Share News

Hyderabad: ఆ విషయంలో మాజీ సీఎం చతురత నెక్స్ట్ లెవెల్: సీఎం రేవంత్ రెడ్డి..

ABN , Publish Date - Dec 04 , 2024 | 02:10 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆర్థిక క్రమశిక్షణ వల్లే తెలంగాణ రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రోశయ్య 16 సార్లు ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అవగాహన పెంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని 2007లోనే ఆయన తనకు చెప్పినట్లు వెల్లడించారు.

Hyderabad: ఆ విషయంలో మాజీ సీఎం చతురత నెక్స్ట్ లెవెల్: సీఎం రేవంత్ రెడ్డి..
CM Revanth Reddy

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రోశయ్యకు నగరంలో విగ్రహం లేకపోవడం లోటుగా కనిపిస్తోందని, ఆయన నాలుగో వర్ధంతి నాటికి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. శాసనసభ, శాసనమండలిలో పోటీపడి మాట్లాడే స్ఫూర్తిని ఆయన అందించారని రేవంత్ కొనియాడారు. ఇవాళ (బుధవారం) హైదరాబాద్‌ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో రోశయ్య మూడో వర్థంతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


అందుకే మిగులు బడ్జెట్..

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. " మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆర్థిక క్రమశిక్షణ వల్లే తెలంగాణ రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడింది. రోశయ్య 16 సార్లు ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మరింత అవగాహన పెంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని 2007లోనే ఆయన నాకు సూచించారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించాలని, పాలకపక్షంలో ఉంటే పరిష్కరించాలని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తేనే పాలక పక్షాలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. కానీ చట్టసభల్లో నేడు ఆ స్ఫూర్తి కొరవడింది. ప్రశ్నించే వారిని మాట్లాడనివ్వద్దనే పరిస్థితులు ఏర్పడ్డాయి.


అలాంటి సహచరుడు లేరు..

తమిళనాడు గవర్నర్‌గా కూడా రోశయ్య రాణించారు. సమస్యలు పరిష్కరించడంలో ఆయన చతురత ప్రదర్శించడం వల్లే గత ముఖ్యమంత్రులు సమర్థవంతంగా పని చేయగలిగారు. తెలంగాణ శాసనసభలో నేడు వ్యూహాత్మకంగా సమస్యలు పరిష్కరించగలిగే ఆయన లాంటి సహచరుడు లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అలాంటి సహచరుడు ఉంటే ఎవరైనా ముఖ్యమంత్రి హోదాలో అద్భుతంగా రాణించొచ్చని నేను నమ్ముతున్నా. చట్టసభలకు సీఎంలు చదువుకుని రాకపోయినా రోశయ్య మాత్రం గతం గురించి అవగాహనతో, భవిష్యత్తు ప్రణాళికలతోనో సభలో కూర్చునేవారు.


రోశయ్య ఇంటికే పదవులు..

రోశయ్య ఆనాడు ప్రభుత్వాలను కంచవేసి కాపాడేవాడు. అందుకే ముఖ్యమంత్రులుగా ఎవరున్నా నెంబర్-2గా మాత్రం ఎప్పుడూ రోశయ్యనే ఉండేవారు. నంబర్ వన్ స్థానంలో ఉన్న వారిని జరిపి అందులో కూర్చోవాలని ఆయన ఏనాడు తాపత్రయపడలేదు. పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతే సమయం వచ్చినప్పుడు ఆయన్ను సీఎం చేసింది. రోశయ్యకు ఉన్న నిబద్ధతే అన్ని పదవులు, హోదాలనూ ఆయన ఇంటికి తెచ్చిపెట్టింది. రాజకీయాలలో ఆర్యవైశ్యులకు తగిన స్థానం ఇస్తాం. రోశయ్యను నికార్సైన హైదరాబాద్ వాసిగా నేను విశ్వసిస్తున్నా. నగరంలో ఆయనకు విగ్రహం లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. రోశయ్య నాలుగో వర్ధంతి లోపు హైదరాబాద్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం" అని చెప్పారు.

Updated Date - Dec 04 , 2024 | 02:10 PM