హరహర మహాదేవ
ABN , Publish Date - Mar 08 , 2024 | 11:29 PM
హరహర మహాదేవ.. శంభో శంకర అంటూ భక్తుల శివనామ స్మరణంతో ఆలయాలు మారుమోగాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని శుక్రవారం జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.

- భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి
- ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు
- ఈశ్వరుడికి అభిషేకాలు, అర్చనలు
- శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు
గద్వాల టౌన్, మార్చి 8 : హరహర మహాదేవ.. శంభో శంకర అంటూ భక్తుల శివనామ స్మరణంతో ఆలయాలు మారుమోగాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని శుక్రవారం జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా శైవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజామునే అర్చకులు స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా గద్వాల పట్టణ సమీపంలోని కృష్ణానదికి తెల్లవారుజామునే భక్తుల రాక ప్రారంభమైంది. నదిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు శివాలయాల్లో స్వామికి అభిషేకాలు చేశారు. బురదపేట శివాలయంలో మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, కళావతి దంపతులు మహారుద్రుడికి పంచామృతాభిషేకం చేశారు. వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలోని నగరేశ్వరుడికి ఆర్యవైశ్యులు సామూహిక అభిషేకాలు నిర్వహించారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో భక్తులు ఉదయం, సాయంత్రం పరిమళ భస్మ, జలాభిషేకం చేశారు. భక్త మార్కండేయ, పాండురంగ శివాలయాల్లో ఈశ్వరుడికి అభిషేకం చేశారు. రెండవ రైల్వేగేటు వద్ద నున్న నందీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలుగుపేట, నల్లకుంట శివాలయాల్లో మహాదేవుడికి క్షీరాభిషేకం నిర్వహించారు. భీమలింగేశ్వర ఆలయంలో మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. సుంకులమ్మమెట్టు శివాలయంలో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం నాలు గు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అభిషేకాలు కొనసాగించారు. పాత హౌసింగ్ బోర్డు కాలనీ లోని అన్న పూర్ణ ఆలయంలో రుద్రహోమం నిర్వహించారు. అన్న పూర్ణాదేవిని ప్రత్యేకంగా అలంకరించి మహిళలు కుంకు మార్చన చేశారు. అశోక్‌నగర్ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శివుడికి పంచామృత అభిషేకం, 108 రుద్రాక్ష లతో అర్చన, పుష్పార్చన నిర్వహించారు. తెలుగు పేట శివాలయంలో రాత్రి ఉమామహేశ్వరుల కల్యాణం నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో మహాశివుడికి అభిషేకా లు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
గట్టు : మండల పరిధిలోని చాగదోణ, చిన్నోనిపల్లి గ్రామాల్లోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చన నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. చిన్నోనిపల్లికి చెందిన శివస్వాములు ఇరుముడి ధరించి శ్రీశైలానికి బయలుదేరి వెళ్లారు.
వైభవంగా అడివేశ్వర స్వామి కల్యాణోత్సవం
రాజోలి : మండల కేంద్రంలో భ్రమరాంబికా సమేత అడివేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామికి మంగళవాయిద్యాలతో బిందెసేవ నిర్వహించి, తుంగభద్ర నది నుంచి పవిత్ర జలాన్ని తీసుకొచ్చి అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మ వార్ల ఉత్సవ విగ్రహాలను వేదికపై ఉంచి అర్చకుడు అడివిస్వామి ఆధ్వర్యంలో కల్యాణోత్సవం జరిపించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, ఉపసర్పంచు గోపాల్, మాజీ సర్పంచు మోచి హుసేన్, జయరెడ్డి, సాంబశివరావు పాల్గొన్నారు.
- రాజోలి మండల కేంద్ర సమీపంలోని తుంగభద్ర నది మధ్యలో కొలువుదీరిన రామేశ్వరస్వామి ఆలయంలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి అభిషేకం చేశారు. రాజోలిలోని వైకుంఠ నారాయణస్వామి ఆలయంలో మట్టితో తయారు చేసిన 5,108 శివలింగాలకు రాత్రి 8.00 గంటలకు మహిళలు పూజలు చేసి, కోటి దీపోత్సవం నిర్వహించారు.
ఉండవల్లి : మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి, ఉమా మహేశ్వరస్వామి, తక్కశిల ఉమా రామ లింగేశ్వరస్వామి ఆలయం, భవాని శంకర ఆలయం, ప్రాగటూర్ శివాలయం, మారమునగాల 1,2 గ్రామాల్లోని శివాలయాల్లో ఉదయం ఆలయాలలో బిల్వార్చన, పంచా మృతాభిషేకం నిర్వహించారు. ఉండవల్లి అయ్యప్పస్వామి ఆలయ సముదాయంలోని ఉమామహేశ్వరస్వామి గుడి లో పంచామృతాభిషేకం చేశారు. లింగోద్భవ అభిషేకం చేసి, జ్వాలాతోరణాన్ని వెలి గించారు.
ఇటిక్యాల : మండల కేంద్రంలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
ఎర్రవల్లి : మండలంలోని బీచుపల్లి క్షేత్రంలోని శివాల యంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి ఈశ్వరుడిని దర్శించు కొని మొక్కులు తీర్చుకున్నారు.
భక్తిశ్రద్ధలతో శివపార్వతుల కల్యాణం
కేటీదొడ్డి : మండల కేంద్రంలోని శివాలయంలో శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చన చేశారు. అనంతరం అలంకరించిన మండపంలో ఉత్సవమూర్తులను ఉంచి అర్చకులు శాస్ర్తోక్తంగా కల్యాణ వేడుకను జరిపించారు.
మల్దకల్ : మండల కేంద్రంలోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యశ్చంద్రారెడ్డి రుద్రాభిషేకం చేశారు. కార్యక్రమంలో రమేషాచారి, రవి, నాగరాజు పాల్గొన్నారు.
అయిజ : పట్టణంలోని గుంతరామేశ్వరాలయం, శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. మండల పరిధిలోని పులికల్ గ్రామంలో శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు తుంగభద్ర వద్ద నదీజలాలతో అభిషేకం చేశారు. అనంతరం పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి, గట్టు మీదున్న శివాలయానికి చేర్చారు.
కుంభాభిషేకానికి హాజరైన ప్రముఖులు
అలంపూర్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఐదవ శక్తిపీఠం అలంపూర్‌లో శుక్రవారం నిర్వహించిన మహాకుంభాభిషేకానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కలెక్టర్ బీఎం సంతోష్ దంపతులు కుంభాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జడ్పీ చైర్‌పర్సన్ సరిత, అదనపు కలెక్టర్ శ్రీనివాసులు, అలంపూర్ సివిల్‌కోర్టు న్యాయాధికారి కమలాపురం కవిత దంపతులు, తహశీల్దార్ మంజుల వేడుకలకు హాజరయ్యారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రమేష్ గుప్తా ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. వివేకానంద సేవాసంఘం అధ్యక్షుడు రజనీ బాబు ఆధ్వర్యంలో గుగ్గిళ్లు, మంచినీరు, పండ్లు అందించే కేంద్రాలను ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించి భక్తులకు అందజేశారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు, ఈవో పురందర్‌కుమార్, ప్రధాన అర్చకుడు ఆనంద్‌శర్మ వారికి సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో వెంకట రామయ్యశెట్టి, బాలస్వామి, రాజు, సంజీవనాయుడు, రంగ, ప్రశాంత్ పాల్గొన్నారు.