Hardik Pandya: రోహిత్-కోహ్లీని మించిపోయిన హార్దిక్.. వరల్డ్ కప్ హీరో క్రేజీ ఫీట్
ABN , Publish Date - Dec 11 , 2024 | 08:54 AM
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పాండ్యా మించిపోయాడు.
టీమిండియా అనగానే కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీలే ఠక్కున గుర్తుకొస్తారు. వారిద్దరికీ ఉన్న క్రేజ్, పాపులారిటీ అలాంటిది. దశాబ్దంన్నర కాలం నుంచి అద్భుతమైన బ్యాటింగ్‌తో కోట్లాది మంది హృదయాలను వాళ్లు గెలుచుకున్నారు. భారత జట్టుతో పాటు వరల్డ్ క్రికెట్‌లోనే టాప్‌లో ఉన్నారు. కాబట్టే మొదట వీరి గురించే అంతా మాట్లాడుకుంటారు. అయితే టీమిండియాలో మరింత మంది స్టార్లు ఉన్నారు. వాళ్లలో ఒకడు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. ధనాధన్ బ్యాటింగ్, స్టన్నింగ్ ఫీల్డింగ్, మెస్మరైజింగ్ బౌలింగ్‌తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌తో అతడి క్రేజ్ మరింత పెరిగింది. భారత్ విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించడంతో అతడికి ఎనలేని గుర్తింపు దక్కింది. దీంతో ఒక విషయంలో ఏకంగా రోహిత్-కోహ్లీనే మించిపోయాడు పాండ్యా. ఎందులో అనేది ఇప్పుడు చూద్దాం..
లిస్ట్‌లో మరో భారత ఆటగాడు
గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ అథ్లెట్ల జాబితాలో హార్దిక్ పాండ్యా చోటు సంపాదించాడు. 2024 ఏడాదికి గానూ విడుదల చేసిన ఈ లిస్ట్‌లో టీమిండియా నుంచి ఇద్దరు క్రికెటర్లు మాత్రమే చోటు సంపాదించారు. అందులో ఒకడు హార్దిక్ అయితే, మరొకరు పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శషాంక్ సింగ్ కావడం విశేషం. మోస్ట్ సెర్చ్‌డ్ అథ్లెట్ల లిస్ట్‌లో పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఇమానె ఖలీఫ్ టాప్‌లో నిలిచింది. ఛాంపియన్ బాక్సర్ మైక్ టైసన్ ఈ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. లెమైన్ యమల్, సైమోన్ బైల్స్, జేక్ పాల్, నికో విలియమ్స్ వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు.
పరువు కాపాడారు
గూగుల్ సెర్చ్ లిస్ట్‌లో హార్దిక్ పాండ్యా 7వ స్థానాన్ని దక్కించుకోగా.. స్కాటీ షెఫ్లర్ ఎనిమిదో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ శషాంక్ సింగ్ 9వ ప్లేస్‌లో నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పదో బెర్త్‌ను యంగ్ ఫుట్‌బాలర్ రోడ్రి దక్కించుకున్నాడు. ఈ జాబితా గురించి తెలిసిన క్రికెట్ లవర్స్ పాండ్యాను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. రోహిత్, కోహ్లీకి ఆ జాబితాలో చోటు దక్కలేదని.. అలాంటిది హార్దిక్ బెర్త్ దక్కించుకోవడం గ్రేట్ అని మెచ్చుకుంటున్నారు. పాండ్యా-శషాంక్ టీమిండియా పరువు కాపాడారని కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పేందుకు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని అంటున్నారు.