Traffic Restrictions: హైదరాబాద్‌లోని ఆ ప్రాంతంలో ఇవాళ, మరో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Sep 03 , 2024 | 09:40 AM
సైబరాబాద్‌లో ఇవాళ, 6వ తేదీ, 9వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. కాబట్టి అటు వైపునకు వెళ్లాలనుకునేవారు అలర్ట్‌గా ఉండటం మేలు. హైదరాబాద్ నగరంలోని జీఎంసీ బాలయోగి స్టేడియం మరో అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతోంది.
హైదరాబాద్: సైబరాబాద్‌లో ఇవాళ, 6వ తేదీ, 9వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. కాబట్టి అటు వైపునకు వెళ్లాలనుకునేవారు అలర్ట్‌గా ఉండటం మేలు. హైదరాబాద్ నగరంలోని జీఎంసీ బాలయోగి స్టేడియం మరో అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతోంది. హైదరాబాద్ నగరానికి ఫుట్‌బాల్‌తో గట్టి సంబంధం ఉండేది. అయితే ఇటీవలి కాలంలో ఈ క్రీడ ఇక్కడ ప్రాధాన్యతను కోల్పోతోంది. ఈ క్రమంలోనే పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఇంటర్ కాంటినెంటల్ కప్‌ను నిర్వహించనున్నట్టు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే. శివసేనారెడ్డి అన్నారు. 2024 సెప్టెంబర్ 3, 6, 9 తేదీలలో ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024 ఫుట్‌బాల్ టోర్నమెంట్ పోటీలు గచ్చిబౌలిలోని జీఎంసీబీ స్టేడియంలో జరుగనున్నాయి.
భారతదేశం, సిరియా, మారిషస్‌ల మధ్య టోర్నమెంట్ జరగనుంది. సెప్టెంబర్ 3, 6, 9 తేదీలలో సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకూ గచ్చిబౌలి స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు నెలకొననున్నాయి. కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్లేవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) సమన్వయంతో ఈ ఫుట్‌బాల్ టోర్నీని నిర్వహించనున్నాయి. టోర్నీలో భాగంగా ఇవాళ భారత్.. మారిషస్‌తో తలపడనుంది. 9న సిరియాతో తలపడనుంది. మారిషస్, సిరియా మధ్య 6న మ్యాచ్ జరుగనుంది. మొత్తానికి గచ్చిబౌలిలో టోర్నమెంట్‌తో సందడి నెలకొంది.