భరోసా లక్ష్యాన్ని సమర్థంగా నిర్వహించాలి
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:36 PM
వేధింపులు, అత్యాచారం నిరాదరణకు గురైన బాధిత మహిళలకు భరోసా కేంద్రం ద్వారా పలుసేవలు సత్వరమే అందించాలని, అలాగే వేధింపులకు గురైన బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు అధికారులకు సూచించారు.

సమన్వయ సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల క్రైం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): వేధింపులు, అత్యాచారం నిరాదరణకు గురైన బాధిత మహిళలకు భరోసా కేంద్రం ద్వారా పలుసేవలు సత్వరమే అందించాలని, అలాగే వేధింపులకు గురైన బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలో సేవలు అందిస్తున్న భరోసా సెంటర్ విధి విధానాలు, లక్ష్యాలు, ఉద్దేశం అంశాలపై జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పోలీస్, భరోసా సెంటర్, అనుబంధ లైన్ అధికారులు, ఎన్‌జీవోలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అత్యాచారం, బాలలపై లైంగిక వేధింపులు, దాడులు వంటి కేసులు నమోదైనప్పుడు బాధితులకు భరోసా సెంటర్‌కు వెంటనే పంపించి స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని, ప్రతీ కేసుకు, ఫిర్యాదుకు ఆన్‌లైన్ నంబర్ ఇవ్వాలన్నారు. మెడికల్, న్యాయసలహా, వైద్యం, కౌన్సెలింగ్, సైకలాజికల్ సపోర్టు అన్ని సౌకర్యాలు ఒకేచోట బాధితులకు కల్పించడంతో పాటు కేసు ముగిసేవరకు సపోర్ట్ పర్సన్, లీగల్ అడ్వైజర్ అందుబాటులో ఉండాలన్నారు. భరోసా సెంటర్ ఆధ్వర్యంలో ఎలోప్మెంట్ కేసులు జరుగకుండా, వాటి వల్ల జరిగే నష్టాలపై ముందుగానే ప్రజలకు, పిల్లల తల్లిదండ్రులకు, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, గద్వాల, అలంపూర్, శాంతినగర్ సీఐలు టి. శ్రీను, రవిబాబు, టాటాబాబు, ఏపీపీ రేచల్ సంజనా జాషువా, జిల్లా సంక్షేమాధికారి సునంద, బరోసా ఇంచార్జి ఎస్‌ఐ స్వాతి, సీడబ్ల్యూసీ మెంబర్ శైలజ, డీపీపిఓ నరసింహ, ఆర్‌ఎంవో వృశాలి, తదితరులు ఉన్నారు.