Share News

Modak Laddu: నేడు తప్పనిసరిగా గణనాథుడికి నైవేద్యంగా సమర్పించాల్సిన స్వీట్ ఇది!

ABN , Publish Date - Sep 07 , 2024 | 08:45 AM

గణేశ చతుర్థినాడు వినాయకుడికి మోదక లడ్డూలను కచ్చితంగా నైవేద్యం పెట్టాలి. అయితే, ఈ సంప్రదాయం వెనక ఆసక్తికర పురాణ గాథ ఉంది. అందేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Modak Laddu: నేడు తప్పనిసరిగా గణనాథుడికి నైవేద్యంగా సమర్పించాల్సిన స్వీట్ ఇది!

ఇంటర్నెట్ డెస్క్: నేడు వినాయకచవితి. యావత్ దేశం గణనాథుడి సేవలో తరిస్తోంది. నేటి నుంచి వరుసగా పది రోజుల పాటు దేశవ్యాప్తంగా గణేశ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ పూజల్లో తప్పక కనిపించే నైవేద్యం మోదక లడ్డూలు. వినాయకుడికి తీపి పదార్థాలు అంటే ఎంతో ఇష్టమన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మోదక లడ్డూలు స్వామికి అత్యంత ప్రీతికరం. సనాతన సంప్రదాయం ప్రకారం, గణేశ చతుర్థినాడు స్వామి వారికి 21 మోదక లడ్డూలను నైవేద్యంగా పెడతారు. దీని వెనక ఆసక్తికరమైన గాథ ఉందని పురాణాలు చెబుతున్నాయి (Modak Laddu).


ఒకప్పుడు పరమశివుడు, పార్వతీ దేవీ, విఘ్నేశ్వరుడు అత్రి మహాముని, అనసూయ దంపతుల ఇంటికి వెళ్లారట. ఆ సమయంలో పరమశివుడితో పాటు గణనాథుడు కూడా ఆకలిగా ఉన్నారట. అయితే, వినాయకుడు భోజనప్రియుడు కావడంతో అనసూయ ముందుగా విఘ్నేశ్వరుడికి భోజనం వడ్డించిందట. అనేక రకాల వంటకాలు వడ్డించినా కూడా స్వామి వారి క్షుత్‌ బాధ తీరలేదట. ఇక పుత్రవాత్సల్యంతో పరమశివుడు కూడా గణనాథుడు భోజనం చేసే వరకూ వేచి చూశారట.

అయితే, సాధారణ వంటకాలతో వినాయకుడు సంతుష్టుడు కాకపోవడంతో అనసూయన ఆయనకు మోదక లడ్డూలు వడ్డించిందట. అలా 21 లడ్డూలు తిన్నాకే వినాయకుడు సంతుష్టుడు అయ్యాట. అయితే, అప్పటివరకూ ఆకలితో ఉన్న పరమశివుడు కూడా ఆశ్చర్యకరంగా కడుపు నిండినట్టు 21 సార్లు త్రేన్చాడట. విఘ్నేశ్వరుడితో పాటు శివుడు కూడా మోదక లడ్డూలతో సంతుష్టులు అవుతారని అనసూయ గుర్తించింది. నాటి నుంచి ఈ లడ్డూలు నైవేద్యంగా పెట్టే సంప్రదాయం మొదలైనట్టు తెలుస్తోంది. ఇది కలియుగంలో కూడా యథాతథంగా కొనసాగుతోందని పురాణాలు చెబుతున్నాయి.

మోదక లడ్డూలు ఎలా చేయాలంటే..

మోదక లడ్డూలు రకరకాల పదార్థాలతో చేస్తున్నా సంప్రదాయం ప్రకారం బియ్యపు పిండితో చేయాలట.

కావాల్సినవి..

  • కప్పు బియ్యపు పిండి

  • కప్పు నీళ్లు

  • అరకప్పు కొబ్బరి తరుము

  • అరకప్పు బెల్లం

  • అర టీస్పూను ఇలాచీ పొడి

  • నెయ్యి తగినంత


లడ్డూలు చేసే విధానం

  • మూకుడులో కొద్దిగా నీరు బెల్లం వేసి వేడి చేయాలి. ఆ తరువాత అందులో కొబ్బరి తరుము, ఇలాచీ పొడి వేసి బాగా కలియపెట్టి వేడిచేయాలి.

  • మరో మూకుడులో నీళ్లు పోసి, ఉప్పు వేసి మరగబెట్టాలి. ఆ తరువాత మెల్లగా బియ్యపు పిండి వేస్తు బాగా కలపాలి. పిండి ఉండలు కట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆ తరువాత రెండు మూడు నిమిషాల పాటు ఉడకనియ్యాలి.

  • ఆ తరువాత పిండి బాగా చల్లారాక వాటిని చిన్న చిన్న బిళ్లల రూపంలో వత్తాలి. వాటి మధ్య ఒక టీస్పూను కొబ్బరి బెల్లం మిక్స్‌ను పెట్టాలి. ఆ తరువాత దాన్ని లడ్డూ రూపంలో చుట్టాలి.

  • ఆ తరువాత వీటిని మళ్లీ 10- 12 నిమిషాల పాటు ఆవిరిపై ఉడకపెట్టి దింపాలి. వీటినే స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలి.

Read Latest and Viral News

Updated Date - Sep 07 , 2024 | 09:05 AM