బిఆర్‌ఎస్ కేసుల విషయంలో కాంగ్రెస్ యూటర్న్
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:37 AM
బీఆర్‌ఎస్ కేసుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కరీంనగర్‌లోని తన నివాసంలో ప్రధాని మోడి మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని తల్లితో కలిసి ఆదివారం వీక్షించారు.

కరీంనగర్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఆర్‌ఎస్ కేసుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కరీంనగర్‌లోని తన నివాసంలో ప్రధాని మోడి మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని తల్లితో కలిసి ఆదివారం వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కేసులపై కాగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును పూర్తిగా నీరు గారుస్తున్నారన్నారు. శ్రవణ్‌రావుకు బెయిల్ వచ్చేలా చేసి కాంగ్రెస్ సహకరిస్తుందని విమర్శించారు. గత ఎన్నికల ముందు కేసీఆర్‌ను జైల్లో వేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి సర్కార్ యూటర్న్ తీసుకుందన్నారు. కాంగ్రెస్ పాలనను చూస్తే జ్యోతిష్య పండితులు చెప్పేది నిజమేననిస్తోందన్నారు. ఏడాదిగా దొంగతనాలు ఎక్కువై పోయాయని, ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ శాఖలో చూసినా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. కాంగ్రెస్ నేతలకు కరప్షన్ వైరస్ సోకిందన్నారు. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి పెండింగ్ బిల్లుల వరకు ప్రతి దాంట్లోనూ కమీషన్లు ఇవ్వనిదే పని జరగడం లేదన్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీని స్వాగతిస్తున్నామని, బియ్యం ఖర్చంతా కేంద్రమే భరిస్తుందన్నారు. ఒక్కో కిలోకు మోదీ ప్రభుత్వం 40 రూపాయలు చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై పది రూపాయలు మాత్రమే పడుతుందన్నారు. ప్రజల దృష్టిని దారి మళ్లించడానికి డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారన్నారు. దేశాన్ని విభజిస్తామంటూ బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుత దేశద్రోహానికి పాల్పడుతున్నారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ దేశభక్తి కలిగిన సంస్థ అని దేశం ధర్మం, సనాతన ధర్మం, హిందు సమాజం సంఘటితం చేసేందుకు నిరంతరం కృషి చేస్తు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఏనాడు ఉగ్రవాదులను పెంచి పోహించలేదన్నారు. ఉగ్రవాదులకు బెయిల్ కోసం ఏనాడు పాటు పడలేదన్నారు. ఒవైసీ ఆసుపత్రిలో ఉగ్రవాదులు దొరికారన్నారు. దారుస్సలాం టెర్రరిస్టులకు అడ్డాగా మారిందన్నారు. మజ్లిస్‌కు తెలంగాణ అంతటా పోటి చేసే దమ్మే లేదన్నారు. అధికారంలో ఏ పార్టీఉంటే ఆ పార్టీకి అమ్ముడు పోయే పార్టీ మజ్లిస్ అని విమర్శించారు. వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుపై అందరి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. అతి త్వరలోనే పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందడం తథ్యమన్నారు. సమావేశంలో మాజీ మేయర్ సునీల్‌రావు, వాసాల రమేష్ పాల్గొన్నారు.