Minister Ponnam: ప్రొటోకాల్ రగడ.. అలిగి గుడిబయటే కూర్చున్న మంత్రి, మేయర్
ABN , Publish Date - Jul 09 , 2024 | 11:26 AM
హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులను కనీసం పట్టించుకోలేదు...
హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని, ఇక్కడి ప్రజల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటి చెప్పే పండుగల్లో బోనాలు ఒకటి. ఈ పండుగను ఎంతో ఘనంగా నగరవాసులు జరుపుకుంటున్నారు. ఇక నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం మంగళవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కల్యాణంను చూడటానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివస్తున్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ.. ప్రోటోకాల్ రగడ నెలకొంది. పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో పొన్నం తీవ్ర అసహనానికి లోనయ్యారు.
అలిగి.. ఆలయం బయటే..!
ఈ ప్రొటోకాల్ వివాదంతో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు, మేయర్ గద్వాల విజయ లక్ష్మి అలకబూనారు..! అసహనంతో ఆలయం బయటే కూర్చుని ఒకింత నిరసన తెలిపినట్లు చేశారు. ఈ క్రమంలోనే తోపులాట కూడా జరిగింది. దీంతో మేయర్‌కు గాయాలయ్యాయి కూడా. కనీసం ప్రొటోకాల్ ప్రకటించడానికి మీకొచ్చిన ఇబ్బందేంటి..? అని ఆలయ అధికారులను మంత్రి ప్రశ్నించారు. చివరికి అధికారులు రంగంలోకి దిగి ఒకటికి రెండుసార్లు నచ్చచెప్పడంతో మంత్రి, మేయర్ అలక వీడారు. అనంతరం కల్యాణోత్సవంలో పొన్నం, విజయలక్ష్మి పాల్గొన్నారు.
అంతా ఓకేగానీ..!
ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవార్లకు అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తుండడంతో ఆలయ అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఆలయం చుట్టుపక్కల ప్రధాన రహదారులు మూసివేశారు. అంతా ఓకేగానీ ప్రొటోకల్ విషయంలో మాత్రం రగడ నెలకొంది.