ఇందూరు ఏ దరికో!?
ABN , Publish Date - Apr 24 , 2024 | 05:01 AM
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఈసారి హోరాహోరీ సమరం సాగుతోంది. మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులూ అనేక ఎన్నికల ఆరితేరిన ఉద్ధండులే! వీరిలో ఒకరు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న

మూడు పార్టీల మధ్య హోరాహోరీ.. ముగ్గురు ఉద్ధండుల మధ్య రసవత్తర పోరు
మళ్లీ గెలిచి సత్తా చూపాలని అరవింద్
పార్లమెంటులో కాలు మోపాలని జీవన్ రెడ్డి, గోవర్ధన్
లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ
ఎన్నికల్లో ఏ పార్టీకీ లభించని మెజారిటీ
ప్రతిసారీ విలక్షణ తీర్పునిచ్చే ఓటర్ల మొగ్గు ఎవరికో!?
రైతులు, మహిళలు, బీడీ, గల్ఫ్ కార్మికులే కీలకం
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికీ పూర్తి మెజారిటీ ఇవ్వలేదు! ఇక్కడి ఏడు సెగ్మెంట్లలో మూడింట బీఆర్‌ఎస్ గెలిస్తే.. కాంగ్రెస్, బీజేపీ రెండేసి చొప్పున పంచుకున్నాయి! పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పుడు మూడు పార్టీలూ హోరాహోరీ తలపడుతున్నాయి! ప్రతిసారీ విలక్షణ తీర్పునిచ్చే ఇందూరు ఓటర్లు ఈసారి ఎవరిని ఆదరిస్తారో!?
నిజామాబాద్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఈసారి హోరాహోరీ సమరం సాగుతోంది. మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులూ అనేక ఎన్నికల ఆరితేరిన ఉద్ధండులే! వీరిలో ఒకరు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగానూ కొనసాగుతున్నారు. ఇక, పోలీస్ పటేల్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా 40 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. సర్పంచ్ నుంచి ఆర్టీసీ చైర్మన్ వరకు పదవులను చేపట్టడమే కాదు.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగానూ పని చేశారు. ఇక, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సిటింగ్ ఎంపీ! సుదీర్ఘ రాజకీయ అనుభవంతోపాటు రెండు దఫాలు పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పని చేసిన డీఎస్ తనయుడు! ముగ్గురూ ఉద్ధండులే కావడంతో ఇక్కడ ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. ముగ్గురికీ రాజకీయ పరపతి ఉండడం, ఆయా సామాజిక వర్గాల మద్దతు ఉండడంతో పోటీ రసవత్తరంగా సాగుతోంది.
గల్ఫ్, బీడీ కార్మికులు కీలకం
నియోజకవర్గంలో రైతుల తర్వాత గల్ఫ్, బీడీ కార్మిక కుటుంబాలు ఎక్కువ. పార్లమెంట్ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో వీరు ఉన్నారు. ఉపాధి కోసం భర్తలు గల్ఫ్ దేశాలకు వెళ్లగా.. భార్యలు బీడీలపై ఆధారపడి పని చేస్తున్నారు. బీడీ, గల్ఫ్ కుటుంబాల ఓటర్లు ఐదున్నర లక్షల వరకూ ఉంటారు. వీరు తీసుకునే నిర్ణయం ఎన్నికల్లో కీలకం కానుంది. అందుకే, అన్ని పార్టీలూ వారిని ఆకర్షించేందుకు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పది రోజుల క్రితం గల్ఫ్ సంఘాలతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. వారికిచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత బోర్డు ఏర్పాటు చేయడంతోపాటు పునరావాసం కల్పిస్తామని, గల్ఫ్‌లో చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని తెలిపారు. ఇక, పదేళ్లలో వారికి తమ సర్కారు చేసిన సంక్షేమ కార్యక్రమాలే తమకు ఓట్లు కురిపిస్తాయని బీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా వారి మద్దతు తమకేనని బీజేపీ అంచనా వేసుకుంటోంది. అలాగే, నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మైనారిటీ ఓటర్లూ కీలకమే. ఇక్కడి పట్టణ ప్రాంతాల్లో మూడు లక్షల వరకూ మైనారిటీ ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని కాంగ్రెస్ భావిస్తుండగా.. సగానికి సగం ఓట్లు తమకూ వస్తాయని బీఆర్‌ఎస్ నేతలు అంచనా వేసుకుంటున్నారు. వారి ఓట్ల చీలిక తమకు లాభిస్తుందనే ఆశల పల్లకిలో బీజేపీ ఉంది. అలాగే, నియోజకవర్గంలో మున్నూరు కాపు, పద్మశాలి సామాజికవర్గ ఓటర్లు కూడా ఎక్కువే. బరిలో ఉన్న సిటింగ్ ఎంపీ అర్వింద్, బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఇద్దరూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారే. గత ఎన్నికల్లో వీరి ఓట్లు గంపగుత్తగా అర్వింద్‌కు పడగా.. ఈదఫా ఇద్దరూ చీల్చుకునే అవకాశం ఉంది. పద్మశాలి ఓట్లన్నీ తమకే పడతాయని బీజేపీ అంచనా వేసుకుంటోంది. ఇక, ప్రతి ఎన్నికలో ఇక్కడ నిజాంషుగర్ ఫ్యాక్టరీ ఎజెండాగా మారుతోంది. ఈ ఎన్నికలో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే సెప్టెంబరు 17 నాటికి ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్ రెడ్డితో సహా నేతలు హామీలు ఇస్తున్నారు. చెరుకు రైతుల మద్దతును కూడగట్టే ప్రయత్నాలను చేస్తున్నారు. తనను గెలిపించగానే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఫ్యాక్టరీని తెరిపించేందుకు చర్యలు తీసుకుంటానని బీజేపీ అభ్యర్థి అర్వింద్‌తోపాటు పార్టీ నేతలు హామీలు ఇస్తున్నారు. రైతులను మోసం చేసేందుకే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఈ ప్రకటనలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగగా.. 11 సార్లు కాంగ్రెస్, మూడు దఫాలు టీడీపీ, ఒక్కోసారి బీఆర్‌ఎస్, బీజేపీ, స్వతంత్య్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈసారి ఇందూరు ఎవరిని ఆదరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
గ్రామీణ ప్రాంతాలే అధికం
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గ్రామీణ ప్రాంతాలే ఎక్కువ. ఇక్కడ నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలోనే నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. రైతులు, బీడీ కార్మికులు, గల్ఫ్ కార్మికులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం ప్రతిసారీ విలక్షణ తీర్పునే ఇస్తోంది. రైతులే ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారు ఎటు మొగ్గితే వారే విజయాన్ని సాధిస్తున్నారు. అర్బన్ నియోజకవర్గం మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో రైతులే అత్యధికంగా ఉన్నారు. ప్రధానంగా వరి, చెరుకు, పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్నలు పండిస్తారు. ప్రతీ ఎన్నికలో రైతులు తీసుకునే నిర్ణయాలే అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్ణయిస్తున్నాయి. గత ఎన్నికల సరళిని పరిశీలిస్తే.. ఎర్రజొన్న రైతుల ఆందోళన తర్వాత వచ్చిన ప్రత్యేక రాష్ట్రంలోని పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కవితను గెలిపించారు. అప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన మధుయాష్కీ గౌడ్‌ను ఓడించారు. ఎంపీ హోదాలో కవిత ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, పసుపు బోర్డు తీసుకురాకపోవడంతో రైతులే 2019లో పోటీగా నామినేషన్లు వేశారు. పార్లమెంట్ చరిత్రలోనే ఏకంగా 186 మంది పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్న కవితను ఓడించడంతోపాటు పసుపు బోర్డు తీసుకు వస్తామన్న బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు పట్టం కట్టారు. ఐదేళ్ల తర్వాత పసుపు బోర్డు ప్రకటించి జీవో జారీ చేసినా.. దానిని ఎక్కడ పెడతారో ఇంకా స్పష్టం చేయకపోవడంతో ఈసారి వారు తీసుకునే నిర్ణయమే కీలకంగా మారనుంది.