Betting Apps: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలు కాపాడిన సెల్ ఫోన్ లైట్.. అసలేం జరిగిందంటే..
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:42 PM
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వందలు, వేల రూపాయలు పెడితే లక్షలు సంపాదించొచ్చనే సోషల్ మీడియా ప్రమోషన్స్ చూసి ఆకర్షితుడయ్యాడు. ఈ మేరకు బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టేందుకు సిద్ధం అయ్యాడు.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ బారిన పడి అనేక మంది లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు. పీకల్లోతు అప్పల్లో మునిగిపోయి ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. అయితే అతని సెల్ ఫోన్ లైట్ అతని ప్రాణాలను కాపాడింది.
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వందలు, వేల రూపాయలు పెడితే లక్షలు సంపాదించొచ్చనే సోషల్ మీడియా ప్రమోషన్స్ చూసి ఆకర్షితుడయ్యాడు. ఈ మేరకు బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టేందుకు సిద్ధం అయ్యాడు. అప్పటివరకూ సంపాదించిన డబ్బులే కాకుండా స్నేహితుల వద్ద నుంచి సైతం లక్షల రూపాయలు తెచ్చి అందులో పెట్టేశాడు. బెట్టింగ్‌పై మోజుతో చివరికి ఉద్యోగాన్ని సైతం వదిలేసి దానిపైనే ఫోకస్ పెట్టాడు. కానీ, చివరికి అతనికి రూ.3లక్షల అప్పు మిగిలింది. ఇచ్చిన సొమ్ము తిరిగి చెల్లించాలంటూ స్నేహితులు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు.
ఈ మేరకు గురువారం రాత్రి 10 గంటల సమయానికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ శివారుకు వెళ్లాడు. చుట్టుపక్కల గమనించి ఎవ్వరూ లేకపోవడంతో రైల్వే పట్టాలపై పడుకున్నాడు. చివరి సారిగా తన సోదరితో మాట్లాడాలని భావించి ఫోన్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, బెట్టింగ్ ఆడి రూ.3 లక్షలు అప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను రైలు పట్టాలపై పడుకున్నానని, మరికాసేపట్లో చనిపోతున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే అప్పులన్నీ చెల్లిస్తానని బలవన్మరణానికి పాల్పడవద్దంటూ అతని సోదరి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయినా సదరు యువకుడు చనిపోయేందుకే నిర్ణయించున్నట్లు చెప్పాడు.
అయితే అదే సమయానికి సికింద్రాబాద్ స్టేషన్‌లో జీఆర్పీ కానిస్టేబుల్ సైదులు, ఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ సురేశ్ విధుల్లో ఉన్నారు. వారికి దూరంగా పట్టాలపై సదరు యువకుడు మాట్లాడుతున్న సెల్ ఫోన్ లైట్ కనిపించింది. దీంతో ఏం జరుగుతుందో అర్ధంకాని వారిద్దరూ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దగ్గరికి వెళ్లి చూడగా పట్టాలపై యువకుడు పడుకుని ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతన్ని కాపాడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. బెట్టింగ్ ఆడి మోసపోయి ప్రాణాలు తీసుకోవద్దంటూ పోలీసులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
హైదరాబాద్ మెట్రోకు భారీ నష్టం..
Stored Water: ఆ నీటిని వాడుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు రావడం ఖాయం..
Attack On Maoists: భద్రతా దళాలకు ఎదురుపడిన మావోయిస్టులు.. చివరకు..