Bhatti Vikramarka: బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక విధ్వంసం
ABN , Publish Date - Jul 27 , 2024 | 08:55 PM
తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ విధ్వంసం చేసిందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) సంచలన ఆరోపణలు చేశారు. శనివారం నాడు అసెంబ్లీలో భట్టి మాట్లాడారు. గత పదేళ్లలో హైదరాబాద్‌కు పెట్టుబడులు భారీగా వచ్చాయని బీఆర్‌ఎస్ చెప్పుకుందని తెలిపారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) సంచలన ఆరోపణలు చేశారు. శనివారం నాడు అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా భట్టి మాట్లాడారు. గత పదేళ్లలో హైదరాబాద్‌కు పెట్టుబడులు భారీగా వచ్చాయని బీఆర్‌ఎస్ చెప్పుకుందని తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి వల్లే పెట్టుబడులు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల ఫలితాలు బీఆర్‌ఎస్ హయాంలో కనిపించాయిని గుర్తుచేశారు. ORRపై 30 ఏళ్లపాటు వచ్చే ఆదాయాన్ని ఒక్క ఏడాదిలోనే తీసుకున్నారని భట్టి విక్రమార్క తెలిపారు.
పదేళ్లుగా పదోన్నతులు, బదిలీలు లేవు..
గత ప్రభుత్వం రెండు నెలల ఆసరా పింఛన్లు ఎగ్గొట్టిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. పదేళ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో 16వేల మంది టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించినట్లు వివరించారు.అభివృద్ధి చర్యల ఫలాలు ఐదు, పదేళ్ల తర్వాత కనిపిస్తాయని ఉద్ఘాటించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు లేవని అన్నారు. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు ప్రణాళికలు రూపొదిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటు..
ఐటీఐలను స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలుగా మార్చుతామని అన్నారు. పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒక అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఉంటుందని స్పష్టం చేశారు. సాగునీటి జలాల సమస్య తీర్చాలనే రాష్ట్రం తెచ్చుకున్నామని వివరించారు. రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టి కాళేశ్వరం నిర్మించినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా..లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులను తాము పూర్తి చేస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
అప్పుల పాలు చేసింది..
‘‘తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ విధ్వంసం చేసి, అప్పుల పాలు చేసింది. ఉద్యోగస్తులకు జీతాలు కూడా చెల్లించలేని కటకటలాడే పరిస్థితి తీసుకువచ్చింది. మేము అధికారంలోకి వచ్చాకే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి.. నెలనెలా మొదటి తేదీన జీతాలు ఇస్తున్నాం. వ్యవసాయాన్ని, సంక్షేమాన్ని, పరిశ్రమలను హైదరాబాద్ నగరాన్ని, మహిళలను, యువతను అన్ని రంగాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశ పెట్టాం. తాము పెట్టిన బడ్జెట్ పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సభ సాక్షిగా మాజీ మంత్రి హరీష్ రావు పచ్చి అబద్దాలు చెబుతున్నారు. సభను, రాష్ట్ర ప్రజలను తప్పదోవ పట్టించేలా మాట్లాడటం సరైంది కాదు’’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేశారు..
‘‘ఎక్సైజ్‌లో మేము వేలం పెట్టాం మాకు ఆదాయం పెరిగింది అంటున్నారు.. అసలు వేలం ఇప్పుడు కదా పెట్టాల్సింది.. మీరు ముందే ఎందుకు పెట్టారు?? ఎంత దొరికితే అంత దోచుకుందామనే వేలం ముందే పెట్టారు. ప్రభుత్వానికి వేలం ద్వారా రావాల్సిన ఆదాయాన్ని టానిక్ లాంటి మద్యం దుకాణాలు పెట్టి ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేసి కొన్ని కుటుంబాల జేబుల్లోకి పోయేలా చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు 2024-25 వార్షిక బడ్జెట్ లో 3,836 కోట్లు కేటాయింపులు చేశాం. ఇందిరా మహిళా శక్తి పథకానికి 2024-25 వార్షిక బడ్జెట్‌లో రూ. 50.41కోట్లు కేటాయించాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు, వారి గుండె చప్పుడును అర్థం చేసుకొని అత్యంత ప్రగతిశీల భావాలతో పీపుల్స్ బడ్జెట్‌గా ఈ సభలో ప్రవేశ పెట్టాం’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.