KTR: రాజకీయ కక్షసాధింపులో భాగంగానే.. కొండా సురేఖ దిగజారుడు వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 24 , 2024 | 03:50 AM
రాజకీయ కక్షసాధింపులో భాగంగా.. సమాజంలో తనకున్న పేరు ప్రతిష్ఠలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే మంత్రి కొండా సురేఖ తన గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
పబ్లిసిటీ కోసమే అవాస్తవ ఆరోపణలు.. వ్యక్తిగతంగా నాకు, పార్టీకి తీవ్ర నష్టం
ఆమె వ్యాఖ్యలు ఆవేదనకు గురిచేశాయి.. నాంపల్లి కోర్టులో కేటీఆర్ వాంగ్మూలం
తదుపరి విచారణ 30కి వాయిదా.. బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు
నేనూ నోటీసులతోనే బదులిస్తా.. కేటీఆర్ సుద్దపూసేమీ కాదు: బండి సంజయ్
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాజకీయ కక్షసాధింపులో భాగంగా.. సమాజంలో తనకున్న పేరు ప్రతిష్ఠలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే మంత్రి కొండా సురేఖ తన గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. పబ్లిసిటీ కోసమే ఆమె అవాస్తవ ఆరోపణలు చేశారని.. అవి వ్యక్తిగతంగా తనకు, తన పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయని ఆందోళన వెలిబుచ్చారు. ఈ నెల 10వ తేదీన నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో కొండా సురేఖపై వేసిన క్రిమినల్ పరువు నష్టం దావా కేసుకు సంబంధించి.. కేటీఆర్ బుధవారం కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ కూడా న్యాయస్థానానికి వచ్చారు.
తొలుత కేటీఆర్ సుమారు అరగంట పాటు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం దాసోజు స్టేట్‌మెంట్‌ను కోర్టు నమోదు చేసింది. మిగిలిన సాక్షుల వాంగ్మూలాలను 30వ తేదీన నమోదు చేస్తామని పేర్కొంటూ.. తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేసింది. గత 18 ఏళ్లగా రాజకీయ జీవితంలో ఉన్న తనపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆవేదనకు గురి చేశాయని కేటీఆర్ కోర్టులో వాపోయారు. ‘‘ఈ కేసులో సాక్షలుగా పేర్కొన్న వారు నాకు 18 ఏళ్లగా తెలుసు. సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల వారు నాకు ఫోను చేసి బాధపడ్డారు. ఆ తర్వాత నేనే వార్తా చానళ్లలో ఆమె వ్యాఖ్యలు చూసి షాక్‌కు గురయ్యా. నేను అమెరికాలో ఆరేళ్ల పాటు ఉన్నతవిద్య అభ్యసించా. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకు తిరిగి రాష్ట్రానికి వచ్చా. 2006 నుంచి 2009 మధ్య టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేశా. తెలంగాణ ఉద్యమంలో భాగంగా అనేక పోరాటాలు చేశా. 2009 నుంచి సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఐదుసార్లు భారీ మెజారిటీతో గెలిచా. 2014 నుంచి 2023 వరకూ మంత్రిగా పనిచేశా.
ఐటీశాఖ మంత్రిగా రాష్ట్రానికి ఎన్నో కంపెనీలను తీసుకొచ్చా. 2018లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్‌గా ఎన్నికయ్యా. బ్యాడ్మింటన్‌తో పాటు వివిధ క్రీడా సంఘాలతో కలిసి పనిచేశా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నా. ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు కలిగి ఉన్న నాపై ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి కొండా సురేఖ అసత్య ఆరోపణలు చేశారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా ఆమె చేసిన అవాస్తవ వ్యాఖ్యలు సమాజంపై చెడు ప్రభావం చూపుతాయి. నా పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసే విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అనేక మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి’’ అని కేటీఆర్ చెప్పారు. ‘‘నేను ఫోన్ ట్యాపింగ్ చేశానని, డ్రగ్స్ తీసుకుంటానని, ఇతరులను డ్రగ్స్ తీసుకునేలా ప్రేరేపించానని, డ్రగ్స్ అలవాటు చేశానని సురేఖ నిరాధార ఆరోపణలు చేశారు. ‘ఎన్’ కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే సమంతను నా దగ్గరు పంపించాలని నేను అడిగానని, అందువల్లే నాగచైతన్య-సమంతకు విడాకులు తీసుకున్నారని సురేఖ అసత్య వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన మరిన్ని వ్యాఖ్యలను నా నోటితో చెప్పలేకపోతున్నా. వాటిని లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌లో పొందుపొర్చా’’ అని కేటీఆర్ వివరించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కేటీఆర్ కోరారు.
అయినా మారలేదు..
గతంలోనూ తనపై కొండా సురేఖ కొన్ని అసత్య వ్యాఖ్యలు చేశారని, అప్పుడు ఆమె తీరుపై ఎన్నికల సంఘం కూడా మండిపడిందని.. కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం కేటీఆర్ గుర్తుచేశారు. ‘‘అయినా ఆమె వ్యవహారశైలిలో మార్పు రాలేదు. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకునేది లేదు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’’ అని తేల్చిచెప్పారు. కాగా.. వాంగ్మూలం ఇచ్చేందుకు వచ్చిన కేటీఆర్ కోర్టు ప్రాంగణంలోని క్యాంటీన్‌కు వెళ్లి ఇరానీచాయ్, ఉస్మానియా బిస్కెట్ల రుచి చూశారు. అనంతరం నాంపల్లిలోని పలు దుకాణాలకు వెళ్లి యజమానులు, కొనుగోలుదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నారు.
మధ్యంతర ఉత్తర్వులు..
కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన రూ.100 కోట్ల సివిల్ పరువు నష్టం దావాకు సంబంధించి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయంపై ఆమె బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయకుండా కోర్టు మధ్యంతర ఇన్‌జంక్షన్ ఆర్డర్ ఇచ్చి.. తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసిందని కేటీఆర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. మరోవైపు.. మంత్రి సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున దాఖలుచేసిన క్రిమినల్ పరువు నష్టం దావా విచారణ కూడా 30వ తేదీకి వాయిదా పడింది. బుధవారం నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో ఈ దావాపై విచారణ జరిగింది. ఈ కేసులో సమన్లు అందుకున్న కొండా సురేఖ తన తరఫున న్యాయవాది గుర్మీత్ సింగ్‌ను వకాలత్‌గా పెట్టుకున్నారు. అనివార్య కారణాల వల్ల మంత్రి సురేఖ హాజరు కాలేకపోతున్నారని గుర్మీత్ సింగ్ కోర్టుకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ ఇచ్చేందుకు సమయం కోరినట్టుగా తెలుస్తోంది.
బండికి కేటీఆర్ లీగల్ నోటీసులు
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి బండి సంజయ్ ఈనెల 19న తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోని బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బుధవారం ఈ మేరకు సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాత్ర ఉందని, వివిధ కేసుల నుంచి తప్పించుకునేందుకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని గోప్యంగా కేటీఆర్ కలిశారని బండి సంజయ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వాటికి ఆధారాలు చూపించాలని.. లేదా ఆ నిరాధార వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేదంటే క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తామని కేటీఆర్ తరఫు న్యాయవాదులు నోటీసుల్లో పేర్కొన్నారు.