Share News

Dam Security: సాగర్‌ డ్యామ్‌పై హైడ్రామా!

ABN , Publish Date - Dec 29 , 2024 | 04:56 AM

కృష్ణా బేసిన్‌లోని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జునసాగర్‌ భద్రతపై శనివారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Dam Security: సాగర్‌ డ్యామ్‌పై హైడ్రామా!

ప్రాజెక్టు భద్రతపై దోబూచులాట!.. కేంద్రం ఆదేశంతో డ్యామ్‌ను వీడిన సీఆర్‌పీఎఫ్‌

  • సీఐఎ్‌సఎ్‌ఫను పెట్టాలని కేంద్రం యోచన

  • అభ్యంతరం తెలిపిన తెలుగు రాష్ట్రాలు

  • కేఆర్‌ఎంబీ విన్నపంతో మళ్లీ సీఆర్‌పీఎఫ్‌

నాగార్జునసాగర్‌/హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్‌లోని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జునసాగర్‌ భద్రతపై శనివారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రాజెక్టు భద్రత బాధ్యతను శనివారం ఉదయం సీఆర్‌పీఎఫ్‌ నుంచి టీజీఎస్పీఎఫ్‌ తీసుకోగా, సాయంత్రానికి సీఆర్‌పీఎఫ్‌ తిరిగి తమ అధీనంలోకి తీసుకుంది. డ్యామ్‌ భద్రతకు సీఆర్‌పీఎఫ్‌ స్థానంలో పారిశ్రామిక భద్రత బలగాల (సీఐఎ్‌సఎ్‌ఫ)ను మోహరించాలని కేంద్రం నిర్ణయించడం, దీనిపై రెండు తెలుగు రాష్ట్రాలు అభ్యంతరం తెలపడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. డ్యామ్‌ను వీడాలని సీఆర్‌పీఎ్‌ఫకు కేంద్రం ఆదేశాలివ్వడంతో.. తెలంగాణ వైపు క్యాంపును సీఆర్‌పీఎఫ్‌ బలగాలు శనివారం ఉదయం ఖాళీ చేశాయి. దీంతో ఆ స్థానంలో తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఎస్పీఎఫ్‌) బలగాలు డ్యామ్‌పై పహారా కాశాయి. అయితే సీఐఎ్‌సఎఫ్‌ అవసరం లేదని తెలుగు రాష్ట్రాలు తేల్చిచెప్పడంతో మళ్లీ సీఆర్‌పీఎ్‌ఫను వెనక్కి రప్పిస్తూ కేంద్రం ఆదేశాలు వెలువరించింది. మూడు రోజులుగా ఈ పరిణామాలు చోటుచేసుకుంటుండగా.. యంత్రాంగంతోపాటు కృష్ణా నదీ యాజమాన్య బోరు ్డ(కేఆర్‌ఎంబీ) ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. జనవరి 21న కేఆర్‌ఎంబీ సమావేశం కానుండడం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్వహణను పూర్తిగా తమకు అప్పగించాలనే తెలంగాణ డిమాండ్‌పై చర్చ జరగనున్న నేపథ్యంలో తాజా పరిణామం కలకలం రేపింది.


ఎన్నికల ముంగిట పరిణామాలతో..

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ నిర్వహణలో, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర నిర్వహణలో కొనసాగుతుండేవి. దాదాపు తొమ్మిదిన్నరేళ్లపాటు ఇలా కొనసాగాయి. అయితే 2023 నవంబరు 29న తెలంగాణ పోలీసు యంత్రాంగమంతా ఎన్నికల నిర్వహణలో నిమగ్నమైన వేళ.. అర్ధరాత్రి ఏపీ ప్రభుత్వం భారీ పోలీసు బలగంతో సాగర్‌లో ఆ రాష్ట్రం వైపు ఉన్న డ్యామ్‌ భాగాన్ని ఆక్రమించుకుంది. మరికొన్ని గంటల్లో తెలంగాణలో ఎన్నికలు జరుగునుండగా... జరిగిన ఈ చర్యను తెలుగు రాష్ట్రాల్లోని విపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. తాము కోరినన్ని నీటిని సాగర్‌ నుంచి విడుదల చేయనందువల్లే ఈ చర్యకు పాల్పడినట్లు అప్పటి జగన్‌ ప్రభుత్వం బుకాయించింది. అయితే నీళ్లకోసం ఇండెంట్‌ సమర్పించకుండా ఇదేం పద్ధతి? అంటూ కృష్ణాబోర్డుతో పాటు కేంద్రం కూడా తప్పుబట్టింది. అనంతరం తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం 2023 నవంబరు 28కి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని కోరింది. దీనిపై కేంద్ర హోంశాఖతోపాటు కేంద్ర జలశక్తి శాఖ వరుసగా సమావేశాలు నిర్వహించాయి. ఈ క్రమంలో సాగర్‌ డ్యామ్‌ను అటు ఏపీ అధీనంలో, ఇటు తెలంగాణ ఆధీనంలో కాకుండా.. కృష్ణాబోర్డు పాక్షిక నియంత్రణలోకి తీసుకెళ్లారు. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పనులు మాత్రం తెలంగాణ చూస్తోంది.


డ్యామ్‌ నిర్వహణ కోరుతున్న తెలంగాణ..

జాతీయ ఆనకట్టల భద్రత చట్టం(ఎన్‌డీఎ్‌సఏ)- 2021లోని సెక్షన్‌ 16(1ఏ) ప్రకారం నాగార్జునసాగర్‌ భద్రతకి సంబంధించిన నిఘా, 16(1బీ) ప్రకారం తనిఖీలు, 16(1సీ) ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోకి రావాలని, యావత్‌ జలాశయం నిర్వహణ, పర్యవేక్షణ, యాజమాన్యానికి సంబంధించిన కార్యకలాపాలన్నింటినీ తమకే అప్పగించాలని తెలంగాణ గుర్తు చేస్తోంది. రానున్న బోర్డు సమావేశంలో ఏపీని ఒప్పించి.. డ్యామ్‌ నిర్వహణ తమకే అప్పగించాలని కోరాలనుకునే సమయంలో భద్రతకు సంబంధించి తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ములుగు బెటాలియన్‌కు బయలుదేరిన బలగాలు.. తిరిగి వెనక్కి వచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము సాగర్‌ డ్యామ్‌ భద్రత నుంచి వైదొలగి వెళ్లిపోయామని సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ షాహీర్‌ తెలిపారు. కేఆర్‌ఎంబీ నుంచి సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులకు లేఖలు అందడంతో వారి ఆదేశానుసారం మళ్లీ విధుల్లోకి చేరామని చెప్పారు.

Updated Date - Dec 29 , 2024 | 04:56 AM