Share News

Allu Aravind: న్యాయ నిపుణుల సలహాతోనే.. బన్నీ రాలేదు

ABN , Publish Date - Dec 19 , 2024 | 04:56 AM

న్యాయ నిపుణుల సూచనల మేరకే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ చూడడానికి అర్జున్‌(బన్నీ) రాలేదని అల్లు అరవింద్‌ అన్నారు. సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి తెలుకోవడానికి బుధవారం ఆయన కిమ్స్‌ ఆస్పత్రికి వచ్చారు.

Allu Aravind: న్యాయ నిపుణుల సలహాతోనే..  బన్నీ రాలేదు

శ్రీతేజ్‌ కోలుకునేందుకు ఏం చేయడానికైనా సిద్ధం.. అల్లు అరవింద్‌ వెల్లడి

  • శ్రీతేజ్‌కు శ్వాస నాళంలో పైపును అమర్చాం

  • హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు

  • అల్లు అర్జున్‌ అరెస్టుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రోల్స్‌

  • సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేసిన టీపీసీసీ ప్రతినిధులు

  • నాలుగు కేసుల నమోదు

రాంగోపాల్‌పేట్‌/హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): న్యాయ నిపుణుల సూచనల మేరకే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ చూడడానికి అర్జున్‌(బన్నీ) రాలేదని అల్లు అరవింద్‌ అన్నారు. సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి తెలుకోవడానికి బుధవారం ఆయన కిమ్స్‌ ఆస్పత్రికి వచ్చారు. శ్రీతేజ్‌ ఆరోగ్య స్థితి గురించి వైద్యులను అడిగి, తెలుసుకున్నాడు. అనంతరం ఆయన కిమ్స్‌ ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘శ్రీతేజ్‌ పరిస్థితి పది రోజులుగా మెరుగవుతోంది. పూర్తిస్థాయిలో కోలుకోవడానికి సమయం పట్టవచ్చని వైద్యులు చెప్పారు. శ్రీతేజ్‌ కోలుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధమే. ప్రభుత్వం కూడా శ్రీతేజ్‌ కోలుకోవడానికి సహకరించడం అభినందనీయం’’ అని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్‌ అభిమానులతోపాటు.. చాలా మంది బన్నీ ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారని వివరించారు. ఘటన జరిగిన మర్నాడే ఆస్పత్రికి వద్దామని బన్నీ అనుకున్నాడని, ఇక్కడ కూడా తొక్కిసలాట జరిగే ప్రమాదముందని ఆస్పత్రి నిర్వాహకులు చెప్పడం.. కేసు నమోదు కావడంతో న్యాయనిపుణుడు నిరంజన్‌.. బన్నీని వెళ్లొద్దని చెప్పాడన్నారు. ‘‘శ్రీతేజ్‌ని చూడలేకపోతున్నందుకు బన్నీ ఎంతగానో బాధపడ్డారు. కనీసం నువ్వైనా వెళ్లిరా అనడంతో నేను వచ్చాను. ఈ విషయంపై ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాను. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డికి, పోలీసు శాఖకు, కిమ్స్‌ సీఈవో అభిమన్యుకు కృతజ్ఞతలు’’ అని వ్యాఖ్యానించారు. కాగా.. శ్రీతేజ్‌ పరిస్థితిని తెలుసుకున్న అల్లు అరవింద్‌.. ఆయన కుటుంబ సభ్యులను కలవకుండానే వెళ్లిపోయారు. శ్రీతేజ్‌ బంధువులను ఈ విషయమై ప్రశ్నించగా.. అల్లు అరవింద్‌ను కలవకూడదని తమతో కొందరు చెప్పారని పేర్కొన్నారు.


కోలుకుంటున్న శ్రీతేజ్‌

శ్రీతేజ్‌కు బుధవారం వెంటిలేటర్‌ తొలగించి, ట్రాకియోస్టోమీ ట్యూబ్‌ ప్లేస్‌మెంట్‌ చేశారు. తక్కువ డోస్‌ ఇనిట్రో్‌పలతో చికిత్స చేస్తున్నారు. దీంతో శ్రీతేజ్‌ ఆరోగ్యం మెరుగుపడుతున్నదని ఆస్పత్రి వర్గాలు బుధవారం విడుదల చేసిన మెడికల్‌ బులెటిన్‌లో వివరించాయి. అతని శ్వాసక్రియను పునరుద్ధరించేందుకు శస్త్రచికిత్సల ద్వారా శ్వాసనాళంలో పైపును అమర్చినట్లు కిమ్స్‌ కడల్స్‌ ఆస్పత్రి వైద్యులు చేతన్‌ ఆర్‌.ముందాడ, విష్ణు తేజ్‌పుడి పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, జ్వరం తగ్గిందని, అవయవాల పనితీరు కూడా మెరుగుపడిందని వెల్లడించారు. నాడీ మండలానికి సంబంధించి మెరుగుదల లేదని చెప్పారు.


ట్రోల్‌ చేసినవారిపై కేసులు

అల్లు అర్జున్‌ అరెస్టుకు ప్రభుత్వమే కారణమంటూ.. సర్కారును, సీఎం రేవంత్‌రెడ్డిని దూషిస్తూ.. అభ్యంతరకర పోస్టులతో ట్రోల్‌ చేసిన వారిపై హైదరాబాద్‌ సైబర్‌ కైమ్స్‌ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్‌ అరెస్టు సందర్భంగా ఢిల్లీలో సీఎం రేవంత్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయం తెలిసిందే..! దీనిపై అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వంపై అభ్యంతరకర పోస్టులతో ట్రోల్‌ చేశారు. ‘‘సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌ తప్పులేదు. అయితే.. ఇటీవల ఓ వేడుకలో సీఎం రేవంత్‌రెడ్డి పేరును అల్లు అర్జున్‌ మరచిపోవడం వల్లే కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. అక్రమంగా అరెస్టు చేశారు’’ అనేది ఆ ట్రోల్స్‌లోని సారాంశం. దీనిపై టీపీసీసీ ప్రతినిధులు సైబర్‌ క్రైమ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఐటీ చట్టంతోపాటు.. బీఎన్‌ఎ్‌సలోని సెక్షన్లు 352, 353, 1బీ కింద నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - Dec 19 , 2024 | 04:56 AM