Share News

Minister Tummala: పది వేల కోట్లు ఖర్చయినా మాట నిలబెట్టుకుంటాం..

ABN , Publish Date - Aug 15 , 2024 | 05:14 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టుకి గోదావరి జలాలు తరలించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లాలోని 6.74లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తుమ్మల తెలిపారు.

Minister Tummala: పది వేల కోట్లు ఖర్చయినా మాట నిలబెట్టుకుంటాం..
Minister Tummala Nageswara Rao

ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టుకి గోదావరి జలాలు తరలించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లాలోని 6.74లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తుమ్మల తెలిపారు. వ్యవసాయానికి గోదావరి జలాలు అందించేందుకు భద్రాద్రి రాముడి సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటిచ్చారని మంత్రి చెప్పారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వైరాలో ఏర్పాటు చేసిన మూడో విడత రైతు రుణమాఫీ భారీ బహిరంగ సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.


రాజీవ్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకి గోదావరి జలాలు అందించడం కోసం సీతారామ ప్రాజెక్టు మూడు పంపు హౌస్‌లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(గురువారం) ప్రారంభించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కేవలం మూడు, నాలుగు నెలల్లోనే రూ.600 కోట్లతో సీతారామ ప్రాజెక్టు స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసి నీళ్లు విడుదల చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గంలో రాజీవ్ కెనాల కోసం భూములు ఇచ్చిన రైతన్నలకు చేతులెత్తి నమస్కరించారు. భూములు ఇచ్చిన ప్రతి అన్నదాతకూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దేవుడు దయవల్ల కృష్ణా, గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు వచ్చాయంటూ మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.


జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద పంటలకు సాగునీరు అందించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు మంత్రి తుమ్మల చెప్పారు. సీతారామ ప్రాజెక్టు మిగులు పనులకు రూ.10వేల కోట్లు ఖర్చయినా ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లల్లో పూర్తి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. పాలేరు రిజర్వాయర్‌కు గోదావరి జలాలు తరలించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, జిల్లా రైతుల కోరికని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

ఈ వార్త కూడా చదవండి:

సీతారామ ప్రాజెక్టును 2026కల్లా పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్

Updated Date - Aug 15 , 2024 | 05:49 PM