Share News

Archery : బాణం దూసుకెళ్లాలి!

ABN , Publish Date - Jul 22 , 2024 | 05:16 AM

ప్రపంచ ఆర్చరీలో ఇన్నాళ్లూ సౌత్‌ కొరియాదే ఆధిపత్యం. కానీ ఇటీవల వరల్డ్‌ కప్‌లలో ఆ జట్టుకు చెక్‌పెట్టిన ఘనత భారత్‌ది. ఇదే జోరును విశ్వక్రీడల్లో చూపాలనుకుంటున్న భారత్‌.. అందుకు తగ్గట్టే ఆరుగురు ఆర్చర్లతో పారిస్‌కు

Archery : బాణం దూసుకెళ్లాలి!

ప్రపంచ ఆర్చరీలో ఇన్నాళ్లూ సౌత్‌ కొరియాదే ఆధిపత్యం. కానీ ఇటీవల వరల్డ్‌ కప్‌లలో ఆ జట్టుకు చెక్‌పెట్టిన ఘనత భారత్‌ది. ఇదే జోరును విశ్వక్రీడల్లో చూపాలనుకుంటున్న భారత్‌.. అందుకు తగ్గట్టే ఆరుగురు ఆర్చర్లతో పారిస్‌కు సిద్ధమైంది. ఐదు పతకాలు లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

ఒలింపిక్స్‌ ఆర్చరీలో ఇప్పటి వరకు భారత జట్టు ఒక్క పతకమూ సాధించలేదు. 2004-2020 మధ్య భారత పురుషులు, మహిళలు, మిక్స్‌డ్‌ జట్లు ఆరుసార్లు విశ్వక్రీడల క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరాయి తప్ప పోడియం ఫినిష్‌ చేయలేకపోయాయి. ఇక ఈసారి ఒలింపిక్స్‌లో ఆరుగురు సభ్యుల భారత బృందం మొత్తం ఐదు విభాగాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. విశ్వక్రీడల ఆర్చరీ పురుషులు, మహిళల అన్ని కేటగిరీల్లో భారత్‌ తలపడనుండడం 12 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇనుమడించిన ఆత్మవిశ్వాసం: పారిస్‌ ఒలింపిక్స్‌ అన్ని విభాగాల్లో కోటాలు కైవసం చేసుకోవడం ఆషామాషీకాదు. కానీ ఈ ఘనత సాధించిన పురుషులు, మహిళల ఆర్చరీ జట్లు ఇనుమడించిన ఉత్సాహంతో ఈసారి క్రీడల్లో పతకాలు అందుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. మన రికర్వ్‌ ఆర్చర్లు ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ ఏడాది మూడు దశల వరల్డ్‌ కప్‌లలో... రెండు దశలలో ఆర్చర్లు పతకాలు సాధించారు. ఇది.. తెలుగు ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవర (తొలి ఒలింపిక్స్‌), తరుణ్‌ దీప్‌రాయ్‌ (నాలుగో ఒలింపిక్స్‌), ప్రవీణ్‌ జాదవ్‌ (రెండో ఒలింపిక్స్‌)లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.

దీపిక నేతృత్వంలో..

నాలుగో ఒలింపిక్స్‌ బరిలో దిగుతున్న అపార అనుభవజ్ఞురాలు దీపికా కుమారి ఆధ్వర్యంలో మహిళల జట్టు పారి్‌సలో అడుగుపెట్టింది. జట్టులో మిగతా ఇద్దరు భజన్‌ కౌర్‌, అంకితా భకత్‌ విశ్వక్రీడల్లో అరంగేట్రం చేస్తున్నారు. షాంఘై ప్రపంచ కప్‌లో దీపిక రజతం గెలుపొందగా, ధీరజ్‌తో కలిసి భజన్‌ మిక్స్‌డ్‌లో కాంస్య పతకం నెగ్గడం సానుకూల పరిణామం. అంటాల్యా వరల్డ్‌ కప్‌లో మహిళల జట్టు, అంకిత వ్యక్తిగత విభాగంలో నాలుగో స్థానంలో నిలవడం పారిస్‌ క్రీడలకు ముందు ఆత్మవిశ్వాసం నింపేదే. ఇంకా..గత మూడు సంవత్సరాల్లో పారి్‌సలో జరిగిన ప్రపంచ కప్‌లలో మన ఆర్చర్లు పతకాలు సొంతం చేసుకోవడం మరో సానుకూలాంశం.

ధీరజ్‌ స్కోరు బెటర్‌

ఆర్చరీలో బాణాల సగటు స్కోరు ఎంతో ముఖ్యం. ఇందులో ధీరజ్‌ స్కోరు 9.4 కాగా రాయ్‌ది 9.3, జాదవ్‌ది 9.2గా ఉంది. అంతేకాదు ఈ సీజన్‌లో క్వాలిఫికేషన్‌ రౌండ్లలో 720 గరిష్ఠ స్కోరుకుగాను ధీరజ్‌ (693), రాయ్‌ (684), జాదవ్‌ (674) కెరీర్‌ బెస్ట్‌ స్కోర్లు నమోదు చేశారు. ఇంకా..షాంఘైలో జరిగిన వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-1 ఫైనల్లో ప్రపంచ విజేత దక్షిణ కొరియాకు షాకివ్వడం భారత పురుషుల జట్టు సత్తాకు నిదర్శనం. వరల్డ్‌ కప్‌ స్జేజ్‌-3 వ్యక్తిగత విభాగంలో కంచు మోత మోగించిన ధీరజ్‌.. భజన్‌ కౌర్‌తో కలిసి మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో కాంస్యం సాధించాడు. మొత్తంగా ముగ్గురు పురుష ఆర్చర్లు ఒలింపిక్స్‌లో భారత ముఖచిత్రాన్ని మార్చి వేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

Updated Date - Jul 22 , 2024 | 05:16 AM