బోర్డును ధిక్కరించిన ఇషాన్, అయ్యర్‌పై వేటు
ABN , Publish Date - Feb 29 , 2024 | 04:39 AM
రంజీ మ్యాచ్‌లు ఆడాలంటూ చేసిన సూచనలను బేఖాతరు చేసిన ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌కు బీసీసీఐ గట్టిషాక్ ఇచ్చింది. 30 మంది ఆటగాళ్లతో బుధవారం విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ల జాబితా నుంచి...
సెంట్రల్ కాంట్రాక్టుల్లో మొండిచేయి
గ్రేడ్-ఎకు సిరాజ్ ప్రమోట్
తిలక్ వర్మకు చోటు
ఎ+ గ్రేడ్‌కు రూ. 7 కోట్లు
న్యూఢిల్లీ: రంజీ మ్యాచ్‌లు ఆడాలంటూ చేసిన సూచనలను బేఖాతరు చేసిన ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌కు బీసీసీఐ గట్టిషాక్ ఇచ్చింది. 30 మంది ఆటగాళ్లతో బుధవారం విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ల జాబితా నుంచి వీరిద్దరినీ తప్పించారు. 2023లో 26 మంది ఉండగా.. ఈసారి అదనంగా మరో నలుగురికి కాంట్రాక్ట్‌లు దక్కడం గమనార్హం. మానసిక సమస్యలతో దక్షిణాఫ్రికా టూర్ మధ్యలో జట్టునుంచి బయటకు వచ్చిన కిషన్.. జార్ఖండ్ తరఫున రంజీలు ఆడకుండా ఐపీఎల్ కోసం సన్నద్ధం అవుతుండడం బోర్డు పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. అలాగే శ్రేయాస్ అయ్యర్ కూడా బోర్డు ఆదేశాల్ని పట్టించుకోలేదు. చేతులు కాలాక అన్నట్టు...ఇప్పుడు ముంబై తరఫున సెమీస్ ఆడడానికి సిద్ధమయ్యాడు. గతేడాది అయ్యర్ ‘బి‘లో, ఇషాన్ ‘సి’ గ్రేడ్ కాంట్రాక్టుల్లో ఉన్నారు. ఇక రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రా, జడేజాలు ఉన్న ఎ+ గ్రేడ్‌లో ఎటువంటి మార్పులూ లేవు. అయితే, పేసర్ సిరాజ్‌తోపాటు కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్‌లకు ‘బి’ గ్రేడ్ నుంచి ‘ఎ’కు ప్రమోషన్ లభించగా.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మతోపాటు మొత్తం 15 మందికి ‘సి గ్రేడ్’ కాంట్రాక్ట్‌లు లభించాయి.తిలక్‌కు ఇదే తొలి సెంట్రల్ కాంట్రాక్ట్. గతేడాది ‘సి’లో ఉన్న కేఎస్ భరత్ కాంట్రాక్ట్‌ను కొనసాగించారు. యశస్వి జైస్వాల్‌కు తొలిసారి.. అందునా నేరుగా ‘బి గ్రేడ్’ జాబితాలో చోటుదక్కింది. గాయం కారణంగా ఆటకు దూరమైన రిషభ్ పంత్, అక్షర్ పటేల్ స్థాయిని తగ్గించి ‘బి గ్రేడ్’లో చేర్చారు. అయ్యర్, ఇషాన్‌ల పేర్లను ఈ విడత పరిగణనలోకి తీసుకోలేదని బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో ప్రత్యేకంగా పేర్కొంది. జాతీయ జట్టుకు దూరమైన ఆటగాళ్లు.. ఆ సమయంలో జరుగుతున్న దేశవాళీ టోర్నీలకు ప్రాధాన్యతనివ్వాలని మరోసారి స్పష్టం చేసింది. నిర్దేశించిన కాల పరిమితి (అక్టోబరు 1, 2023-సెప్టెంబరు 30, 2024)లో 3 టెస్ట్‌లు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడిన ఆటగాళ్లకు కాంట్రాక్ట్‌లు దక్కాయని బోర్డు తెలిపింది. ఇంగ్లండ్ సిరీ్‌సలో రెండే టెస్ట్‌లు ఆడిన ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్‌లు.. ధర్మశాలలో జరిగే ఆఖరి మ్యాచ్‌లో కూడా ఆడితే ‘సి గ్రేడ్’ కాంట్రాక్ట్‌కు పరిగణనలోకి తీసుకొంటామని వివరించింది.
సెంట్రల్ కాంట్రాక్ట్‌లు (2023-24) వీరికే..
ఎ+ గ్రేడ్ (రూ. 7 కోట్లు):
రోహిత్, కోహ్లీ, బుమ్రా, జడేజా
ఎ గ్రేడ్ (రూ.5 కోట్లు):
అశ్విన్, షమి, సిరాజ్, రాహుల్, గిల్, హార్దిక్ పాండ్యా.
బి గ్రేడ్ (రూ. 3 కోట్లు): సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జైస్వాల్.
సి గ్రేడ్ (రూ. కోటి): రింకూ సింగ్, తిలక్ వర్మ, కేఎస్ భరత్, రజత్ పటీదార్, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముకేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్.
పేస్ బౌలింగ్ కాంట్రాక్ట్‌లు: ఆకాశ్ దీప్, విజయ్ కుమార్ వైశాఖ్, ఉమ్రాన్ మాలిక్, యష్ దయాళ్, విద్వత్ కవేరప్ప.
పుజార కెరీర్ ముగిసినట్టేనా?
చటేశ్వర్ పుజార, ఉమేష్ యాదవ్, శిఖర్ ధవన్, దీపక్ హుడా, యజ్వేంద్ర చాహల్‌లకు వార్షిక కాంట్రాక్ట్‌లు దక్కలేదు. దీనిని బట్టి పుజార అంతర్జాతీయ కెరీర్ ముగిసిందన్న సంకేతాలిచ్చినట్టయింది. కానీ, చాహల్ మెరుగైన ప్రదర్శన చేస్తే మళ్లీ టీమ్‌లోకి వచ్చే అవకాశాలున్నాయి. అయితే, ఈసారి ప్రత్యేకంగా ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్ కింద ఐదుగురి పేర్లను సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసింది. కాగా, వార్షిక వేతనాలను ఏమేరకైనా పెంచారా? అనే విషయాన్ని బోర్డు స్పష్టం చేయలేదు.