Share News

Ponnam: సున్నాకే పరిమితమైనా బుద్ధి మారలేదు

ABN , Publish Date - Oct 10 , 2024 | 04:39 AM

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు సున్నాకే పరిమితం చేసినా.. ఆ పార్టీ నేతల బుద్ధి మారలేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ధ్వజమెత్తారు.

Ponnam: సున్నాకే పరిమితమైనా బుద్ధి మారలేదు

  • బీఆర్‌ఎస్‌ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ధ్వజం

  • ప్రతిపక్షంగా మంచి సూచనలు ఇవ్వాలని హితవు

  • గాంధీభవన్‌లో ‘మంత్రితో ముఖాముఖి’కి హాజరు

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు సున్నాకే పరిమితం చేసినా.. ఆ పార్టీ నేతల బుద్ధి మారలేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వానికి మంచి సూ చనలు, సలహాలు ఇవ్వాలని హితవు పలికారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని కేటీఆర్‌ను నిలదీశారు. గాంధీభవన్‌లో ‘మంత్రితో ముఖాముఖి’లో భాగంగా బుధవారం పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఫిర్యాదులు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందంటూ కొంత మంది ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇకనైనా వారు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.


కాంగ్రెస్‌ పది నెలల పాలనపై చర్చకు సిద్దమంటున్న జగదీశ్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలని సవాల్‌ విసిరారు. బీజేపీ తానా అంటే బీఆర్‌ఎస్‌ తందానా అన్నట్టుగా వ్యవహరిస్తోందన్నారు. ఎవరెన్ని సెటైర్లు వేసినా ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. ‘మంత్రితో ముఖాముఖి’లో ఇందిరమ్మ ఇళ్లు త్వరగా ఇవ్వాలని, ఉద్యోగ నియామకాలను వేగవంతం చేయాలని విజ్ఞప్తులు అందాయన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాదిరిగా తాము చెప్పిందే వినాలని కాకుం డా.. ప్రజలందరి అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో 179 మంది వినతి పత్రాలు అందజేశారు. పలు విజ్ఞప్తులపై జిల్లాల అధికారులకు ఫోన్‌ చేసిన మంత్రి.. సదరు సమస్య పరిష్కరించాలని సూచించారు. కాగా, దసరా నేపథ్యంలో శుక్రవారం జరగాల్సిన ‘మంత్రితో ముఖాముఖి’ రద్దయింది. మళ్లీ బుధవారం ఈ కార్యక్రమం ఉంటుందని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Oct 10 , 2024 | 04:39 AM