ఈత... కారాదు గుండె కోత!
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:34 PM
ఎండలు ముదురుతున్నాయి. వేసవిలో ఉక్కపోతకు చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతీ ఏడాది మార్చిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయి.

- సరదాగా ఈతకు వెళ్లి బాలబాలికల మృత్యువాత
- కాపాడే క్రమంలోనో ప్రాణాలు కోల్పోతున్న పెద్దలు
- ప్రతీ ఏడాది వేసవిలో జరుగుతున్న సంఘటనలు
- పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఆవసరం
అయిజ టౌన్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి) : ఎండలు ముదురుతున్నాయి. వేసవిలో ఉక్కపోతకు చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతీ ఏడాది మార్చిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయి. ఉదయం బడికి పోయి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తరువాత బడులకు సెలవులు కావటంతో విద్యార్థులు ఒకరికి ఒకరు కలిసి చెరువులు, కుంటలు, నదులు, బావులు, కాలువల్లోకి సరదాగా ఈతకు వెళ్తుంటారు. ఈత రాని వారు నేర్చుకునేందుకు వారి వెంట వెళ్తుంటారు. ఈ క్రమంలో ఈత సరిగా రాకనో, ఇతర కారణాల వల్లనో కొందరు నీటిలో మునిగి చనిపోతున్నారు. వారిని కాపాడే క్రమంలో కొందరు పెద్దలు కూడా నీట మునిగి చనిపోయిన సంఘటనలున్నాయి. తాజాగా బుధవారం రాజోళి మండలంలోని సుంకేసుల వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు సులేమాన్ (47), ఆయన ఇద్దరు కొడుకులు ఫర్షాన్ (11), పైజాన్ (9) లు మృతి చెందారు. ప్రతీ ఏడాది వేసవిలో ఇటువంటి సంఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి.
గతంలో జరిగిన కొన్ని సంఘటనలు
ఫ 2022, మే 4వ తేదీన అయిజ మండలం, రాజాపురం గ్రామానికి చెందిన ఏడవ తరగతి చదివే గాయత్రి అనే బాలిక బంధువుల పెళ్లికి వెళ్లింది. సరదాగా తుంగభద్ర నదికి ఈతకు వెళ్లి ప్రమాదవ శాత్తు నీట మునిగి మరణించింది.
ఫ గత ఏడాది మార్చి 16వ తేదీన అయిజ మండలం, ముగోనిపల్లి గ్రామానికి చెందిన నరేశ్ అనే ఆరవ తరగతి చదివే విద్యార్థి బావిలో ఈతకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు.
ఫ మార్చి 21వ, తేదీన మల్దకల్ మండలం, ఉలిగెపల్లి గ్రామానికి చెందిన 12 ఏళ్ల వీరేంద్ర అనే బాలుడు స్నేహితులతో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు.
ఫ మార్చి 23వ, తేదీన అయిజ మండలం, చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన ఇంటర్ చదివే భూపతిగౌడు అనే విద్యార్థి బావిలో ఈతకు వెళ్లి మరణించాడు.
ఫ ఏప్రిల్ 2వ, తేదీన ధరూరు మండలం, గార్లపాడుకు చెందిన 11 ఏళ్ల మమత అనే బాలిక ఈతకు వెళ్లి బావిలో మునిగి ప్రమాదవశాత్తు మరణించింది.
ఫ ఏప్రిల్ 10వ తేదీన దేవరకద్ర మండలానికి చెందిన శివకుమార్, గణేశ్ అనే యువకులు ఈత కోసం బావిలోకి దిగి ఈత రాకపోవటంతో నీట మునిగి చనిపోయారు.
ఫ మే 4వ, తేదీన గద్వాల జిల్లా కేంద్రలోని లింగంబావిలోకి ఈతకు వెళ్లిన రంగస్వామి ప్రమాదవశాత్తు మృతి చెందాడు.
ఫ మే 16వ, తేదీన అమ్రబాద్ మండలానికి చెందిన రిషి కుమార్ అనే గురుకుల విద్యార్థి నీటికుంటలో పడి మృతి చెందగా, మాడ్గులకు చెందిన కుమార్ అనే యువకుడు బావిలోకి ఈతకు వెళ్లి చనిపోయాడు.
ఫ 2మే 24వ, తేదీన నవాబుపేట మండలానికి చెందిన ఆంజనేయులు అనే యువకుడు చెరువులో ఈత కొడుతూ నీట మునిగిపోయాడు.
పిల్లలను కనిపెడుతూ ఉండాలి
వేసవి కాలంలోని ఏప్రిల్, మే నెలలు చిన్న పిల్లలకు చాలా కీలకం. ఈ రెండు నెలలు విద్యా సంస్థలకు ఒంటిపూట బడులు, సెలవులు ఉండటంతో పిల్లలను అనునిత్యం ఒక కంట కనిపెడుతూ ఉండాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ప్రధానంగా పిల్లలు ఈత నేర్చుకునేందుకు తప్పనిసరిగా ఈత వచ్చిన పెద్దలను వెంటే వెళ్లాలి. ఒంటరిగా, స్నేహితులతో కలిసి వెళ్లడం ప్రమాదకరం. పెద్దలు అప్రమత్తంగా లేకపోతే అనుకోని ప్రమాదాలు జరిగి విషాదాలు సంభవించే ప్రమాదం ఉంది.
తప్పనిసరిగా ఈత నేర్పించాలి
లక్ష్మీనారాయణ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, గద్వాల : బాల, బాలికలకు 15 సంవత్సరాలు వచ్చే సరికి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈత నేర్పించాలి. ప్రస్తుతం వందలో 90 మంది పిల్లలకు ఈత రావడం లేదు. చిన్నప్పుడు కుటుంబ పెద్దలు మాకు బావికి, లేదా నదికి తీసుకెళ్లి ఈత నేర్పించేవారు. కానీ ప్రస్తుతం తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈత నేర్పించడం లేదు. దీంతో అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు.
పిల్లలపై పర్యవేక్షణ ఉండాలి
శ్రీనివాసరావు, ఎస్సై, అయిజ : ఒంటిపూడ బడులు, వేసవి సెలవుల్లో తల్లిదండ్రులకు పిల్లలపై పర్యవేక్షణ ఉండాలి. బడుల నుండి వచ్చిన తరువాత వారు ఎక్కడికి వెళ్తున్నదీ కచ్చితంగా గమనిస్తూ ఉండాలి. అవసరమైతే ఇంటివద్దే ట్యూషన్ లాంటివి పెట్టించాలి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల పిల్లలు వారి తల్లిదండ్రులు ఇళ్ల వద్ద ఉండకపోవడంతో, మధ్యాహ్నం వేళల్లో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.