Share News

TGRTC: బస్సులు ఫుల్లు.. బాకీలూ ఫుల్లే!

ABN , Publish Date - Aug 05 , 2024 | 04:05 AM

టీజీఎ్‌సఆర్టీసీ పరిస్థితి ‘బస్సులు ఫుల్లు... బాకీలూ ఫుల్లే’ అన్నట్టు తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగింది.

TGRTC: బస్సులు ఫుల్లు.. బాకీలూ ఫుల్లే!

  • లెక్కల్లోనే ఆదాయం.. ఆర్టీసీ చేతికందని వైనం.. ‘మహాలక్ష్మి’ పథకం బకాయిలు రూ.2,400 కోట్లు

హైదరాబాద్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): టీజీఎ్‌సఆర్టీసీ పరిస్థితి ‘బస్సులు ఫుల్లు... బాకీలూ ఫుల్లే’ అన్నట్టు తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగింది. మహిళలకు ‘జీరో టిక్కెట్లు’ ఇస్తుండడంతో ఆదాయం వచ్చినట్టు ఆర్టీసీ లెక్కల్లో కన్పిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ చార్జీల సొమ్మును విడుదల చేయకపోవడంతో బాకీలూ ఫుల్లుగానే ఉన్నాయి.


ఉచిత ప్రయాణాన్ని ఇప్పటివరకు సుమారు 72 కోట్ల మంది మహిళలు వినియోగించుకోగా ప్రభుత్వం రూ.2,400 కోట్ల వరకు ఆర్టీసీకి చెల్లించవలసి ఉంది. ఈ నిధులు అందక కొత్త బస్సుల కొనుగోలు, బస్‌ స్టేషన్ల మరమ్మతులు నిలిచిపోయాయి. ఈ పథకానికి రోజుకు రూ.10 కోట్లకు పైగా ఆర్టీసీ ఖర్చు చేస్తోంది. మరోవైపు, రోజుకు ఒక్కో డిపో నుంచి రూ.లక్ష అదనపు ఆదాయం లక్ష్యంగా పనిచేయాలనే ఆదేశాలతో ఆర్టీసీ కార్మికులు సతమతమవుతున్నారు.


  • పీఆర్‌సీ బాండ్ల బకాయిలేవీ?

పీఆర్‌సీ బాండ్ల బకాయిలు, రిటైర్డ్‌ కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు అందించలేక ఆర్టీసీ సతమతమవుతోంది. 2020 అక్టోబరులో చెల్లించాల్సిన 2013 పీఆర్‌సీ బాండ్ల బకాయిలు రూ.280 కోట్లు ఫిబ్రవరిలో విడుదల చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటి వరకు రూ.80 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. అలాగే 2017 పీఆర్‌సీ బకాయిలు సుమారు రూ.418 కోట్ల చెల్లింపుపై స్పష్టత లేకపోవడంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. వారి వేతనాల నుంచి మినహాయించిన సుమారు రూ.3,850 కోట్లకుపైగా సొమ్మును ఆర్టీసీ దారి మళ్లించినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. రవాణా శాఖకు వాహనాల పన్ను రూపంలో సుమారు రూ.692.58 కోట్లు ఆర్టీసీ బకాయిలు ఉన్నట్టు తెలిసింది.


  • రూ.310 కోట్లతో నడిచేదెలా?

కార్మికుల వేతనాలు, డీజిల్‌, ఇతర అవసరాలకు ఆర్టీసీ నెలకు సుమారు రూ.370 కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ వచ్చే రూ.310 కోట్ల ఆదాయం చాలకపోవడంతో ఆర్టీసీ అధికారులు బ్యాంకులపై ఆధారపడుతున్నారు. ఓడీ రూపంలో రుణం తీసుకుని కార్మికులకు వేతనాలు సర్దుబాటు చేస్తున్నారు. దీంతో రుణ భారం పెరిగిపోయింది. నెలకు సుమారు రూ.65 కోట్ల వరకు బ్యాంకులకు చెల్లించవలసి ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కార్మికుల బకాయిలపై సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రవాణా శాఖకు కేటాయింపులు రూ.4084.43 కోట్లకు సవరించినప్పటికీ విడుదలపై కార్మికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 05 , 2024 | 04:05 AM