KCR : 12 సీట్లిస్తే.. సర్కారు మెడలు వంచుతా
ABN , Publish Date - Apr 25 , 2024 | 04:55 AM
‘అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య పంచాయితీ పడింది. దీన్ని తీర్చే పెద్ద ఎవరు..? బీఆర్‌ఎస్.. కేసీఆరే కదా..? మాయమాటలు చెప్పి
జనం తరఫున పోరాడి.. పనులు చేయిస్తా
కాంగ్రెస్‌తో ప్రజలకు పంచాయితీ పడింది
అడ్డగోలుగా హామీలిచ్చి.. ఒక్కటీ నెరవేర్చలేదు
తెలంగాణకు మొదటి నుంచీ కాంగ్రెస్సే శత్రువు
సాగర్ ఆయకట్టును ఎండబెట్టిన దద్దమ్మలు వీళ్లు
జైళ్లు, తోక మట్టలకు కేసీఆర్ భయపడతాడా?
అంబేడ్కర్ జయంతి రోజు కనీసం దండ వేయని
ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు
మిర్యాలగూడలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఢీకొన్న 8 కార్లు
నల్లగొండ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య పంచాయితీ పడింది. దీన్ని తీర్చే పెద్ద ఎవరు..? బీఆర్‌ఎస్.. కేసీఆరే కదా..? మాయమాటలు చెప్పి నాపై నిందలు వేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నదేమీ లేదు. ప్రజలకు న్యాయం జరగాలంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి పని చేయించాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు శక్తినివ్వాలి. ఈ ఎన్నికల్లో 12 సీట్లు గెలిపిస్తే భూమిని, ఆకాశాన్ని ఏకం చేసి జనం తరఫున పోరాడుతా’’ అని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టిన ఆయన.. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి చౌటుప్పల్ , నల్లగొండ, తిప్పర్తి, మాడ్గులపల్లి మీదుగా మిర్యాలగూడ చేరుకున్నారు. అక్కడ రోడ్‌షో తర్వాత సూర్యాపేట చేరుకుని, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని, చర్లపల్లి జైల్లో పెడతామని మాట్లాడుతున్నారు. ఇలాంటి జైళ్లు, తోకమట్టలకు కేసీఆర్ భయపడతాడా? అలా భయపడితే 15ఏళ్ల పాటు ఉద్యమం నడిపి తెలంగాణ సాధించే వాళ్లమా?’’ అని ప్రశ్నించారు. తనను ఉద్దేశించి గుడ్లు పీకుతా.. పేగులు తీసి మెడలో వేసుకుంటా.. చెడ్డీ గుంజుతానని రేవంత్ మాట్లాడుతున్నారని, ఒక ముఖ్యమంత్రి ఇలాంటి భాష మాట్లాడవచ్చా? అని నిలదీశారు. శ్వేతపత్రాలతో బోగస్ మాటలు చెబుతున్న రేవంత్‌రెడ్డి.. ఆరు హామీలకు పంగనామాలు పెట్టారని దుయ్యబట్టారు. 1956 నుంచీ తెలంగాణకు ముఖ్య శత్రువు కాంగ్రెస్సేనని, ఆనాడు ఏపీలో కలిపి 58ఏళ్ల పాటు ప్రజల అరిగోసకు కారణమైందని దుయ్యబట్టారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 420 హామీలిచ్చి, చక్కని తెలంగాణలో ఉరుములా వచ్చిపడిందని ధ్వజమెత్తారు. రైతు బంధు ఇవ్వడం లేదని, రైతు బీమా ఉంటుందో ఉండదో తెలియడం లేదని, నాడు బందోబస్తుగా ఉన్న రైతులు నేడు ఆగమైతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు ఇస్తే వీళ్ల అబ్బ సొమ్ము ఏం పోతుంది?అని నిలదీశారు. ‘‘బీఆర్‌ఎస్ హయాంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. మొన్న అంబేడ్కర్ జయంతి రోజున ప్రస్తుత సీఎం, మంత్రులు కనీసం దండ వేయడానికి కూడా అక్కడికి వెళ్లలేదు. పైగా ఆ ప్రాంగణానికి తాళం వేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు’’ అని అన్నారు.
కరెంటు ఎందుకు ఇవ్వడం లేదు?
బీఆర్‌ఎస్ పాలనలో రెప్పపాటు సమయం కూడా కరెంటు పోలేదని, ఈ ప్రభుత్వం వచ్చాక కరెంటు కోతలు ఎందుకు వస్తున్నాయని కేసీఆర్ నిలదీశారు. మిగులు విద్యుత్ ఉన్నా ఎందుకు కరెంటు సరఫరా చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో సాగర్ ఆయకట్టుకు ఎలాంటి కొరత లేకుండా నీరిచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ దద్దమ్మలు అధికారంలోకి వచ్చాక సాగర్ ప్రాజెక్టును కేఆర్‌ఎంబీకి అప్పగించి, ఆయకట్టును ఎండబెట్టారని దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లా మంత్రులకు కేసీఆర్‌ను తిట్టి పబ్బం గడుపుకోవడం తప్ప వేరే పని లేదని విమర్శించారు. తాను వస్తుంటే మార్గమధ్యంలో ఆర్జాలబావి వద్ద రైతులు ఆపి 25రోజులుగా ధాన్యం కొనడం లేదని చెప్పారని, ఈ సమస్యపై పోరాడతామని పేర్కొన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు రూ.4వేలు ఇస్తామని చెప్పిన భట్టి.. ఇప్పుడు అలా చెప్పలేదని తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. డిసెంబరు 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్.. ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని నిలదీశారు.
కంచర్ల కృష్ణారెడ్డి విజయం తథ్యం
బీఆర్‌ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి సూర్యాపేటలో 50వేల ఓట్ల మెజార్టీ ఖాయమని కేసీఆర్ అన్నారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఒకప్పుడు బీళ్లుగా ఉన్న భూములకు కాళేశ్వరం ద్వారా నీటిని అందించామని గుర్తు చేశారు. సూర్యాపేట పోరాటాల ఖిల్లా అని, జగదీశ్‌రెడ్డి నాయకత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. జిల్లా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిద్రావస్థలో ఉన్నారని ధ్వజమెత్తారు. టెయిల్‌పాండ్ నుంచి ఏపీ అక్రమంగా 5 టీఎంసీల నీటిని తరలించుకుపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలను బాధపెడితే ఊరుకునేది లేదని, ఎంత వరకైనా తెగిస్తానని స్పష్టం చేశారు.
ఒకదానికొకటి ఢీకొన్న ఎనిమిది కార్లు
బస్సు యాత్ర సందర్భంగా మిర్యాలగూడకు వెళ్తున్న కేసీఆర్ కాన్వాయ్‌లోని ఎనిమిది కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వేములపల్లి మండలం బుగ్గబాయిగూడెం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. కేసీఆర్ బస్సు వెనుక వెళ్తున్న ఒక కారు ఆకస్మాత్తుగా ఆగడంతో దాని వెనక వేగంగా, తక్కువ దూరంలో వెళ్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఎవరికీ గాయాలు కాకపోవడంతో బీఆర్‌ఎస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. 5 నిమిషాల తర్వాత కాన్వాయ్ ముందుకు సాగింది.
సరైన ముహూర్తం.. పక్కా వాస్తు!
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): సరైన ముహూర్తం.. పక్కా వాస్తును అనుసరిస్తూ.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన బస్సు యాత్రను ప్రారంభించారు. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 1.35 గంటలకు వాయువ్యం గేటు నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్.. తిరిగి 1.38 గంటలకు ఆగ్నేయం గేటు నుంచి బయటకు వచ్చారు. 17 రోజుల పాటు 21 రోడ్డుషోల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. గురువారం భువనగిరిలో పర్యటించనున్నారు.