Ranji Trophy: భారీ సెంచరీలతో కుర్రాళ్ల విధ్వంసం.. మరోసారి చెలరేగిన పుజారా
ABN , Publish Date - Feb 10 , 2024 | 07:34 AM
రంజీ ట్రోఫీలో శుక్రవారం కుర్రాళ్లు విధ్వంసం సృష్టించారు. యువ క్రికెటర్లు పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ భారీ సెంచరీలతో విరుచుకుపడ్డారు. కుర్రాళ్లకు తోడు వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా కూడా సెంచరీతో చెలరేగాడు.
రంజీ ట్రోఫీలో శుక్రవారం కుర్రాళ్లు విధ్వంసం సృష్టించారు. యువ క్రికెటర్లు పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ భారీ సెంచరీలతో విరుచుకుపడ్డారు. కుర్రాళ్లకు తోడు వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా కూడా సెంచరీతో చెలరేగాడు. గాయం కారణంగా 5 నెలలపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న షా రీఎంట్రీలో అదరగొట్టాడు. చత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ పృథ్వీ షా విధ్వంసం సృష్టించాడు. వన్డే స్టైల్లో బ్యాటింగ్ చేసిన షా.. చత్తీస్‌గఢ్ బౌలర్లను ఊచకోత కోశాడు. 18 ఫోర్లు, 3 సిక్సులతో 185 బంతుల్లోనే 159 పరుగులు చేశాడు. ఫస్ల్ క్లాస్ క్రికెట్‌లో షా కు ఇది 13 సెంచరీ కాగా.. గత 4 ఇన్నింగ్స్‌లో మూడో సెంచరీ కావడం గమనార్హం. బెంగాల్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మాత్రమే షా 35 పరుగులే చేశాడు. షా కు తోడుగా మరో ఓపెనర్ భూపెన్ లల్వానీ(102) కూడా సెంచరీతో చెలరేగాడు. పృథ్వీ షా, భూపెన్ కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 244 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి విధ్వంసంతో తొలి రోజు ఆటలో ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది.
అయితే ఈ రంజీ సీజన్‌లో ముంబై కెప్టెన్ అజింక్యా రహానే ఫేలవ ప్రదర్శన కొనసాగుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో రహానే ఒకే ఒక్క పరుగు చేశాడు. ఈ సీజన్‌లో రహానే ఇప్పటివరకు ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరాడు. రాజస్థాన్‌తో ప్రారంభమైన మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సౌరాష్ట్ర ఆటగాడు, టీమిండియా వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా కూడా సెంచరీతో చెలరేగాడు. 9 ఫోర్లతో 230 బంతుల్లో 110 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో పుజారాకు ఇది రెండో సెంచరీ. పుజారా సెంచరీతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. తమినాడుతో జరిగిన మరో మ్యాచ్‌లో కర్ణాటక బ్యాటర్ డేవదత్ పడిక్కల్ భారీ సెంచరీతో దుమ్ములేపాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న పడిక్కల్ 12 ఫోర్లు, 6 సిక్సులతో 216 బంతుల్లో అజేయంగా 151 పరుగులు చేశాడు. పడిక్కల్ రెండో రోజు కూడా తన ఊపును కొనసాగిస్తే డబుల్ సెంచరీని చేరుకునే అవకాశాలున్నాయి. పడిక్కల్ అజేయ సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆటలో కర్ణాటక జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.