Share News

Amit Shah: ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:22 AM

మూడోసారి అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా చెప్పారు. ముస్లింలకు తొలగించి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ

Amit Shah: ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం
Amit Shah

  • మూడోసారి అధికారంలోకి రాగానే వాటిని తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తాం

  • తెలంగాణలో అవినీతి లేకుండా చేస్తాం

  • ఇక్కడ 12 సీట్లు గెల్చుకుంటాం:అమిత్‌ షా

సిద్దిపేట/నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): మూడోసారి అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా చెప్పారు. ముస్లింలకు తొలగించి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. గురువారం సిద్దిపేటలో జరిగిన విశాల జనసభలో అమిత్‌ షా ప్రసంగించారు. తెలంగాణకు అవినీతి నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రస్తుత కాంగ్రెస్‌ ఎందుకు వెలికితీయడం లేదని ప్రశ్నించారు. ఇక్కడి ప్రభుత్వం ఢిల్లీ కాంగ్రె్‌సకు ఏటీఎంగా మారిందన్నారు. మూడోసారి మోదీ ప్రధానమంత్రి కాగానే తెలంగాణలో అవినీతి కనుమరుగు అవుతుందని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ 12 స్థానాలు, దేశంలో 400 పైచిలుకు సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు మజ్లి్‌సకు భయపడి సెప్టెంబరు 17న విమోచన దినోత్సవం కూడా జరపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికీ భయపడకుండా బీజేపీ విమోచన దినోత్సవాన్ని జరుపుతోందని గుర్తుచేశారు. మెదక్‌లో రఘునందన్‌రావును గెలిపించాలని కోరారు. దేశంలో క్లిష్టమైన అనేక సమస్యలను పరిష్కరించామని అమిత్‌ షా చెప్పారు. అయోధ్య కేసును గెలిచి, భవ్యమైన రామాలయాన్ని నిర్మించామని తెలిపారు. అయోధ్యలో రామమందిరం కట్టవద్దనే ఆలోచన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల్లో ఉండేదని ఆరోపించారు. ఇక ఆర్టికల్‌ 370ని రద్దు చేసి కశ్మీర్‌ అంశానికి శాశ్వత పరిష్కారం చూపించిన ఘనత బీజేపీకే దక్కుతుందని వెల్లడించారు. కాగా, మధ్యాహ్నం 12 గంటలకు సభకు రావాల్సిన షా.. 1.56 గంటలకు వేదికపైకి వచ్చారు. కేవలం 8 నిమిషాల పాటు మాట్లాడి ముగించారు. అమిత్‌ షా ప్రసంగిస్తుండగా సభ మధ్యలో నుంచి ఒక్కసారిగా నిరసన గళాలు వినిపించడంతో రసాభాసగా మారింది. తమ డబ్బులు చెల్లించాలంటూ కొంతమంది ‘సహారా’ బాధితులు నినాదాలు చేశారు. పోలీసులు వారించినా ఆగలేదు.


ప్రపంచం మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తోంది..

ప్రపంచం మొత్తం మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తోందని, మోదీ మూడోసారి ప్రధాని అయ్యే విధంగా అందరూ మద్దతివ్వాలని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి కోరారు. గురువారం నిజామాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పాలనంతా అవినీతి, అక్రమాలేనని దేశ రక్షణను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రజలను దోచుకునే పార్టీలని ఆరోపించారు. ఇండియా కూటమికి విదేశాల నుంచి కూడా ఫండింగ్‌ వస్తోందని ఆరోపించారు. ఇందూరులో ప్రధాని మోదీని చూసి అర్వింద్‌కు ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. అర్వింద్‌ను గెలిపిస్తే పసుపు బోర్డును పూర్తిస్థాయిలో పని చేయిస్తారని చెప్పారు. మూడోసారి అధికారంలోకి రాగానే నిజాంషుగర్‌ ఫ్యాక్టరీపై కూడా నిర్ణయం తీసుకుంటామని ధామి తెలిపారు.


చేసింది బీజేపీ.. చెప్పుకునేది బీఆర్‌ఎస్‌: రఘునందన్‌

సిద్దిపేటకు రైలు తేవడం నుంచి ఎన్నో అభివృద్ధి పనులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాకారం చేస్తే.. బీఆర్‌ఎస్‌ వాళ్లు తమ ఖాతాలో వేసుకుంటున్నారని మెదక్‌ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ మండిపడ్డారు. చేసింది తామైతే.. చెప్పుకునేది హరీశ్‌రావు అని ఆరోపించారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే బాలరాముడి దర్శనానికి సిద్దిపేట నుంచి అయోధ్యకు రైలు సౌకర్యం కల్పిస్తానని పేర్కొన్నారు. ఎంతోమంది రైతులను ఇబ్బందులు పెట్టిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామారెడ్డిని ప్రజలు తిరస్కరించాలని కోరారు. ఇక నాలుగు పార్టీలు మారిన కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.


దేశమంతా మోదీ గాలి.. బీజేపీకి 400 సీట్లు

దేశంలో మోదీ గాలి వీస్తోందని, లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలిచి బీజేపీ తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ అన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌ప్రసాద్‌కు మద్దతుగా నాగర్‌కర్నూల్‌లో గురువారం నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా స్థానిక అంబేడ్కర్‌ కూడలిలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం భారతదేశాన్ని ప్రగతి వైపు నడిపిస్తుందని చెప్పారు. నాగర్‌కర్నూల్‌ బీజేపీ అభ్యర్థి భరత్‌ప్రసాద్‌ను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం పదేళ్లలో అబాసుపాలైతే కాంగ్రెస్‌ సర్కారు కేవలం వంద రోజుల్లోనే చులకన అయ్యిందని విమర్శించారు. తెలంగాణలో తమ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచి సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

For More Telangana and Telugu News..

Updated Date - Apr 26 , 2024 | 08:52 AM