భలే బ్యాటరీ
ABN , Publish Date - Feb 04 , 2024 | 09:04 AM
ఉదయం నిద్ర లేవగానే మొదట చేసే పని ఫోన్ ఛార్జింగ్ పెట్టడం. ఎప్పుడైనా ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోతే తెగ గాభరా పడిపోతాం....

ఉదయం నిద్ర లేవగానే మొదట చేసే పని ఫోన్ ఛార్జింగ్ పెట్టడం. ఎప్పుడైనా ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోతే తెగ గాభరా పడిపోతాం. ఒకవేళ అస్సలు ఛార్జింగ్ పెట్టే అవసరమే లేని బ్యాటరీలు వస్తే... ఛార్జర్ కోసం వెతికి పనే లేకపోతే... భలేగా ఉంటుంది కదూ! అలాంటి బ్యాటరీని చైనాకు చెందిన బెటావోల్ట్ కంపెనీ తయారుచేసింది. అత్యవసర సమయంలో ఫోన్ బ్యాటరీ డెడ్ అవుతుంది. ఆసక్తికరమైన క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే బ్యాటరీ తగ్గిపోతుంది. కాసేపు రీల్స్ చూద్దామంటే రాత్రి ఇంటికెళ్లే వరకు ఫోన్ ఆన్‌లో ఉండదనే భయం. అయితే ఇలాంటి సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం ఉంది. చైనా పరిశోధకులు ఛార్జింగ్ అవసరమే లేని బ్యాటరీని తయారుచేశారు. ఈ బ్యాటరీ జీవితకాలం అక్షరాలా యాభై ఏళ్లు. అంటే ఒక్కసారి ఫోన్‌లో ఈ బ్యాటరీ వేస్తే... ఫోన్ పాడవ్వాల్సిందే తప్ప ఛార్జింగ్ అవసరం పడదు. చైనాకు చెందిన ‘బెటావోల్డ్’ అనే కంపెనీ ‘బీవీ 100’ పేరుతో సరికొత్త బ్యాటరీని రూపొందించింది. ఈ బ్యాటరీ రూపాయి నాణెం సైజులో ఉంటుంది. కానీ దాని సామర్థ్యం మాత్రం 50 ఏళ్లు ఉంటుంది. నికెల్ 63 అనే ఐసోటోపును ఉపయోగించి ఈ బ్యాటరీ తయారుచేశారు. ఇందులోని డైమండ్ సెమీకండక్టర్ మెటీరియల్ మైనస్ 60 డిగ్రీల నుంచి 120 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వరకు ఎలాంటి వాతావరణంలోనైనా బ్యాటరీ ఏమాత్రం దెబ్బతినకుండా పనిచేసేలా చేస్తుంది. ఈ బ్యాటరీ పూర్తి సురక్షితం అని బెటావోల్ట్ కంపెనీ చెబుతోంది. వచ్చే ఏడాదికల్లా మార్కెట్లోకి విరివిగా అందుబాటులోకి తెచ్చేలా కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ బ్యాటరీలు ఏరోస్పేస్, డ్రోన్స్, రోబోటిక్స్, ఏఐ డివైజ్‌లకు బాగా నప్పుతాయని కంపెనీ చెబుతోంది. ఒకసారి బ్యాటరీ వేస్తే ఎంతసేపైనా డ్రోన్‌ను ఉపయోగించుకునే వెసులుబాటు లభిస్తుంది. అలాగే 2025లో 1-వాట్ అటామిక్ బ్యాటరీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కంపెనీ చెబుతోంది. ‘ఈ బ్యాటరీలు అందుబాటులోకి వస్తే ఫోన్ ఛార్జింగ్ పెట్టే బాధల నుంచి విముక్తి లభించినట్టే’ అంటున్నారు టెక్ నిపుణులు.