Agricultural Loan Waiver: రుణపడి ఉంటాం..
ABN , Publish Date - Jul 19 , 2024 | 02:47 AM
పంట రుణాల మాఫీపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. తొలి విడతలో లక్ష దాకా రుణం మాఫీ అయిన అన్నదాతలు రైతు వేదికల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
బ్యాంకు అప్పు ఏకకాలంలో మాఫీ
రేవంత్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తాం
రైతు వేదికల నుంచి అన్నదాతల కృతజ్ఞతలు
ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్
సీఎంకు అన్నదాతల కృతజ్ఞతలు
రేవంత్.. రైతుబాంధవుడు: కోమటిరెడ్డి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
పంట రుణాల మాఫీపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. తొలి విడతలో లక్ష దాకా రుణం మాఫీ అయిన అన్నదాతలు రైతు వేదికల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మాఫీతో పల్లెల్లో పండగ వాతావరణం నెలకొందని ఒక రైతు అంటే.. ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారని, రాహుల్ గాంధీని ప్రధాని చేస్తాం అని మరో రైతు సంబరాన్ని వ్యక్తం చేశాడు. ఇంకో రైతేమో తన రూ.లక్ష రుణం అంతా కూడా ఏకకాలంలో మాఫీ అయిందని ఆనందాన్ని వ్యక్తం చేస్తే.. మరో రైతు, సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటానని.. ఆయన చరిత్రలో నిలిచిపోతారని భావోద్వేగానికి గురయ్యాడు! గురువారం రుణమాఫీ ప్రారంభం సందర్భంగా జిల్లాల్లో మంత్రుల ఆఽధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు వేదికల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ సంభాషించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి రైతు మందర్న రవి మాట్లాడుతూ గతంలో రుణమాఫీ ప్రకటనలొస్తే అనుమానాలు ఉండేవని.. ఏకకాలంలో రుణమాఫీ చేయడం ద్వారా సీఎం చరిత్రలో నిలిచిపోతారని కృతజ్ఞతలు చెప్పారు. స్పందించిన రేవంత్ ‘‘మరి.. నాకు అంకాపూర్ దేశీ చికెన్ తినిపిస్తవా?’’ అని ఆయన్ను అడిగారు. తనకు ఉన్న రూ.78వేల రుణం మాఫీ అయిందని ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం గ్రామానికి చెందిన సీతారాం చెప్పాడు. తనకు రూ.50వేల మేర బ్యాంకు అప్పు మాఫీ అయింని నాగర్ కర్నూల్ జిల్లా రామాపురానికి చెందిన రాములమ్మ, సీఎంకు కృతజ్ఞతలు చెప్పింది. తనకు రూ.లక్ష రుణం ఉంటే ఏకకాలంలో మాఫీ అయిందంటూ సీఎంతో నల్లగొండ జిల్లా తిప్పర్తి రైతు గూడూరు రాజు ఆనందాన్ని పంచుకున్నారు. ఈ రైతువేదిక నుంచి పాల్గొన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాకు ఒకేరోజు రూ. 455 కోట్ల రుణమాఫీ నిధులు మంజూరు చేయడం ద్వారా సీఎం రేవంత్ రైతుబాంధవుడిగా నిలిచారని కృతజ్ఞతలు చెప్పారు.
గత ప్రభుత్వం ఆరేడు విడతలుగా చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని అన్నారు. రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని... మీ నల్లగొండ జిల్లాకే అత్యధిక నిధులు వచ్చాయని అన్నారు. తనకు నాలుగెకరాల భూమి ఉన్నదని, రూ. 70 వేల అప్పు మాఫీ అయ్యిందని నారాయణపేట జిల్లా ధన్వాడ మహిళా రైతు కుర్వ లక్ష్మి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి నుంచి బుర్రి మహేందర్ అనే రైతు మాట్లాడుతుండగా సీఎం జోక్యం చేసుకున్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు ఇస్తామని చెప్పారు. రుణమాఫీపై ఇచ్చిన మాటను సీఎం రేవంత్ నిలబెట్టుకున్నారని, ఆయనకు తాము రుణపడి ఉంటామని, రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని వరంగల్ జిల్లా కేంద్రం ఉర్సు ప్రాంతానికి చెందిన బొల్లు ఎల్లయ్య అన్నారు. స్పందించిన రేవంత్.. రుణమాఫీ ప్రకటన వరంగల్ డిక్లరేషన్‌లో జరిగిందని, అక్కడి ఆర్ట్స్ కాలేజీలో రాహుల్‌గాంధీని పిలిచి 5 లక్షల మందితో సభ పెడతామని ప్రకటించారు.
రైతులకు చెక్కుల పంపిణీ
రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా సచివాలయంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుంచి రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం రేవంత్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రైతువేదికల నుంచి వీసీలో పాల్గొన్న రైతులంతా తీర్మానాన్ని బలపరిచారు. గ్రామసభులు పెట్టి రుణమాఫీ గురించి ప్రజలకు చేరవేయాలని, రైతులు ఏవైనా ఇబ్బందులు పడితే కాంగ్రెస్ కార్యకర్తలు బ్యాంకులకు తీసుకెళ్లి సహకరించాలని సూచించారు. రాహుల్‌గాంధీని వరంగల్ సభకు ఆహ్వానించటానికి ఉప ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్తామని, రైతులు సంఘీభావం ప్రకటించాలని కోరారు.
500 రైతువేదికల్లో వీసీ సెంటర్లు ప్రారంభం
రైతునేస్తంలో భాగంగా గత జనవరి నెలలో 566 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ప్రారంభించారు. తాజాగా గురువారం మరో 500 రైతు వేదికల్లో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ఏడాదే అన్ని రైతువేదికల్లో వీసీ యూనిట్లు ఏర్పాటు చేస్తామని కార్యదర్శి రఘునందన్‌రావు తెలిపారు.