Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం...
ABN , Publish Date - Nov 08 , 2024 | 08:17 AM
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరయింది. అమెరికాలో స్థిరపడిన కుటుంబసభ్యుల ద్వారా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలియవచ్చింది. కొన్ని రోజుల క్రితమే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరయింది.
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు (Prabhakararao) అమెరికా (America)లో గ్రీన్‌కార్డు (Green Card) మంజూరయింది. అమెరికాలో స్థిరపడిన కుటుంబసభ్యుల ద్వారా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలియవచ్చింది. కొన్ని రోజుల క్రితమే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరయింది. ప్రభాకర్‌రావుకు గ్రీన్ కార్డు మంజూరు విషయం తెలిసి.. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. గ్రీన్‌కార్డు లభించడం.. కేసు దర్యాప్తుకు ప్రభావం చూపే అవకాశముంది. కేసు దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావుపై పోలీసులు ఎల్ఓసి జారీచేశారు. మరోవైపు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కలర్ నోటీస్ జారీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభాకర్‌రావుకు గ్రీన్ కార్డుతో ఎంత కాలమైనా అమెరికాలో ఉండే వెసులుబాటు ఉంటుంది. దీంతో ఆయన హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే ఆయన పాస్‌పోర్టు రద్దు కావడంతో.. అమెరికాలోని భారత ఎంబసీ ద్వారా అక్కడి అధికారులకు చేరవేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడిన తర్వాత ప్రభాకరరావు అమెరికా వెళ్లిపోయారు. ఈ ఏడాది మార్చి 10న ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ రమేష్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మార్చి 11న అమెరికా వెళ్లిన ప్రభాకర్‌రావు అక్కడే ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. నలుగురు పోలీసు అధికారుల్ని అరెస్ట్ చేయడంతో సంచలనం రేపింది. ఆ తర్వాత ప్రభాకర్‌రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చిన తర్వాత కోర్టు ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. అప్పటి నుంచి ప్రభాకర్‌ను అమెరికా నుంచి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు.
అయితే తాను వైద్యచికిత్స నిమిత్తం అమెరికా వెళ్లానని ప్రభాకరరావు చెప్పారు. తాను ఇల్లినాయిస్ అరోరాలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన వీసా గడువు జూన్‌తో ముగుస్తుందని.. ఈ క్రమంలో వైద్యులు అనుమతిస్తే హైదరాబాద్ వస్తానని చెప్పారు. అయితే గడువు దాటినా ప్రభాకర్ రావు హైదరాబాద్ రాలేదు. గడువును మరో ఆరునెలలకు పొడిగించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రభాకర్‌రావుపై లుక్‌అవుట్ నోటీసు జారీ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇంటర్‌పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయించే ప్రయత్నం చేశారు. ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును సైతం రద్దు చేశారు. ఆ విషయాన్ని విదేశాంగ శాఖ ద్వారా అమెరికా పోలీసులకు చేరవేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఆయనకు గ్రీన్‌కార్డు వచ్చింది. దీంతో ఇప్పుడు ఏం చేయాలన్నదానిపై పోలీసులు ఆలోచన చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ ‘మాడా’ మాటలు మాట్లాడటం సిగ్గుచేటు
వైసీపీ నేత హరికృష్ణారెడ్డి అరెస్ట్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News