Share News

మాకూ టైం వస్తది వడ్డీతో సహా చెల్లిస్తాం: కవిత

ABN , Publish Date - Aug 28 , 2024 | 04:43 AM

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆమె తిహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం భావోద్వేగానికి గురైన కవిత.. ‘మాకూ టైం వస్తది.

మాకూ టైం వస్తది వడ్డీతో సహా చెల్లిస్తాం: కవిత
kavitha

  • నేను కేసీఆర్‌ బిడ్డను..

  • తప్పు చేసే ప్రసక్తే లేదు: ఎమ్మెల్సీ కవిత

న్యూఢిల్లీ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆమె తిహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం భావోద్వేగానికి గురైన కవిత.. ‘మాకూ టైం వస్తది. మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం’ అని హెచ్చరించారు. కవిత బెయిల్‌ వచ్చిన నేపథ్యంలో కవిత భర్త అనిల్‌, కుమారుడు ఆర్య, సోదరుడు కేటీఆర్‌ తోపాటు హరీశ్‌రావు తదితరులు జైలు వద్దకు చేరుకున్నారు. వైద్య పరీక్షలతోపాటు జైలు నిబంధనలన్నీ పూర్తయిన తర్వాత రాత్రి 9.10 గంటలకు జైలు నుంచి కవిత బయటికొచ్చారు.

సోదరుడు కేటీఆర్‌ను ఆమె ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కేటీఆర్‌ తన చెల్లి నుదుటిపై ముద్దు పెట్టారు. అనంతరం ఆమె తన భర్త అనిల్‌, కుమారుడు ఆర్యను కౌగిలించుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలందరికీ అభివాదం చేశారు. జై తెలంగాణ, జైజై తెలంగాణ.. అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావిస్తున్న క్రమంలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు.


‘‘అందరికీ నమస్కారం. ఐదున్నర నెలల తర్వాత అందరినీ కలవడం సంతోషం. 18 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా. ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. కానీ, వ్యక్తిగతంగా నా కుటుంబాన్ని, పిల్లలను వదిలి ఐదున్నర నెలలు ఉండడం ఇదే తొలిసారి. ఇలాంటి ఇబ్బందులు పెట్టిన వారందరికీ తప్పకుండా వడ్డీతో కలిపి చెల్లిస్తాం. మాకూ టైం వస్తది. కష్టకాలంలో మా కుటుంబానికి అండగా ఉన్న అందరికీ పాదాభివందనాలు. నేను తెలంగాణ బిడ్డను. కేసీఆర్‌ బిడ్డను.

తప్పుచేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని. చట్టబద్ధంగా నా పోరాటం కొనసాగిస్తా.’’ అని కవిత చెప్పారు. కవిత జైలు నుంచి నేరుగా వసంత్‌ విహార్‌లోని బీఆర్‌ఎస్‌ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ మహిళా కార్యకర్తలు ఆమెకు దిష్టి తీసి స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. కవిత కుటుంబ సభ్యులతో కలిసి రాత్రికి బీఆర్‌ఎస్‌ కార్యాలయంలోనే బస చేయనున్నట్లు ముఖ్య నేత ఒకరు తెలిపారు. బుధవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో కవితతోపాటు మరో నలుగురిపై సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌పై విచారణ జరగనుంది. దానికి ఆమె వర్చువల్‌గా హాజరవుతారు. మధ్యాహ్నం కవిత, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు హైదరాబాద్‌కు బయల్దేరతారు.

అనిల్‌, వద్దిరాజు పూచీకత్తు..

కవితకు సుప్రీంకోర్టు సీబీఐ కేసులో రూ.10 లక్షలు, ఈడీ కేసులో రూ.10 లక్షల చొప్పున పూచీకత్తుతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మొత్తాలను కవిత భర్త అనిల్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చెల్లించారు. రౌస్‌ అవెన్యూ కోర్టులో పూచీకత్తు సొమ్మును జమ చేశారు. అనంతరం కోర్టు 4.20 గంటలకు కవిత రిలీజ్‌ వారెంట్‌ జారీచేసింది. ఆ కాపీని అనిల్‌, వద్దిరాజులు తిహాడ్‌ జైలు సిబ్బందికి అందజేశారు.

Updated Date - Aug 28 , 2024 | 07:59 AM