Hyderabad: ఔటర్.. బంగారు బాతే!
ABN , Publish Date - Jun 13 , 2024 | 03:39 AM
ఔటర్ రింగ్ రోడ్డు.. ఆదాయ పరంగా బంగారు బాతు అన్నది స్పష్టమవుతోంది. ఔటర్‌పై రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీతో ఆదాయం భారీగా పెరుగుతోంది. ప్రతి నెలా హెచ్‌ఎండీఏ అధికారులు ఊహించని స్థాయిలో రాబడి వస్తోంది.
వాహనాల రద్దీతో పెరుగుతున్న ఆదాయం
టోల్ చార్జీల పెంపుతో ఇంకా పెరిగే చాన్స్
గత ఏడాది అతి తక్కువకే
30 ఏళ్ల పాటు లీజుకిచ్చిన హెచ్‌ఎండీఏ
దీనిపై అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు
ఏప్రిల్‌లో రూ.60 కోట్లు..
మే నెలలో 62.7 కోట్ల రాబడి
హైదరాబాద్ సిటీ, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగ్ రోడ్డు.. ఆదాయ పరంగా బంగారు బాతు అన్నది స్పష్టమవుతోంది. ఔటర్‌పై రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీతో ఆదాయం భారీగా పెరుగుతోంది. ప్రతి నెలా హెచ్‌ఎండీఏ అధికారులు ఊహించని స్థాయిలో రాబడి వస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డును లీజుకు ఇచ్చే సందర్భంలో ఓ ప్రైవేటు ఏజెన్సీ మదింపు చేసిన ఆదాయ అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. అప్పుడు.. ఏడాదికి 2శాతం నుంచి 3శాతం వరకు ఆదాయం పెరుగుతుందని అంచనాలు వేయగా, ప్రస్తుతం ఒక్కో నెలకే 4శాతానికి పైగా పెరుగుతోంది. టోల్ చార్జీలు పెంచకముందే ఆదాయం ఈ స్థాయిలో పెరుగుతుండడంతో.. చార్జీల పెంపుతో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఔటర్ ఆదాయంపై అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాలు అక్షరసత్యాలు అని నిరూపితమవుతున్నాయి. గతేడాది ఔటర్ రింగ్ రోడ్డును హెచ్‌ఎండీఏ గత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఏటేటా భారీ ఆదాయాన్ని సమకూర్చే ఔటర్‌ను చాలా తక్కువ బిడ్‌కు 30 ఏళ్లకు లీజుకివ్వడాన్ని ప్రస్తావిస్తూ.. ‘రాసిచ్చేశారు’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతోపాటు ఔటర్‌పై ఏటా పెరిగే ఆదాయ, వ్యయాలను అంచనా వేసి చూపిస్తూ.. రాష్ట్రానికి బంగారు బాతు లాంటి ఔటర్‌ను ప్రైవేటుపరం చేయడాన్ని పేర్కొంటూ ‘బంగారు బాతు.. బలి’ అనే శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ కథనాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతోపాటు అప్పటి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. విపక్షాలకు అస్త్రంగా మారాయి. ఆ కథనాలన్నీ ఇప్పుడు అక్షరసత్యాలుగా నిరూపితమవుతున్నాయి.
టోల్ చార్జీల పెంపుతో సంబంధం లేకుండానే
ఔటర్‌ను ప్రైవేటు సంస్థకు అప్పగించిన సందర్భంలో ఆదాయాన్ని మదింపు చేసిన ఏజెన్సీ.. ఏటా 2శాతం నుంచి 3శాతానికి అటు, ఇటుగా రాబడి పెరుగుతుందని అంచనాలు వేసింది. ముఖ్యంగా హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) ప్రకారం ఏటా టోల్ చార్జీల్లో చోటుచేసుకునే 4శాతం నుంచి 5శాతం పెంపుదల మేరకే ఆదాయం పెరుగుతుందని ఆ ఏజెన్సీ తేల్చింది. సాధారణంగా ఏప్రిల్ నుంచి కొత్తగా అందుబాటులోకి వచ్చే టోల్ చార్జీలతో ఆ ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పెరుగుతుందని హెచ్‌ఎండీఏ అధికారులు కూడా అంచనాలు వేశారు. కానీ, ప్రస్తుతం టోల్ చార్జీలు పెంచకుండానే ప్రతి నెలా ఆదాయం పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.60.2 కోట్ల ఆదాయం రాగా, మే నెలలో రూ.62.7 కోట్లు వచ్చింది. అంటే దాదాపు రూ.2.5 కోట్లు పెరిగింది. ఒక్క నెలకే 4.2 శాతం పెరుగుదల నమోదైంది.
ఈ పెరుగుదల గతేడాది నుంచి కొనసాగుతోంది. ఔటర్‌పై రోజు రోజుకూ వాహనాల రద్దీ పెరుగుతుండడంతో ఆ మేరకు ఆదాయం పెరుగుతోంది. కాగా, డబ్ల్యూపీఐ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ చార్జీలు ఏప్రిల్ 1 నుంచే పెరగాలి. కానీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిని పెంచకుండా నిలిపివేశారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగియడంతో టోల్ చార్జీలు పెంచుకోవడానికి అవకాశం కల్పించారు. దాంతో ఈచార్జీలు 4శాతం నుంచి 5శాతం మేర పెరిగాయి. ఇందుకు అనుగుణంగా ఆదాయం పెరుగుతుందని, వాహనాల రద్దీ ద్వారా వచ్చే ఆదాయం అదనంగా ఉంటుందని హెచ్‌ఎండీఏ- హెచ్‌జీసీఎల్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు.