Share News

Big Breaking: దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలకు హైకోర్ట్ బ్రేక్

ABN , Publish Date - Sep 23 , 2024 | 01:43 PM

చెరువులు, నాలాలపై ఆక్రమణలను కూల్చివేస్తూ దూసుకెళ్తున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్ట్ స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Big Breaking: దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలకు హైకోర్ట్ బ్రేక్

హైదరాబాద్: చెరువులు, నాలాలపై ఆక్రమణలను కూల్చివేస్తూ దూసుకెళ్తున్న హైడ్రాకు (HYDRA) తెలంగాణ హైకోర్ట్ (TS High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్ట్ స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని హైకోర్ట్ పేర్కొంది.


అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు పరిసర నివాసితులు హాజరు కావాలని కోర్ట్ తెలిపింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుంచి ఆరు వారాల లోపు తుది నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పరిణామంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకు ఊరట దక్కినట్టు అయ్యింది.


మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు

మరోవైపు హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆదివారం కూకట్‌పల్లిలోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా.. ఇవాళ మాదాపూర్‌లో కూల్చివేతలు కొనసాగిస్తోంది. కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. పార్కులో స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదులు చేసింది. దీంతో తక్షణమే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ముందుగా స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను తొలగించారు. నిర్మాణాలను తొలగించిన అనంతరం కావూరిహిల్స్ పార్క్ అని అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు. కాగా కావూరి హిల్స్ అసోషియషన్ నుంచి 25 ఏళ్లపాటు లీజుకు తీసుకున్నామి స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు. గడువు ముగియక ముందే అన్యాయంగా నిర్మాణాలను తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Updated Date - Sep 23 , 2024 | 02:14 PM