Air India: విమానంలో ఇచ్చిన ఫుడ్‌లో బ్లేడ్.. ఎయిర్ ఇండియా ప్యాసెంజర్‌కు భారీ షాక్!
ABN , Publish Date - Jun 17 , 2024 | 03:18 PM
ఎయిర్ ఇండియా విమానంలో తనకు ఇచ్చిన ఫుడ్‌లో బ్లేడ్ ఉందంటూ ఓ ప్రయాణికుడు ఆరోపించడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ఇండియా విమానంలో తనకు ఇచ్చిన ఫుడ్‌లో బ్లేడ్ ఉందంటూ ఓ ప్రయాణికుడు ఆరోపించడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా (Viral) మారాయి. బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళుతున్న విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది. మాథ్యూర్స్ పాల్ అనే జర్నలిస్టు జూన్ 9న బెంగళూరు నుంచి ఏఐ 175 విమానంలో శాన్‌ఫ్రాన్సిస్కో బయలుదేరారు. ఆ సమయంలో విమానంలో ఆయనకు ఇచ్చిన ఆహారంలో బ్లేడ్ కనిపించింది.
Viral: డౌటొస్తే.. డాక్టర్ మాట కూడా వినొద్దు! చావును తప్పించుకున్న రోగి సూచన!
‘‘ఆహారం తింటున్నప్పుడు నోటి ఏదో అడ్డం పడినట్టు అనిపించింది. వెంటనే ఉమ్మేశా. చివరకు అది బ్లేడ్ అని తేలింది. ఆ తరువాత విమానం సిబ్బంది ఒకరు నాకు క్షమాపణలు చెప్పడమే కాకుండా బఠాణీలతో చేసి మరో ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చారు. విమానంలో ఇలాంటి బ్లేడ్ ఉండటం చాలా ప్రమాదకరం. ఆ బ్లేడ్ వల్ల నా గొంతుకలో గాయం అయ్యి ఉండేది. నా పరిస్థితిలో ఎవరైనా చిన్నారులు ఉండి ఉంటే ఏమై ఉండేదో’’ అని ఎక్స్ వేదికగా వాపోయారు.
కొన్ని రోజుల తరువాత ఎయిర్‌లైన్స్ తనను సంప్రదించి తనకు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు బిజినెస్ క్లాస్ టిక్కెట్లు కూడా ఆఫర్ చేసిందని అన్నారు. అయితే, ఈ ఆఫర్ లంచంతో సమానం కాబట్టి తాను తిరస్కరించినట్టు చెప్పుకొచ్చారు (Air India passenger finds blade in his meal, airline issues statement).
ఈ ఉదంతంపై ఎయిర్ ఇండియా కూడా స్పందించింది. ఆహారంలో ఏదో ‘ఫారిన్’ వస్తువు ఉన్నట్టు అంగీకరించింది. ‘‘ఘటనపై దర్యాప్తు చేశాం. అది మా కేటరింగ్ భాగస్వామి వినియోగించిన యంత్రంలోనిదని తేలింది. భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేసేందుకు కేటరింగ్ భాగస్వాములతో కలిసి చర్యలు తీసుకుంటున్నాము. తనిఖీలను మరింతగా చేపడతాము. ముఖ్యంగా గట్టి కూరగాయాలు తరిగే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాము’’ అని చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రాజేశ్ డోగ్రా ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, సదరు కస్టమర్‌కు ఎయిర్ ఇండియా కాంప్లిమెంటరీ బిజినెస్ ఫ్లైట్ టిక్కెట్లు ఇచ్చిందా లేదా అన్న విషయంపై డోగ్రా స్పందించలేదు.