సఫారీల జోరు
ABN , Publish Date - Jun 22 , 2024 | 05:02 AM
టీ20 వరల్డ్‌క్‌పలో దక్షిణాఫ్రికా అజేయ ఆటతీరుతో చెలరేగుతోంది. తక్కువ స్కోరుకే పరిమితమైనా..
ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ ఓటమి
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): టీ20 వరల్డ్‌క్‌పలో దక్షిణాఫ్రికా అజేయ ఆటతీరుతో చెలరేగుతోంది. తక్కువ స్కోరుకే పరిమితమైనా.. బౌలర్ల రాణింపుతో డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్‌ను అద్భుతంగా కట్టడి చేసింది. ఇక, ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్ (53) చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో శుక్రవారం గ్రూప్-2లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో నెగ్గిన సఫారీలు తమ సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకున్నారు. టోర్నీలో వీరికిది డబుల్ హ్యాట్రిక్ విజయం. ముందుగా సౌతాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (65) మెరుపు ఆటతీరుతో పవర్‌ప్లేలోనే ఈ జట్టు 63 పరుగులతో పటిష్టంగా కనిపించింది. కానీ ఆ తర్వాత స్పిన్నర్లు రషీద్, మొయిన్ అలీ పరుగులను కట్టడి చేశారు. 22 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన డికాక్ తొలి వికెట్‌కు హెన్‌డ్రిక్స్ (19)తో కలిసి 86 పరుగులు అందించాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ (43) భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులకే పరిమితమైంది. లివింగ్‌స్టోన్ (33) రాణించాడు. రబాడ, కేశవ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఓ మాదిరి ఛేదనలో బట్లర్ సేన 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో మిడిలార్డర్‌లో బ్రూక్ అర్ధసెంచరీతో అండగా నిలిచాడు. అతడికి లివింగ్‌స్టోన్ జత కలవడంతో జట్టు గెలుపువైపు సాగినట్టనిపించింది. కానీ 18వ ఓవర్‌లో లివింగ్‌స్టోన్ అవటవడంతో ఉత్కంఠ పెరిగింది. ఇక చివరి ఓవర్‌లో 14 రన్స్ కావాల్సిన వేళ తొలి బంతికే బ్రూక్ క్యాచ్‌ను మార్‌క్రమ్ పట్టేయడంతో సఫారీల సంబరాలు మిన్నంటాయి. డికాక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 163/6 (డికాక్ 65, మిల్లర్ 43; ఆర్చర్ 3/40).
ఇంగ్లండ్: 20 ఓవర్లలో 156/6 (బ్రూక్ 53, లివింగ్‌స్టోన్ 33; కేశవ్ 2/25, రబాడ 2/32).