

కడప జిల్లా: అందరూ ఊహించిన విధంగా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీకి (YSR Congress) కోలుకోలేని స్థితి ఏర్పడింది. రాష్ట్రంలో కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో వైసీపీ క్యాడర్‌ మొత్తం కనిపించని స్థితికి వచ్చింది. రైల్వేకోడూరులో ఐదోసారి పోటీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు ఓటమి పాలు కావడంతో నాయకత్వ బాధ్యతలు తీసుకున్న వారు ఈనెల 5వ తేదీ నుంచి ఫోన్లు చేసినా ఎత్తడం లేదని కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. కొందరు నేతలు విదేశాల్లో ఉండగా మరికొందరు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వారు ఇంతవరకు తమకు అందుబాటులోకి రాలేదని పలువురు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అవినీతి పనులు చేశారని అందువల్ల ఎక్కడ పట్టుకుంటారో అని భయాందోళనతో గోవా తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.


TDP-And-YSRCP-Logo.jpg

రాజీనామా చేయరా..?

ఇటీవల బెంగళూరు, హైదరాబాద్‌ తదితర నగరాల్లో చాలామంది వైసీపీ నేతలు తారసపడ్డా ముఖం చాటేశారని చెప్పుకుంటున్నారు. ఇక్కడ 20 ఏళ్లు ఒకరే అధికారంలో ఉండగా చేసిన పనుల వల్ల ఇప్పుడు తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయాందోళనతో ఈనెల 5 నుంచి కనిపించకుండా వెళ్లారనేది కోడూరులో ప్రధానంగా చర్చ సాగుతోంది. వైసీపీకి చెందిన కొందరు నేతలకు నామినేటెడ్‌ పదవులు ఉన్నాయి. వాటికి ఇంకా రాజీనామాలు చేయకుండా పదవీ వ్యామోహంతో ఇక్కడ కనిపించకుండా తిరుగుతున్నారని అందరూ చర్చించుకుంటున్నారు. పంచాయతీ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అవినీతిలో భాగస్వామ్యం అయిన వారు పూర్తిగా కనిపించకుండా పోయారని వైసీపీ కార్యకర్తల్లో చర్చ నడుస్తోంది. కనీసం వైసీపీ కార్యాలయం వైపు కూడా నేతలు రాకుండా ఉన్నారంటే క్యాడర్‌ పూర్తిగా ఛిన్నాభిన్నం అయిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - Jun 11 , 2024 | 09:39 AM

News Hub