ఐపీఎల్‌తో రూ.5,210 కోట్లు
ABN , Publish Date - Aug 21 , 2024 | 06:02 AM
ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సంపన్న బోర్డుగా కొనసాగుతున్న భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఖజానా.. ఐపీఎల్‌తో మరింత కళకళలాడుతోంది. ఇతర దేశాల బోర్డులకు కన్ను కుట్టే రీతిలో 2023 సీజన్‌కుగాను బీసీసీఐకి ఏకంగా...
గతేడాది బీసీసీఐ లాభం ఇది
2022తో పోలిస్తే 116 శాతం పెరుగుదల
ముంబై: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సంపన్న బోర్డుగా కొనసాగుతున్న భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఖజానా.. ఐపీఎల్‌తో మరింత కళకళలాడుతోంది. ఇతర దేశాల బోర్డులకు కన్ను కుట్టే రీతిలో 2023 సీజన్‌కుగాను బీసీసీఐకి ఏకంగా రూ. 5,210 కోట్ల లాభాన్ని ఐపీఎల్ అందించింది. ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వార్షిక ఆదాయంకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ కావడం విశేషం. అలాగే 2022 సీజన్‌తో పోలిస్తే ఈసారి 116 శాతం పెరుగుదల కనిపించిందని బోర్డు తమ వార్షిక నివేదికలో పేర్కొంది. దీనిప్రకారం ఐపీఎల్ 2023 సీజన్‌లో మొత్తంగా రూ. 11,769 కోట్ల ఆదాయం రాగా.. 2022తో పోలిస్తే ఇది 78శాతం అధికం కావడం విశేషం. మరోవైపు ఖర్చులు కూడా 68 శాతం పెరుగుదలతో రూ. 6,648 కోట్లకు చేరాయి. ఇక, 2023-27 కాలానికి బోర్డు రూ. 48,390 కోట్లతో మీడియా హక్కుల ఒప్పందం కుదుర్చుకోవడం కూడా ఈ అధిక లాభాలకు కారణంగా చెప్పవచ్చు. ఇందులో డిస్నీ స్టార్ గ్రూప్ రూ. 23,575 కోట్లతో టీవీ రైట్స్ తీసుకోగా, జియో సినిమా రూ. 23,758 కోట్లతో డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.
అలాగే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను టాటా సన్స్ రూ. 2500 కోట్లకు తీసుకోవడం గమనార్హం. గతేడాది ఆరంభమైన మహిళల ప్రీమియర్ లీగ్ కూడా బీసీసీఐకి రూ. 377 కోట్ల మిగులు సంపాదనను తీసుకువచ్చింది. ఇలా, లీగ్‌లతో బీసీసీఐ తన ఆదాయాన్ని రోజురోజుకూ పెంచుకుంటూ ముందుకెళుతోంది.
నెలాఖరులోగా రిటెన్షన్ రూల్‌పై స్పష్టత
వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరుగబోతోంది. దీనికంటే ముందే ఫ్రాంచైజీలన్నీ ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ఈనెలాఖరులోగా బీసీసీఐ ఈ విషయంలో స్పష్టతనిచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే లీగ్‌లోని ప్రతీ జట్టు రైట్ టు మ్యాచ్ ఆప్షన్‌తో కలిపి ఆరుగురిని అట్టిపెట్టుకునేందుకు అనుమతించే ఆలోచనలో ఉంది. వేలానికి ముందే ఆయా జట్లు తమ ఆటగాళ్లను మార్చుకోవడాన్ని రైట్ టు మ్యాచ్ అని పిలుస్తుంటారు. కొన్ని ఫ్రాంచైజీలు అసలు మెగా వేలమే వద్దని బోర్డును కోరినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు బీసీసీఐ మాత్రం సుముఖంగా లేదు.