Food Poisoning: వామ్మో.. మోమోస్!
ABN , Publish Date - Oct 29 , 2024 | 04:57 AM
నోరూరించే చిరుతిండి వాళ్లను తీవ్ర అస్వస్థతకు గురిచేసింది. ఆ సంతలో విశేష ఆదరణ ఉన్న రుచికరమైన మోమోస్ కోసం పిల్లలు, యువకులు, మహిళలు అంతా ఎగబడ్డారు.
కొంపముంచిన కలుషిత చిరుతిండి.. 50మందికి అస్వస్థత
మహిళ మృతి.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఘటన
నందినగర్, సింగాడికుంట బస్తీలోని సంతలో విక్రయం
బాధితుల్లో అధికులు 20 ఏళ్ల లోపువారే.. తయారీ సంస్థ సీజ్
నాసికరమైన మయనీసే కారణమా?
చికిత్సపొందుతూ మహిళ మృతి
బంజారాహిల్స్‌లో ఆలస్యంగా వెలగులోకి ఘటన
బాధితులు వివిధ ఆస్పత్రుల్లో.. ఎక్కువమంది 20 ఏళ్లలోపువారే
తయారీ సంస్థ సీజ్... నాసిరకం మయనీసే కారణమా?
బంజారాహిల్స్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): నోరూరించే చిరుతిండి వాళ్లను తీవ్ర అస్వస్థతకు గురిచేసింది. ఆ సంతలో విశేష ఆదరణ ఉన్న రుచికరమైన మోమోస్ కోసం పిల్లలు, యువకులు, మహిళలు అంతా ఎగబడ్డారు. తిన్నాక వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు! 50 మంది తీవ్ర అనారోగ్యానికి గురవగా, వారిలో ఓ మహిళ చికత్స పొందుతూ మృతిచెందింది. ఆ మాయదారి మోమో్‌సను విక్రయించింది బంజారాహిల్స్ పరిధిలోని నందినగర్, సింగాడికుంట బస్తీలోని సంతలోనైతే బాధితులంతా ఆ పరిధిలోని నాలుగు బస్తీలకు చెందినవారు. ఈనెల 25న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు. నందినగర్, సింగాడికుంట బస్తీలో ప్రతి శుక్రవారం కూరగాయల అంగడి జరుగుతుంది. ఈ నెల 25న కూడ సంత పెట్టారు. ‘ఢిల్లీ మోమోస్’ పేరిట ప్రతివారం ఈ సంతంల్లో మోమోస్ అమ్మే షాపు వెలుస్తుంది.
కేవలం రూ.30కే ఆరు మోమోస్ ఇస్తుండటంతో ఎప్పటిలాగే ఈసారి కూడా తినేందుకు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఇంటికి వెళ్లాక మోమోస్ తిన్నవారిలో చాలామంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో పాటు కొందరు తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడిపోయారు. ఏం జరిగిందో తెలియక తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు, బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. సింగాడికుంట బస్తీకి చెందిన రేష్మాబేగం ఆమె కుమార్తెలు రుష్మా, రఫీయా, కుమారుడు అబ్దుల్ రెహ్మాన్ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెడికల్ షాపు నుంచి మాత్రలు తెచ్చి వేసినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మరుసటి రోజు వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రేష్మా బేగం మృతిచెందింది.
ఆమె మృతికి కారణం తెలియకుండానే అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే రేష్మా పిల్లలతో పాటు బస్తీలో చాలామంది అస్వస్థతకు గురవడంతో మోమోస్ తినడం వల్లే ఈ విషాదం జరిగిందనే అనుమానాలు రేకెత్తాయి. పైగా.. సంతలోని ఢిల్లీ మోమోస్ వద్ద కలుషిత ఆహారం తిని తమ కుటుంబసభ్యులు అస్వస్థతకు గురయ్యారని నందినగర్‌కు చెందిన ఓ కూరగాయల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేష్మా మృతి చెందడం, బస్తీ వాసులు అస్వస్థతకు గురవడం.. ఓ ఫిర్యాదు ఘటనలకు విశ్లేషించగా నందినగర్, సింగాడికుంట బస్తీ, ఇబ్రహీంనగర్, గౌరీశంకర్‌కాలనీకి చెందిన సుమారు 50 మందికి పైగా అస్వస్థతకు గురయినట్లు తేలింది. వీరంతా నందినగర్, సింగాడికుంట సంతలో మోమోస్ తినడం వల్లే అని నిర్ధారణ అయింది. బాధితులు తన్వీర్, ద్వారకామాయి క్లీనిక్, రిలీఫ్ ఆస్పత్రి, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఎక్కువమంది 20 ఏళ్లలోపు వారే. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
నాసిరకం మయనీస్ వాడటం వల్లే
కలుషిత మోమో్‌సను తయారు చేసింది చింతల్‌బస్తీలోని ‘ఢిల్లీ మోమో్‌స’లోనని.. వీటిని సింగాడికుంట బస్తీ సాజిద్ హుస్సెన్ అనే వ్యక్తి, నందినగర్‌లో సాదిక్ అనే వ్యక్తి అని గుర్తించారు. చింతల్‌బస్తీలోని తయారీ కేంద్రాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం సీజ్ చేశారు. అక్కడ ఉన్న ఆహార పదార్ధాల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. మోమోస్ తయారీని, వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆదేశించారు. కాగా పూర్తి కలుషిత వాతావరణంలో మోమో్‌సను తయారు చేస్తున్నారని, విక్రయించిన నందినగర్, సింగాడికుంట బస్తీ సంతల్లో కూడా కలుషిత వాతావరణంలోనే కస్టమర్లకు ఇస్తున్నారని అధికారులు గుర్తించారు. మోమోస్ తయారీలో మయనీ్‌సను వాడతారు దీన్ని ఒకరమైన నూనె, కోడి గుడ్డులోని పచ్చ సొన, వెనిగర్ లేదా నిమ్మరసంతో తయారు చేస్తారు. మయనీస్ తయారీలోనే కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.