Sridhar Babu: తెలంగాణకు తోడ్పాటు అందించండి
ABN , Publish Date - Sep 14 , 2024 | 03:18 AM
రానున్న పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల వార్షిక ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ప్రగతి బావుటాను ఎగురవేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం
ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు సహకరించండి
నిజామాబాద్‌లో పసుపు యూనిట్ ఏర్పాటు చేయండి
కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): రానున్న పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల వార్షిక ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ప్రగతి బావుటాను ఎగురవేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం విశాల దృక్పథంతో మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. శుక్రవారం ముంబైలో జరిగిన జాతీయ వాణిజ్య మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాత్మక ప్రణాళికలు, లక్ష్యాలను వివరించారు. కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయెల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. వాణిజ్య విధానాలు, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకునే మార్పులపై చర్చించారు. సమావేశంలో పలు రాష్ట్రాల వాణిజ్య శాఖల మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రాలకు నిధులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన టైస్ (ట్రేడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్‌పోర్ట్ స్కీం), సంప్రదాయ పరిశ్రమల పథకాలకు కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో విఫలమయ్యాయని తెలిపారు.
తెలంగాణ అవసరాలను ప్రత్యేక దృష్టితో పరిశీలించి తోడ్పాటు అందించాలని కేంద్రాన్ని కోరారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఖమ్మం లేదా మహబూబాబాద్‌లో మిర్చిని త్వరితగతిన ఎండబెట్టే ప్లాంటును ఏర్పాటు చేస్తే నాణ్యత పెరిగి ఎగుమతులకు గిరాకీ పెరుగుతుందని వివరించారు. నిజామాబాద్ లేదా వరంగల్‌లో సుగంధ ద్రవ్యాల ప్రయోగశాలను ఏర్పాటు చేసి నాణ్యత ప్రమాణాల సర్టిఫికెట్లు జారీ చేయాలని కోరారు. పండ్లు, కూరగాయల నిల్వ సమయం పెంచేందుకు ఇరాడియేషన్ ప్లాంటు ఏర్పాటుకు సరిపడా నిధులు విడుదల చేస్తే ఆహార వ్యర్థాన్ని నివారించవచ్చన్నారు.
తొందరగా పాడయ్యే పాలు, గుడ్లు, కూరగాయలు ఎగుమతి చేసేందుకు వీలుగా శీతల రవాణా, కోల్డ్ స్టోరేజి సదుపాయాలను కల్పించాలన్నారు. సోనా మసూరి బియ్యానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగింగ్‌ను సమకూర్చాలని, పారిశ్రామిక వాడల సమీపంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, కరీంనగర్ లేదా వరంగల్‌లో గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్లు, తెలంగాణ ఎగుమతుల్లో ఔషధాలు, వ్యాక్సిన్లు, రసాయనాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఎలకా్ట్రనిక్స్ ముఖ్యమైన భూమికను పోషిస్తున్నాయని, ఈ రంగాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం సహకారం అవసరమన్నారు. రాష్ట్రంలో వస్త్రాల ఉత్పత్తి, ప్లాస్టిక్, పాలిమర్స్, వైద్య పరికరాల తయారీకి అనుకూల వాతావరణం ఉందని, కేంద్రం మద్దతిస్తే ఆయా రంగాలు వేగంగా వృద్ధి చెంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.