స్వర్ణంపై నాగర్ నజర్
ABN , Publish Date - Aug 23 , 2024 | 06:10 AM
భారత పారా షట్లర్ కృష్ణ నాగర్ జీవితం వడ్డించిన విస్తరి కాదు. చిన్ననాటినుంచి అతడి జీవితం సవాళ్ల మయం. ఆ సవాళ్ల నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. తద్వారా కష్టాలకు ఎదురొడ్డి నిలవడం అలవాటు చేసుకున్నాడు. ఎత్తు తక్కువగా ఉన్నాడంటూ అతడిని అంతా హేళన చేసేవారు. ఆ అవహేళనలకు నాగర్ ఎప్పుడూ కుంగిపోలేదు.
పారిస్ పారాలింపిక్స్
భారత పారా షట్లర్ కృష్ణ నాగర్ జీవితం వడ్డించిన విస్తరి కాదు. చిన్ననాటినుంచి అతడి జీవితం సవాళ్ల మయం. ఆ సవాళ్ల నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. తద్వారా కష్టాలకు ఎదురొడ్డి నిలవడం అలవాటు చేసుకున్నాడు. ఎత్తు తక్కువగా ఉన్నాడంటూ అతడిని అంతా హేళన చేసేవారు. ఆ అవహేళనలకు నాగర్ ఎప్పుడూ కుంగిపోలేదు. ఆ మరుగుజ్జుతనంతో సాధించిన విజయాలతో వారి నోళ్లు మూయించాడు. తొలి నాళ్లలో నాగర్ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే అవి అతడిలోని క్రీడా జిజ్ఞాసకు అడ్డుకాలేదు. క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, లాంగ్‌జం్‌పతోపాటు స్ర్పింట్‌లో ఈవెంట్లలో నాగర్‌కు ప్రవేశం ఉంది. బ్యాడ్మింటన్‌తో అతడి పయనం 2017లో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఆరంభమైంది. అనతి కాలంలోనే అది పారా ఒలింపిక్స్‌కు దూసుకు పోయింది. 2021 అరంగేట్ర టోక్యో ఒలింపిక్స్‌ను కృష్ణ నాగర్ చిరస్మరణీయం చేసుకున్నాడు. ప్రమోద్ భగత్ తర్వాత పారా లింపిక్స్‌లో పసిడి పతకం సొంతం చేసుకున్న రెండో భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఎస్‌హెచ్6 విభాగంలో తన స్వర్ణాన్ని నిలబెట్టుకోవడమే ధ్యేయంగా పారిస్ పారాలింపిక్స్‌లో అతడు బరిలో దిగుతున్నాడు. ‘ఇవి నాకు రెండో పారా విశ్వక్రీడలు. మెగా ఈవెంట్ కావడంతో ఒకింత ఉత్కంఠగానూ ఉంది’ అని 25 ఏళ్ల నాగర్ చెప్పాడు. ఎస్‌హెచ్6 అంటే పొట్టిగా ఉన్నవారు తలపడే విభాగం. ‘ప్రతిష్ఠాత్మక క్రీడల్లో రెండోసారి పాల్గొనడం నిజంగా అద్భుతం...అదృష్టం. మరోసారి పసిడి పతకాన్ని సాధించి నాపై అంచనాలను నిలబెట్టుకోవడం ప్రథమ కర్తవ్యం’ అని వివరించాడు. నాలుగు అడుగుల ఆరు అంగుళాల నాగర్..పారి్‌సలో తలపడుతున్న 13 మంది పారా షట్లర్లలో ఒకడు. టోక్యో అపూర్వ విజయం అనంతరం అతడి జీవితం సాఫీగా సాగలేదు. గాయం నాగర్ బ్యాడ్మింటన్ కెరీర్ పురోగతికి అడ్డుపడితే..తల్లి మరణం రూపంలో అతడికి మరో ఊహించని పరిణామం ఎదురైంది. అయితే మనోధైర్యానికి మారుపేరైన నాగర్ ఆ రెండు షాక్‌లనుంచి త్వరగానే కోలుకున్నాడు. ‘టోక్యో క్రీడల తర్వాత పాదానికి గాయం అయ్యింది. అలాగే కొన్ని ఇతర సమస్యలూ వెంటాడాయి. ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి. ఆట గాడిలో పడింది. భిన్న పరిస్థితుల్లో, విభిన్న ప్రత్యర్థులకు దీటుగా ఎలా బదులివ్వాలనే అంశాలపై దృష్టి సారించా. వేగంగా లేదా మందకొడిగా ఉన్న కోర్టుల్లో పాజిటివ్ దృక్పథంతో ఆడుతూ సురక్షితంగా స్మాష్‌లు కొట్టాల్సి ఉంటుంది’ అని నాగర్ తెలిపాడు. జైపూర్‌లో యదువేంద్ర సింగ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న నాగర్..గత ఫిబ్రవరిలో థాయ్‌లాండ్‌లో జరిగిన పారా వరల్డ్ బ్యాడ్మింటన్‌చాంపియన్‌షిప్స్‌లో టైటిల్ దక్కించుకున్నాడు. ఇక..డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించడంతో స్టార్ షట్లర్ ప్రమోద్ భగత్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఫలితంగా పారిస్ క్రీడలకు అతడు దూరమయ్యాడు. దాంతో భారత్‌నుంచి టైటిల్ నిలబెట్టుకొనే ఏకైక షట్లర్‌గా నాగర్ నిలిచాడు.