Minister Tummala: రైతు ఆత్మహత్యపై మంత్రి తుమ్మల ఆగ్రహం.. తక్షణమే విచారణ చేయాలంటూ ఆదేశం..
ABN , Publish Date - Jul 02 , 2024 | 03:20 PM
చింతకాని మండలం పొద్దుటూరు (Podhuturu) గ్రామానికి చెందిన రైతు బొజెడ్ల ప్రభాకర్(Bojedla Prabhakar) ఆత్మహత్య ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి (Agriculture Minister) తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) తీవ్రంగా స్పందించారు. రైతు ఆత్మహత్యపై తక్షణమే విచారణ జరిపి నివేదిక అందజేయాలని రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు.
ఖమ్మం: చింతకాని మండలం పొద్దుటూరు(Podhuturu) గ్రామానికి చెందిన రైతు బొజెడ్ల ప్రభాకర్(Bojedla Prabhakar) ఆత్మహత్య ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి (Agriculture Minister) తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) తీవ్రంగా స్పందించారు. రైతు ఆత్మహత్యపై తక్షణమే విచారణ జరిపి నివేదిక అందజేయాలని రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు. పొద్దుటూరు గ్రామంలో ఇటీవల తన పొలం కొందరు వ్యక్తులు నాశనం చేశారంటూ బాధిత రైతు ప్రభాకర్ అధికారుల చుట్టూ తిరిగాడు. న్యాయం చేయాలంటూ నిందితులపై పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రైతు తన బాధ మెుత్తాన్ని సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పొలాన్ని ఏ విధంగా నాశనం చేశారు, అలాగే అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం చేయకపోవడం వంటి అంశాలను సెల్ఫీ వీడియోలో వివరించి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు.
రైతు ప్రభాకర్ ఆత్మహత్య విషయం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి వచ్చింది. రైతు సెల్ఫీ వీడియో చూసిన మంత్రి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల.. రైతు ఆత్మహత్యపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. విచారణ జరిపి తక్షణమే నివేదిక అందజేయాలని రెవెన్యూ, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులు పొలం పంచాయితీల కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో పొలం పంచాయితీలపై ప్రత్యేక దృష్టి పెడతామని, ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి లేదా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు న్యాయం జరుగుతుందని, క్షణికావేశం, తొందరపాటుతో ఏ రైతు కూడా ప్రాణాలు తీసుకోవద్దని కోరారు.