Hyderabad: నీట్ వ్యవహారంపై ప్రధాని, కేంద్ర మంత్రులు స్పందించాలి..
ABN, Publish Date - Jun 17 , 2024 | 03:24 AM
నీట్ పరీక్ష వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు తక్షణం స్పందించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
విద్యార్థులకు నష్టం జరిగితే పోరాటం చేస్తాం.. రాష్ట్ర ఎంపీలు చొరవ తీసుకోవాలి: కేటీఆర్
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): నీట్ పరీక్ష వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు తక్షణం స్పందించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. లక్షల మంది విద్యార్థులు ఎన్ని ఫిర్యాదులు చేసినా కేంద్రం స్పందించలేదని, పలువురు ప్రముఖులు సుప్రీంకోర్టులో కేసు వేసినా వివరణ ఇవ్వలేదన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చిత్రమైన సమాధానాలు చెప్పిందన్నారు. ఈ ఏడాది 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు చెబుతోందని, అసలు నీట్ లాంటి పరీక్షలకు గ్రేస్ మార్కులు కలిపే విధానమేలేదని, అయినప్పటికీ ఎందుకిలా చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం నీట్ మాత్రమే కాదు.. దేశంలో ఎన్నో పోటీ పరీక్షలు ఎన్టీఏ ఆధ్వర్యంలోనే నిర్వహించాల్సి ఉంటుందని, తాజా వివాదాస్పద అంశాల కారణంగా ఎన్టీఏపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలుచేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నీట్‌లో అక్రమాల కారణంగా కష్టపడి చదివిన తెలంగాణ విద్యార్థులకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోమని, వారి తరఫున బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని వెల్లడించారు. ప్రతిసారి పరీక్షాపే చర్చ కార్యక్రమాన్ని చేపట్టే మోదీ.. నీట్‌పై పలు ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నా.. దానిపై మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠినచర్యలు చేపట్టి లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేంద్రం భరోసా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నడూలేని విధంగా నీట్‌లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం పలు అనుమానాలకు తావిస్తోందని, ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు 720 మార్కులు సాధించడం చూస్తే.. పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు.
ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయని, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారని గుర్తుచేశారు. అలాంటిది.. ఒకే సెంటర్‌లో ఇంతమంది విద్యార్థులకు పెద్దమొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. అలాగే ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాలరోజే ప్రకటించడం అనేక సందేహాలకు తావిస్తోందన్నారు. నీట్‌లో గ్రేస్ మార్కుల అంశమే కాకుండా ప్రశ్నపత్రం లీకైనట్లు వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు మన రాష్ట్ర ఎంపీలు చర్యలు చేపట్టాలని కోరారు.
6 నెలల్లో శాంతి భద్రతలు అస్తవ్యస్థం..
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చిన ఆరు నెలల్లోనే శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా కొనసాగిన తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఎలాంటి మత కలహాలు జరగలేదని గుర్తు చేశారు. మెదక్‌లో జంతువధ విషయంలో జరిగిన గొడవకు సంబంధించిన ఓ వీడియోను ఈ సందర్భంగా ఆయన షేర్ చేశారు.
Updated Date - Jun 17 , 2024 | 03:24 AM