Share News

Jupalli Krishnarao: తెలంగాణలో ఆ దేశాలకి మించిన పర్యాటక ప్రాంతాలున్నాయి..

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:59 AM

మహబూబ్‌నగర్.. జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన పిల్లలమర్రి పర్యటక కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యన్నం శ్రీనివాస్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తదితరులు సందర్శించారు.

Jupalli Krishnarao: తెలంగాణలో ఆ దేశాలకి మించిన పర్యాటక ప్రాంతాలున్నాయి..

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్.. జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన పిల్లలమర్రి పర్యటక కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యన్నం శ్రీనివాస్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పాశ్చాత్య దేశాల మాదిరిగానే రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. టూరిజం అభివృద్ధికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో టూరిజంతో పాటు అన్ని రంగాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని జూపల్లి తెలిపారు. తూర్పు, మధ్య ఆసియా దేశాలకి మించిన పర్యాటక ప్రాంతాలు మన దేశంలో, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని వెల్లడించారు.


పర్యాటక ప్రాంతాలు అన్నిటిపై విస్తృత ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని టూరిజం కేంద్రాలలో పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. టూరిజంకు మార్కెట్ కల్పించనున్నామన్నారు. యాంత్రిక జీవనంలో టూరిజం వల్ల వినోదం కలుగుతుందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా టూరిజం అభివృద్ధికి తక్షణమే 5 కోట్ల రూపాయలను ప్రకటిస్తున్నామని జూపల్లి తెలిపారు. ఆసియా ఖండంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతలుగాంచిన పిల్లల మర్రి చెట్టును పర్యటకులకు ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టూరిజం సర్క్యూట్ ను ఏర్పాటు చేయనున్నామని జూపల్లి తెలిపారు. ముఖ్యంగా నల్లమల అభయారణ్యం, మల్లెల తీర్థం, సోమశిల, సరళసాగర్, కోయిల్ సాగర్‌తో పాటు, ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు.


అన్ని పర్యాటక ప్రాంతాలనూ కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేయనున్నామని జూపల్లి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 150 కిలో మీటర్ల నిడివి గల కృష్ణానది ఉందని పేర్కొన్నారు. కృష్ణా బ్యాక్ వాటర్‌లో వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రామప్ప, పాండవుల గుట్ట, గోల్కొండ వంటి ఎన్నో పర్యాటక, చారిత్రక ప్రదేశాలు చూడాల్సినవి ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ నెలలో కనీసం ఒక్కసారైనా ఉపశమనం పొందేందుకు పర్యాటక ప్రాంతాలు సందర్శించాలన్నారు. రాష్ట్రంలో టెంపుల్ టూరిజంతో పాటు, ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

Updated Date - Aug 21 , 2024 | 11:59 AM