TS News: లండన్లో ముగిసిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్
ABN , Publish Date - Nov 07 , 2024 | 06:20 PM
తెలంగాణలోని ప్రసిద్ధ పురావస్తు కట్టడాల సందర్శనకు ఈ ప్రదర్శన ఫలితంగా పర్యాటకులు భారీగా పెరుగుతారని అంచనా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
లండన్ వేదికగా మూడురోజుల పాటు జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ తో కలిసి తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ను షెకావత్ సందర్శించారు. బతుకమ్మ వేడుకలను తిలకించారు. మంత్రి జూపల్లి షెకావత్ ను సన్మానించి, చార్మినార్ జ్ఞాపికను అందజేశారు.రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి ఇందులో పాల్గొన్నారు
భారీగా తరలివచ్చిన ఎన్ఆర్ఐలు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పర్యాటక రోడ్ షో అలరించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ఎన్ ఆర్ ఐలు తరలివచ్చారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధికి చేయూతనివ్వాలని అందుకు సంబంధించిన ప్రమోషన్ లో భాగస్వాములవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అద్భుతమైన ప్రదేశాలు, చరిత్ర, వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసే విధంగా ఈ వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో అంతర్జాతీయ స్థాయిలో తగిన ప్రచారం చేశామని అన్నారు.
ఇన్క్రెడిబుల్ ఇండియా స్టాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూకే లో భారత హై కమీషనర్ విక్రమ్ దురై స్వామి, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హాతో కలిసి మంత్రి జూపల్లి పాల్గొన్నారు. తెలంగాణలోని రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్, సోమశిల, బుద్ధవనం,, వేయి స్తంభాల గుడి, చారిత్రక వరంగల్ కోట వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల ఛాయాచిత్రాల ప్రదర్శనను డబ్ల్యూటీఎం వేదికగా ప్రదర్శించామని చెప్పారు.
ఉద్యోగావకాశాల పెంపు..
ప్రపంచ వ్యాప్తంగా పురావస్తు కట్టడాలను తిలకించేందుకు పర్యాటకులు అత్యంత ఆసక్తి చూపిస్తారని… తెలంగాణలోని ప్రసిద్ధ పురావస్తు కట్టడాల సందర్శనకు ఈ ప్రదర్శన ఫలితంగా పర్యాటకులు భారీగా పెరుగుతారని అంచనా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ పర్యాటక రంగానికి ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపును తీసుకువచ్చి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పర్యాటక రంగం ఎలా అభివద్ధి చెందుతున్నదో కూడా తాము అధ్యయనం చేస్తున్నామని, తెలంగాణ పర్యాటకం సైతం అదే స్థాయికి చేరుకునేలా కృషి చేస్తున్నామని వివరించారు. విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగి పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.