Viral Video: అమ్మపై ప్రయోగం చేసి చంపేశారు.. యువతి కన్నీళ్లు
ABN , Publish Date - Apr 03 , 2025 | 08:01 PM
Daughter Of BJP Leader: సునీత బీజేపీ నేతగా స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుధవారం రోజు ఆమెకు కాలు నొప్పి రావటంతో దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఆమె చనిపోయింది. తన తల్లిపై ప్రయోగం చేసి చంపేశారంటూ ఆమె కూతురు ఆరోపిస్తోంది.

‘వైద్యో నారాయణో హరి’ అన్నారు.. డాక్టర్లు దేవుడితో సమానం అని దానర్థం. ప్రవిత్రమైన వృత్తిలో ఉంటూ జనాల ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు కొందరు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్యం కారణంగా నిత్యం ఎక్కడో చోట రోగులు మరణిస్తూనే ఉన్నారు. వైద్య వృత్తి కేవలం వ్యాపారంగా మారిపోయింది. డబ్బుల కోసం ఎంతకైనా దిగజారే ఆస్పత్రులు ఈ దేశంలో కోకొల్లలు ఉన్నాయి. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. కాలు నొప్పితో వెళ్లిన ఆమె ఆస్పత్రిలోనే కన్నుమూసింది. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తల్లి మరణించిందంటూ బీజేపీ మహిళా నేత కూతురు ఆరోపిస్తోంది. తన తల్లిపై ప్రయోగం చేసి, ప్రాణాలు తీశారంటోంది.
మృతురాలి కూతురు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన సునీత శుక్లా బీజేపీలో పనిచేస్తోంది. ఆ పార్టీ నేతగా స్థానికంగా ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుధవారం రోజు ఆమెకు కాలు నొప్పి విపరీతంగా వచ్చింది. దీంతో కూతురు రిచ శుక్లా.. సునీతను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్లు ఎవ్వరూ లేకపోవటంతో ఓ నర్సు, కాంపౌండర్ సునీతకు చికిత్స చేయటం మొదలెట్టారు. ఆమెను ఐసీయూలోకి తీసుకెళ్లారు. ఓ ఇంజెక్షన్ వేశారు. ఇంజెక్షన్ వేసిన కొద్ది సేపటికే సునీత చనిపోయింది. తల్లి మరణంతో రిచ ఆస్పత్రి యాజమాన్యంపై గొడవకు దిగింది. తన తల్లి మరణం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘ మా అమ్మను ఆస్పత్రి వాళ్లు చంపేశారు. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా.. ఆస్పత్రి సిబ్బందితో మా అమ్మపై ప్రయోగం చేయించారు.
చనిపోయిన అమ్మను మాకు అప్పగించి.. ఇంకా బతికే ఉందని చెప్పారు. అమ్మ చనిపోయిందని తెలిసి వాళ్లతో గొడవ పెట్టుకున్నాను. నన్ను కొట్టారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అదే రోజు పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రిచపై ఎటువంటి దాడి జరగలేదని పోలీసుల విచారణలో తేలింది. ఆమె కుటుంబసభ్యుల మీద కూడా ఎటువంటి దాడి జరగలేదని తెలిసింది. మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడి.. అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రిచ కన్నీళ్లు పెట్టుకుంటూ తల్లి మరణం గురించి చెబుతున్న దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
Bomb Threat: బాంబు పెట్టా.. కలెక్టరేట్ పేల్చేస్తా.. రెచ్చిపోయిన దుండగుడు..
Viral News: 2 మసాలా దోశ.. 2 కప్పుల కాఫీ ఒకే రేటా.. మరీ ఇంత దారుణమా..