Share News

Telangana News: కవితతో భేటీ.. సంచలన కామెంట్స్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

ABN , Publish Date - May 17 , 2024 | 02:05 PM

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ఛాలా ధైర్యంగా ఉన్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన తీహార్‌ జైల్లో కవితను ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై లిక్కర్ స్కామ్ కేసు పెట్టారని ఆరోపించారు.

Telangana News: కవితతో భేటీ.. సంచలన కామెంట్స్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..
RS Praveen Kumar

న్యూఢిల్లీ, మే 17: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ఛాలా ధైర్యంగా ఉన్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన తీహార్‌ జైల్లో కవితను ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై లిక్కర్ స్కామ్ కేసు పెట్టారని ఆరోపించారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారనే నమ్మకంతో కవిత ఉన్నారన్నారు. లాయర్‌కు నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అరెస్ట్ చేసిందంటే.. ఎంత దారుణంగా పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ఈ కేసులో రాత్రికి రాత్రే జడ్జిని మార్చేశారని విమర్శించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.


రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తాయని.. అందులో ఉన్నవాళ్ళందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా? అని ఆర్ఎస్ ప్రవీణ్ పేర్కొన్నారు. రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోడీ తీసుకొచ్చారని.. వాటిని ఎవరి ప్రయోజనాలకోసం తీసుకొచ్చారని ప్రశ్నించారాయన. కవిత దగ్గర ఒక్క రూపాయి డబ్బు దొరకలేదని.. పీఎంఎల్‌ఏ కేసు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. అసలు ఈ కేసులో లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలే లేవని.. అలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. వాళ్ల పేర్లు.. వీళ్ల పేర్లు చెప్పండంటూ ఆమెపై అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లుగా కవిత చెప్పారన్నారు. ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. బీజేపీలో చేరిన వారిపై ఒకలా.. చేరని వారిపై మరోలా సెలెక్టీవ్‌గా ఈడీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విపక్షాల గొంతు నొక్కేందుకే సీబీఐ, ఈడీని బీజేపీ వాడుకుంటోందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.


కవిత చాలా ధైర్యంగా ఉన్నారు: బాల్క సుమన్

కవిత చాలా దైర్యంగా ఉన్నారని, మానసికంగా చాలా బలంగా ఉన్నారని బాల్క సుమన్ తెలిపారు. సుమన్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్‌తో కలిసి తీహార్ జైల్లో కవితను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుమన్.. విపక్ష నాయకులను అణిచివేయలనే అన్యాయంగా కవితను ఈకేసులో ఈరికించారని ఆరోపించారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని.. న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో కవిత ఉన్నారని తెలిపారు. బీజేపీకి ఎవరూ ఎదురు ఉండకూడదనే ప్రతిపక్ష పార్టీలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని సుమన్ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసు కేసే కాదని, అదొక పాలసీ అని అన్నారు. దాన్ని బూచిగా చూపించి తెలంగాణలో బీఆర్ఎస్, ఢిల్లీలో ఆప్ పార్టీని దెబ్బతీసే కుట్రకు బీజేపీ తెరలేపిందని సుమన్ ఆరోపించారు.


లిక్కర్ పాలసీతో ఢిల్లీ ప్రభుత్వానికి లాభమే జరిగిందన్నారు సుమన్. బీజేపీ వంటకాన్ని వండి.. సీబీఐ, ఈడీని ఆప్, బీఆర్ఎస్ మీదకి వదిలిందని బాల్క సుమన్ ఆరోపించారు. ఇలాంటి కేసులతో తాము భయబ్రాంతులకు గురవుతామనే భ్రమలో బీజేపీ నేతలు ఉన్నారని.. కానీ భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సుమన్. దేశంలో పాసిస్ట్ పాలన నడుస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నదని.. ఆ పార్టీకి 220 సీట్లు కూడా దాటదని అన్నారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని అన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలను జైల్లో పెట్టి ప్రజాతీర్పును వారికి అనుకూలంగా మార్చుకునే ఎత్తుగడలకు ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పనున్నారని పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా తలవంచకుండా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని బాల్క సుమన్ చెప్పారు.

For More Telangana News and Telugu News..

Updated Date - May 17 , 2024 | 02:05 PM