Rohit Sharma: రోహిత్‌కు నో ఆప్షన్.. గట్టెక్కాలంటే ఇదొక్కటే మార్గం.. మాజీ క్రికెటర్ కీలక సూచనలు
ABN , Publish Date - Dec 09 , 2024 | 01:39 PM
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ కెప్టెన్సీని ఏ స్థాయికి దిగజార్చిందో తేటతెల్లమైందని మాజీ క్రికెటర్ అన్నాడు. ఈ గండం నుంచి గట్టెక్కడానికి రోహిత్ ముందున్న ఒకే ఒక్క దారి ఇదేనంటూ అతడు వివరించాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్ మదన్ లాల్ కీలక సూచనలు చేశాడు. ఆసిస్ తో తొలి టెస్టులో అందుబాటులో లేని రోహిత్ రెండో టెస్టులో అదరగొడతాడని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రోహిత్ శర్మ జట్టును నడిపిన విధానం పలువురిని అసహనానికి గురిచేసింది. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసిస్ తో ఓటమి రోహిత్ కు వరుసగా నాలుగో పరాజయం. ఇంగ్లాండ్ తో ఈ ఏడాది తొలినాళ్లలో జరిగిన మ్యాచ్ లో సత్తా చాటిన రోహిత్ ఇక ఆనాటి నుంచి తన ఫామ్ ను కొనసాగించలేకపోతున్నాడు. దీంతో ఈ లెజెండ్ ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఓ ఆటాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మదన్ లాల్ రోహిత్ పై చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్ తో పాటు న్యూజిలాండ్ తో సిరీస్ తోనూ రోహిత్ పరుగులు తీసేందుకు కష్టపడ్డాడు. అదే చెత్త ఫామ్ ను కంటిన్యూచేస్తూ.. ఆడిలైడ్ టెస్టులోనూ కేవలం తొమ్మిది పరుగులకే పరిమితమయ్యాడు. రోహిత్ ఫామ్ పై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతడిని ఇప్పటికే ఎన్నో పరాజయాలు పలకరించాయి. అతడో టాప్ క్లాస్ ప్లేయర్. అయినప్పటికీ రోహిత్ పరుగులు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కొన్నిసార్లు ఫామ్ సరిగా కంటిన్యూ చేయలేనప్పుడు ఆ ప్రభావం కచ్చితంగా కెప్టెన్సీ పైనా పడుతుంది. అతడి ఫామ్ ఒక్క మ్యాచ్ దూరంలో ఉంది. అతడే పొజిషన్లో ఆడినప్పటికీ రోహిత్ పరుగులు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అప్పుడు మాత్రమే ఈ క్రికెటర్ పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టవచ్చు అని మదన్ లాల్ తెలిపాడు.
న్యూజిలాండ్ తో 3-0తో వైట్ వాష్ కు గురైన తర్వాత రోహిత్ మూడు మ్యాచుల్లో కలిపి 91 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి యావరేజ్ 15.17గా ఉంది. ఇక బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లోనూ 10.50 యావరేజ్తో రెండు టెస్టుల్లో 42 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో రోహిత్ మళ్లీ పునర్వైభవాన్ని పొందడం టీమిండియాకు ఎంతో కీలకంగా మారనుంది.